‘సర్వే’లో అన్నీ ఖాళీలే!

ABN , First Publish Date - 2021-12-06T07:58:41+05:30 IST

రాష్ట్రంలో సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డుల విభాగం..

‘సర్వే’లో అన్నీ ఖాళీలే!

  • సిబ్బంది కొరతతో సతమతమవుతున్న
  • సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డుల విభాగం
  • 10 జిల్లాల సర్వేయర్లే 33 జిల్లాలకు
  • ఒక్కో సర్వేయర్‌ రెండు మండలాలకు
  • 18 జిల్లాల్లో ఇన్‌స్పెక్టర్లే ఇన్‌చార్జి ఏడీలు
  • వారికే మరో 5 జిల్లాల బాధ్యతలు అదనం
  • కొత్త జిల్లాలకు అనుగుణంగాశాంక్షన్‌ పోస్టులు పెంచని ప్రభుత్వం
  • ప్రస్తుత సిబ్బంది ప్రభుత్వ ప్రాధాన్య ..
  • అంశాల సర్వే పనులకే పరిమితం
  • రైతుల దరఖాస్తులు కార్యాలయాల్లోనే!


హైదరాబాద్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డుల విభాగం.. తీవ్రమైన సిబ్బంది కొరతతో సతమతమవుతోంది. సర్వే విభాగంలోని చాలా కేటగిరీల్లో శాంక్షన్‌ పోస్టుల కంటే ఖాళీలే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం విధుల్లో ఉన్న కొద్దిమంది సర్వేయర్లలోనూ ఎక్కువ మంది.. ప్రభుత్వ ప్రాధాన్య అంశాలైన రోడ్లు, ఇరిగేషన్‌ ప్రాజెక్టుల భూసేకరణ, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు వంటి వాటి సర్వేల పనిలో నిమగ్నమవుతున్నారు. దీంతో రైతులకు సంబంధించిన భూ వివాదాల్లో సర్వే గురించి పట్టించుకునే పరిస్థితే లేకుండా పోయింది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా భూ సర్వే వ్యవహారం అటకెక్కింది. సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ విభాగంలో డిప్యూటీ సర్వేయర్‌ శాంక్షన్‌ పోస్టులు 476 ఉండగా, ప్రస్తుతం 142 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. 334 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఇక మండల సర్వేయర్‌ పోస్టులు పాత జిల్లాల ప్రాతిపదికన 350 ఉండగా.. ప్రస్తుతం విధుల్లో 331 మంది మాత్రమే ఉన్నారు. కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుతో రాష్ట్రంలో మొత్తం మండలాల సంఖ్య 574కు పెరిగినా.. మండల సర్వేయర్లను మాత్రం ఈ 331 మందినే నియమించారు. వీరిలోనూ సస్పెన్షన్లు, అనారోగ్యం వంటి కారణాలతో 15-20 మంది సర్వేయర్లు విధులకు హాజరు కావడంలేదు.


దీంతో ఒక్కో సర్వేయర్‌.. రెండు మండలాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇక ప్రతి రెవెన్యూ డివిజన్‌లోనూ ఒక డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే (ఐవోఎస్‌) అధికారి, ఐదుగురు సర్వేయర్లతో టాస్క్‌ఫోర్స్‌ బృందం ఉండాలి. కానీ, రాష్ట్రంలోని 74 రెవెన్యూ డివిజన్లకుగాను ప్రస్తుతం 31 మంది ఐవోఎ్‌సలు మాత్రమే ఉన్నారు. వీరిలోనూ కొంత మంది పలు కారణాల వల్ల విధులకు దూరంగా ఉన్నారు. మిగిలిన వారిని జిల్లాల ఇన్‌చార్జి అసిస్టెంట్‌ డైరెక్టర్‌(ఏడీ)లుగా నియమించారు. దీంతో చాలా రెవెన్యూ డివిజన్లలోనూ ఐవోఎస్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాస్తవానికి ఉమ్మడి 10 జిల్లాల్లో.. తొమ్మిది జిల్లాలకు ఒక్కొక్కరు చొప్పున ఏడీలు, హైదరాబాద్‌ జిల్లాకు డిప్యూటీ డైరెక్టర్‌ ఉండేవారు. అయితే కొత్తగా మరో 23 జిల్లాలు ఏర్పాటు కావడంతో.. 18 జిల్లాలకు డివిజన్‌ స్థాయి అధికారులైన ఐవోఎ్‌సలనే ఏడీలు(ఎ్‌ఫఏసీ)గా నియమించారు. మరో ఐదు జిల్లాలకు ఐవోఎస్‌ స్థాయి అధికారి కూడా లేని కారణంగా ఇతర జిల్లాల సర్వే ఆఫ్‌ ఇన్‌స్పెక్టర్లనే ఇన్‌చార్జులుగా నియమించారు. 


శాంక్షన్‌ పోస్టులను పెంచని ప్రభుత్వం...

రాష్ట్ట్రంలో ఉమ్మడి 10 జిల్లాలను 33 జిల్లాలుగా, 74 రెవెన్యూ డివిజన్లుగా, 574 మండలాలుగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. శాంక్షన్‌ పోస్టులను మాత్రం పెంచలేదు. పాత పది జిల్లాల సిబ్బందినే 33 జిల్లాలకు కేటాయించింది. ఈ పోస్టుల్లోనూ సగం ఖాళీలే ఉన్నాయి. దీంతో రైతులకు చెందిన భూవివాదాలకు సంబంధించిన దరఖాస్తులు మండల, రెవెన్యూ, డివిజన్‌ కార్యాలయాల్లో పెద్ద సంఖ్యలో పేరుకుపోతున్నాయి. ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి 31వ తేదీ వరకు సుమారు 10,400 దరఖాస్తులు వచ్చాయని, వీటిని 30-45 రోజుల్లో పరిష్కరించాల్సి ఉండగా, రెండు నెలలు గడిచినా 5శాతం దరఖాస్తులను కూడా పరిష్కరించలేదని ఓ అధికారి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. అయితే ఇతర శాఖల్లో ఖాళీలుంటే కిందిస్థాయి సిబ్బందితో నెట్టుకొచ్చే అవకాశముంటుందని, టెక్నికల్‌ ఉద్యోగులైన సర్వేయర్ల స్థానాన్ని ఇతర సిబ్బందితో భర్తీ చేయలేని పరిస్థితి ఉందని సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ విభాగం అధికారులు వాపోతున్నారు. 


వీఆర్‌వోలను ఇచ్చే ప్రతిపాదన..

రాష్ట్రంలో వీఆర్‌వో వ్యవస్థను రద్దు చేసిన ప్రభుత్వం.. ప్రస్తుతం ఎటువంటి విధుల్లేకుండా ఖాళీగా ఉన్న వీఆర్‌వోలను సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ విభాగానికి కేటాయించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామ స్థాయిలో ప్రతి సర్వే నంబర్‌లోని భూమిపైనా సర్వేయర్‌లకు పట్టు ఉన్నట్లుగానే వీఆర్‌వోలకూ అవగాహన ఉంటుంది. విధి నిర్వహణ, పదోన్నతుల్లో భాగంగా వీఆర్‌వోలకు భూముల సర్వేపై మూడు నెలలపాటు శిక్షణ కూడా ఇస్తుంటారు. దీంతోపాటు ప్రత్యక్ష పద్ధతిలో వీఆర్‌వోలుగా నియామకమైన వారిలో ఇంజనీరింగ్‌ వంటి సాంకేతిక విద్యను అభ్యసించినవారు కూడా ఉన్నారు. వీఆర్‌వో వ్యవస్థ రద్దుతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 5,485 మంది వీఆర్‌ వోలు ఎలాంటి జాబ్‌ చార్ట్‌ లేకుండానే ఉన్నారు. వీరిలో అర్హతలున్న కొంత మందిని సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ విభాగానికి కేటాయించాలనే ప్రతిపాదన ఉంది. ఇదే జరిగితే.. ప్రభుత్వం కొత్తగా పోస్టులను మంజూరు చేయకుండానే ఈ విభాగంలో ఉన్న మొత్తం ఖాళీలనూ భర్తీ చేయవచ్చని అంటున్నారు.

Updated Date - 2021-12-06T07:58:41+05:30 IST