కరోనా కట్టడిలో ఖైదీలు సైతం!

ABN , First Publish Date - 2021-05-14T08:12:19+05:30 IST

కరోనా నియంత్రణకు శాస్త్రవేత్తలు, డాక్టర్లు, పారిశుధ్య కార్మికులు, పోలీసులు... ఇలా ప్రతి ఒక్కరూ తమ వంతుగా ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నారు

కరోనా కట్టడిలో ఖైదీలు సైతం!

జైళ్లలో ఐరన్‌ బెడ్స్‌, స్టాండ్స్‌, మాస్కులు, శానిటైజర్‌ తయారీ

ఏడాదిలో 550 కోట్ల వ్యాపారం

11,69,912 మాస్క్‌ల తయారీ

2,31,960 లీటర్ల శానిటైజర్‌

ఆస్పత్రులకు 3,342 ఐరన్‌ బెడ్స్‌

25,900 లీటర్ల హ్యాండ్‌ వాష్‌

40,300 సబ్బుల తయారీ కూడా

వేలాది మంది ఖైదీలకు ఉపాధి

వారందరికీ పెరిగిన ఆదాయం


హైదరాబాద్‌, మే 13 (ఆంధ్రజ్యోతి) : కరోనా నియంత్రణకు శాస్త్రవేత్తలు, డాక్టర్లు, పారిశుధ్య కార్మికులు, పోలీసులు... ఇలా ప్రతి ఒక్కరూ తమ వంతుగా ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చేసిన తప్పుకు అయినవాళ్లకు దూరమై, నాలుగు గోడల మధ్య ఒంటరిగా జీవితం వెళ్లదీస్తున్న ఖైదీలు కరోనా కట్టడిలో ‘మేము సైతం’ అంటూ పనిచేస్తున్నారు. లక్షలాది మాస్కులు, లక్షల లీటర్ల శానిటైజర్‌, ఇనుప మంచాలు, స్టాండ్లతోపాటు ఇతర వస్తువుల్ని తయారు చేస్తున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ 1 నుంచి  ఈ మార్చి 31 వరకు జైళ్ల శాఖ సుమారు రూ.550 కోట్ల వ్యాపారం చేసింది. మాస్కులు 11 లక్షల 69 వేల 912, శానిటైజర్‌ 2 లక్షల 31 వేల 960 లీటర్లు, ఇనప మంచాలు 3 వేల 342, హ్యాండ్‌ వాష్‌ 25 వేల 900 లీటర్లు, 40 వేల 300 సబ్బులు, ఇంకా పలురకాల ఇతర వస్తువులు తయారు చేశారు. ‘మై నేషన్‌ బ్రాండ్‌ ’తో తయారయ్యే జైళ్ల శాఖ ఉత్పత్తుల్ని మొదట తమ శాఖ ఆధ్వర్యంలోని అవుట్‌లెట్లలో అమ్మకానికి పెట్టారు. ఊహించని విధంగా ఆదరణ లభించడంతో ఖైదీలతో షిప్టులవారీగా పనిచేయించి ఉత్పత్తి పెంచారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, ప్రైవేటు సంస్థలు వీటి కొనుగోలుకు ఆసక్తి కనబర్చాయి. జైళ్లల్లో పనిచేేస ఖైదీలకు వారు చేేస పనిని బట్టి కొంత మొత్తం చెల్లిస్తుంటారు. కరోనా వచ్చిన తర్వాత ఖైదీల ఆదాయం పెరిగింది. 


త్రీ ప్లే మాస్కులకు మూడు రకాల కాటన్‌ క్లాత్‌ ఉపయోగిస్తున్నారు. మాస్కుల తయారీలో చర్లపల్లి, చంచల్‌గూడ, వరంగల్‌  కేంద్ర కారాగారాలతోపాటు రాష్ట్రంలోని ఇతర జైళ్లల్లో వేలాది మంది ఖైదీలు పనిచేస్తున్నారు. ముడిపదార్థాలు జైళ్ల శాఖే అందిస్తుంది.  ఒక్క మాస్క్‌ తయారు చేసినందుకు ఖైదీలకు మొదట్లో రూ.2, ఆ తర్వాత రూ.3 చెల్లిస్తున్నారు. లీటరు శానిటైజర్‌ తయారీకి రూ.1 చెల్లిస్తున్నారు. ఈ మొత్తాన్ని ఖైదీలకు నేరుగా ఇవ్వడం కాకుండా వారి ఖాతాలో జమచేస్తున్నారు. మార్కెట్‌లో మాస్క్‌ రూ.20, లీటరు శానిటైజరు రూ.180కి విక్రయిస్తున్నారు. కరోనా తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్‌ల కొరత ఏర్పడింది. వందల సంఖ్యలో ఇనప బెడ్ల ఆర్డర్లు వచ్చిపడ్డాయి. రోజుల వ్యవధిలోనే ఆర్డర్‌ ప్రకారం ఇన ప బెడ్లు తయారు చేసి అందించారు.  హ్యాండ్‌ వాష్‌, స్టాండ్స్‌కి డిమాండ్‌ పెరిగింది. దీంతో కాలితో తొక్కి శానిటైజర్‌ రేస్ప చేసుకునే స్టాండ్స్‌ తయారు చేసి మార్కెట్‌ చేస్తున్నారు.  

Updated Date - 2021-05-14T08:12:19+05:30 IST