Abn logo
Oct 27 2021 @ 22:57PM

దొనకొండలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హాల్టింగ్‌ ఎన్నడో ?

దొనకొండ రైల్వేస్టేషన్‌

 రైల్వే జనరల్‌ మేనేజర్‌ పర్యటనలో కానరాని స్పష్టత 

ఎంపీ మాగుంట చొరవకు కానరాని స్పంధన 

ఎంపీ మాగుంట ప్రత్యేక చొరవ తీసుకోవాలంటూ ప్రజలు విజ్ఞప్తి

దొనకొండ, అక్టోబరు 27 : దొనకొండ రైల్వేస్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హాల్టింగ్‌ సౌకర్యం ఎప్పుడు కల్పిస్తారో  అర్థంకాని పరిస్ధితి ప్రజల్లో నెలకొంది. దక్షణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌మాల్యా గత నెల13వ తేదీన దొనకొండ పర్యటనకు విచ్చేసిన సందర్భంగా ఈ విషయంపై స్పష్టత వస్తుందని ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూశారు. జీఎం ఆ రోజు ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారేగాని ఎటువంటి హమీ ఇవ్వకపోవటంతో ఆరోజు ప్రజలు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. దొనకొండలో జీఎం పర్యటన ముగిసి దాదాపు నెలన్నర రోజులు దాటినా నేటికీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు దొనకొండలో ఆగకుండా పరుగులు తీస్తున్నాయి. జీఎంకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. దొనకొండలో  ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హాల్టింగ్‌ సౌకర్యం లేకపోవటంతో వివిధ పట్టణ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌మాల్యా సెప్టెంబరు 29వ తేదీన విజయవాడ లో రాష్ట్ర ఎంపీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దీంతో స్థానిక ప్రభు చారిటబుల్‌ డెవల్‌పమెంట్‌ సొసైటీ నిర్వాహకులు ఆదిమూలపు ప్రభుదాసు, దొనకొండ ఉప సర్పంచ్‌ పఠాన్‌ ఇమ్రాన్‌ఖాన్‌ మరికొందరు దొనకొండలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల హల్టింగ్‌ విషయం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి విజయవాడకు వెళ్లి విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై అదే రోజు ఎంపీ మాగుంట రైల్వే జీఎంకు సమస్యను వివరించి వినతిపత్రం అందించారు. ఆ రోజు రైల్వే జీఎం సానుకూలంగా స్పందించినా  నేటికీ ఎటువంటి స్పందన లేకపోయింది. దీంతో అసలు దొనకొండలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హాల్టింగ్‌ సౌకర్యం కలుగుతుందో లేదో నంటూ ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు.