అందరి దృష్టి ఆ సమావేశం పైనే!

ABN , First Publish Date - 2021-10-24T05:50:02+05:30 IST

తెలంగాణ విశ్వవిద్యాలయంలో తాత్కాలిక నియామకాలకు కమిషనర్‌ చెక్‌ పెట్టడంతో అధ్యాపక, విద్యార్థి సంఘాలలో చర్చ మొదలైంది. కొత్త నియామకాలలో పాత్ర ఉన్న వారిపై ఈనెల 30న చర్యలు చేపడతారని ఒక వర్గం చెబుతుండగా.. మరో వర్గం నష్టనివారణ చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది.

అందరి దృష్టి ఆ సమావేశం పైనే!

టీయూలో తాత్కాలిక నియామకాల రద్దుపై జిల్లాలో తీవ్రమైన చర్చ

ఈనెల 30న జరిగే ఈసీ సమావేశంపైనే అందరి దృష్టి

నిజామాబాద్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణ విశ్వవిద్యాలయంలో తాత్కాలిక నియామకాలకు కమిషనర్‌ చెక్‌ పెట్టడంతో అధ్యాపక, విద్యార్థి సంఘాలలో చర్చ మొదలైంది. కొత్త నియామకాలలో పాత్ర ఉన్న వారిపై ఈనెల 30న చర్యలు చేపడతారని ఒక వర్గం చెబుతుండగా.. మరో వర్గం నష్టనివారణ చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. టీయూలో నియామకాలలో కొంత మంది నేతలు, వారి అనుచరుల పాత్ర కూడా ఉండడంతో వారందరిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నిఘా వర్గం నివేదికలు పంపినట్ల తెలుస్తోంది. టీయూలో తాత్కాలిక నియామకాల వ్యవహారం రాష్ట్ర స్థాయిలో దుమారం రేపింది. అవసరానికి మించి విశ్వవిద్యాలయంలో తాత్కాలిక నియామకాలు చేపట్టడం సంచలనం సృష్టించగా.. విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఈసీ సభ్యులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేయడంతో సీరియస్‌ అయింది. చివరకు ఉన్నత విద్యా కమిషనర్‌ జోక్యం చేసుకోవడంతో నియామకాలకు తెరపడింది. నిబంధనలకు విరుద్ధంగా తాత్కాలిక నియామకాలు చేయడంతో వాటిని రద్దుచేశారు. ఈ నెల 30న టీయూలో మరో ఈసీ సమావేశంను నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంపైనే అందరిదృష్టి కొనసాగుతుంది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు కీలకంగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 

టీయూ విస్తరణ, అవసరాల పేరున అవుట్‌సోర్సింగ్‌ ద్వారా తాత్కాలిక నియామకాలు చేపట్టారు. వీటి నియామకాలలో డబ్బులు భారీగా చేతులు మారాయి. నోటిఫికేషన్‌ ఉన్నత విద్యాశాఖ అనుమతులు లేకుండా ఈ నియామకాలు చేపట్టడంతో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన తీవ్రమైంది. విశ్వవిద్యాలయంలో చేపట్టిన ఈ తాత్కాలిక నియామకాలలో కొంతమంది నేతల అనుచరుల పాత్ర కూడా ఉన్నట్టు తెలుస్తోంది. నేతలకు కీలక అనుచరులుగా ఉన్న కొంతమంది పలువురు వ్యక్తులకు తాత్కాలిక నియామకాలలో పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. వీరి సిఫారసులలో కొంత మందికి నియామకాలను చేసినట్టు తెలుస్తోంది. అధికార పార్టీ నేతలకు దగ్గరి వారు కావడంతో విశ్వవిద్యాలయం అధికారులు తాము చేసే పోస్టు లే కాకుండా వీటిని కలిపి నియామకాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం దుమారం రేపడం జిల్లా ప్రజాప్రతినిధులు విశ్వవిద్యాలయం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం నివేదిక కోరినట్టు తెలుస్తోంది. నిఘా వర్గం వారు ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఈ నియామకాలను రద్దుచేసినట్లు తెలుస్తోంది. టీయూ పరిధిలో జరిగిన నియామకాలపై పాత్ర ఉన్న కొంత మందిపై కూడా చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈనెల 30న విశ్వవిద్యాలయంలో జరిగే ఈసీ మీటింగ్‌ తర్వాతనే అసలు విషయం తేలే అవకాశం ఉంది. ఎవరిపైన చర్యలు ఉంటాయో బయటకు రానుంది.

‘విద్యార్థి సంఘాల విజయం’

నిజామాబాద్‌అర్బన్‌/డిచ్‌పల్లి, అక్టోబరు 23: తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి.. యూనివర్సిటీలో జరిగిన అవినీతి అక్రమ నియామకాలను రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయం విద్యార్థి సంఘాల విజయమని విద్యార్థి సంఘాల నాయకులు శ్రీనివాస్‌గౌడ్‌, రవికుమార్‌, పులి జైపాల్‌, యెండల ప్రదీప్‌, పిల్లి శ్రీకాంత్‌, లాల్‌సింగ్‌లు అన్నారు. శనివారం నగరంలో ని టీఎన్‌జీవోస్‌ హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో యూనివర్సిటీ పరిరక్షణ కమిటీ, పూర్వ విద్యార్థుల సంఘం, స్కాలర్స్‌ అసొసియేషన్‌, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నెల రోజులుగా యూనివర్సిటీలో అవినీతి అక్రమాలను ఆధారాలతో సహా విద్యార్థి సంఘాలు చూపించగా అందుకు సహకరించిన మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. వర్సిటీ నిధులు వృథాకాకుండా చూసిన పాలకమండలి సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థి సంఘాల నాయకులపై వీసీ ఇష్టానుసారంగా మాట్లాడారని వర్సిటీ సాధనలో కీలకపాత్ర పోషించిన విద్యార్థి సంఘాల నాయకులపై వీసీ ఆరోపణలు చేసి గొడవను యూనివర్సిటీ అధికారులకు, విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య జరిగిన గొడవగా చిత్రీకరించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారన్నారు. అక్రమంగా నియమించిన వారినివెంటనే తొలగించి వారి డబ్బులు ఇచ్చేయాలని, పనిచేసిన కాలానికి వారికి వేతనాలు ఇవ్వాలని కోరారు. విద్యార్థి సంఘాలు ఎప్పుడు యూ నివర్సిటీ అభివృద్ధికే పాటుపడతాయని, మరొకసారి విద్యార్థి సంఘాల పోరాటాలను హేళన చేస్తే సహించేందిలేదని వారన్నారు. ఈ సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు భానుచందర్‌, మహేష్‌రెడ్డి, మ ధుకర్‌రెడ్డి, వినాయక్‌, అజయ్‌ పాల్గొన్నారు. 

టీయూ ప్రక్షాళనలకు నాంది

వర్సిటీలో అక్రమ ఉద్యోగాల రద్దును తాము స్వాగతిస్తున్నామని, ఈ చర్య తెలంగాణ యూనివర్సిటీ ప్రక్షాళనకు నాంది కావాలని పీడీఎస్‌యూ, పీవైఎల్‌, పీవోడబ్ల్యూ, ఐఎప్‌టీయూ నాయకులు కల్పన, సుమన్‌, సుధాకర్‌, సంధ్యరాణి పేర్కొన్నారు. యూనివర్సిటీలో అక్రమ నియామకాలు రద్దు, వర్సిటీలో జరిగిన పరిణామాలపై విలేకరులతో మాట్లాడుతూ.. ఇది విద్యార్థుల విజయమని అన్నారు. మున్ముందు ఇలా జరగకుండా చూడాలని వారు సూరించారు.

పీడీఎస్‌యూ నిరంతర పోరాటం 

తెలంగాణ యూనివర్సిటీలో అవినీతికి వ్యతిరేకంగా పీడీఎస్‌యూ నిరంతరం పోరాడుతుందని వర్సిటీ పీడీఎస్‌యూ కమిటీ కార్యదర్శి సంతోష్‌ పేర్కొన్నారు. శనివారం యూనివర్సిటీ బాలుర వసతి గృహంలో విలేకరులతో మాట్లాడుతూ... వర్సిటీలో అక్రమంగా చేపట్టిన పోస్టులను ప్రభుత్వం రద్దు చేయడం హార్షనియమని అయన అన్నారు. ఈ వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డ అధికారలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. యూనివర్సిటీలో నియామకాలు అవసరమైతే ప్రభుత్వ అనుమతి తీసుకొని పారదర్శకంగా అవినీతికి లేకుండా రోస్టర్‌ విధానం పాటించి నియామకాలు చేపట్టాలన్నారు. ఈ విలేకరలు సమావేశంలో పీడీఎస్‌యా నాయకులు రమేశ్‌, రాహుల్‌, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-24T05:50:02+05:30 IST