అద్దెతో సహా అన్నీ.!

ABN , First Publish Date - 2020-09-12T09:49:03+05:30 IST

లంచం తీసుకోవడంలో రాష్ట్రంలోనే కొత్త రికార్డు నెలకొల్పిన మెదక్‌ అదనపు కలెక్టర్‌ నగేష్‌ వ్యవహారంలో ఆసక్తికరమైన

అద్దెతో సహా అన్నీ.!

కింది స్థాయి అధికారులకే అదనపు కలెక్టర్‌ ఇంటి బాధ్యతలు 

నగేష్‌ కుటుంబసభ్యుల తీరుతో విసిగిపోయిన మాచవరం వాసులు

పండుగ, పబ్బానికీ స్వేచ్ఛ లేని గ్రామస్థులు

అరుగుల మీద కూర్చున్నా పోలీసులతో బెదిరింపులు

ఏసీ అరెస్టుతో ఇబ్బందులు దూరమయ్యాయంటున్న స్థానికులు

 

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, సెప్టెంబరు 11 : లంచం తీసుకోవడంలో రాష్ట్రంలోనే కొత్త రికార్డు నెలకొల్పిన మెదక్‌ అదనపు కలెక్టర్‌ నగేష్‌ వ్యవహారంలో ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూస్తున్నాయి. తన ఖర్చుల బాధ్యతను కిందిస్థాయి అధికారులకు అప్పగించేవాడనే ప్రచారం ఉంది. మెదక్‌ మండలం మాచవరంలో తాను నివాసముండే ఇంటి అద్దె కూడా చెల్లించేవాడు కాదని.. ఆ భారాన్ని ఓ మండలాధికారికి అప్పగించినట్లు సమాచారం. ఆయనతో పాటు వారి కుటుంబీకుల తీరుపై స్థానికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. నగేష్‌ ఉండే వీధిలో అనధికారికంగా ఆంక్షలు అమల్లో ఉండేవి. ఆఖరికి ఫంక్షన్లు, పండుగల సందర్భాల్లోనూ డప్పులు, సౌండ్‌ సిస్టం వినియోగంపై నిషేధం విధించారు. ఎవరైనా ప్రశ్నిస్తే పోలీసుల నుంచి కేసులు పెడతామంటూ హెచ్చరికలు జారీ అయ్యేవి. అదనపు కలెక్టర్‌ అరెస్టు అనంతరం గ్రామస్థులు నోరు మెదుపుతున్నారు. బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. 


ఇంటి అద్దె చెల్లింపు బాధ్యత ఆ అధికారిదే

మెదక్‌ అదనపు కలెక్టర్‌గా గడ్డం నగేష్‌ 2017లో బాధ్యతలు చేపట్టారు. ఉన్నతాధికారుల క్యాంపు కార్యాలయాల నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో ప్రైవేట్‌ వ్యక్తులకు చెందిన ఇళ్లలో అద్దెకు ఉంటున్నారు. ఇందుకుగాను ప్రభుత్వం ఇంటి అద్దె భత్యం చెల్లిస్తుంది. నగేష్‌ మెదక్‌ పట్టణంలో ఓ రెండంతస్తుల భవనంలో ఓ ఫ్లోర్‌ మొత్తాన్ని అద్దెకు తీసుకున్నారు. అయితే నెలవారీగా కిరాయి చెల్లింపు బాధ్యతను ఓ అధికారికి అప్పగించినట్లు సమాచారం. కొన్నాళ్ల తర్వాత ఇంటి యజమాని నెలవారీ అద్దె మొత్తాన్ని పెంచేందుకు ప్రయత్నించగా.. ఓ అధికారితో గట్టిగా చెప్పించినట్లు తెలుస్తోంది. నాయకులు, మధ్యవర్తులు, అధికారులు పెద్దసంఖ్యలో అక్కడికి వచ్చి నగే్‌షతో సెటిల్మెంట్‌ చేసుకునేవారనే ప్రచారం స్థానికంగా ఉంది. రోజురోజుకూ తాకిడి పెరగడంతో ఎవరెవరు తనను కలిసేందుకు వస్తున్నారనే విషయం చుట్టుపక్కల వాళ్లకు తెలుస్తుందనే అనుమానంతో కొంతకాలం క్రితం నివాసాన్ని మాచవరంలోని ఇండిపెండెంట్‌ హౌస్‌కు మార్చాడు. ఆ ఇంటి అద్దె నెలకు రూ.15 వేలు రెవెన్యూ డివిజన్‌లోని ఓ తహసీల్దార్‌ చెల్లించేవాడని సమాచారం. ఇంటికి అవసరమైన వస్తువులు కూడా అధికారులే తెచ్చి ఇచ్చేవారని, లేదంటే అమ్మగారి ఆగ్రహానికి గురికాక తప్పదని సమాచారం.


ఇంటి యజమానివా.. గెటౌట్‌

మాచవరంలో అదనపు కలెక్టర్‌ అద్దెకు ఉంటున్న ఇంటిని దాని యజమాని అమ్ముకోవాలనుకుని ఓ వ్యక్తికి చూపించారు. ఇంటి పరిసరాలను చూపించి మేడపైకి తీసుకెళ్లారు. అదే సమయంలో అదనపు కలెక్టర్‌ నగేష్‌ కుటుంబీకులు వచ్చి.. మిమ్మల్ని ఎవరు లోపలికి అనుమతించారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇంటి యజమానినని, ఇల్లు అమ్మేందుకు చూపిస్తున్నానని చెప్పినా వినిపించుకోకుండా గెటౌట్‌... అంటూ అరుస్తూ వెళ్లగొట్టినట్లు సమాచారం. 


గణనాథుడి పూజలకూ తప్పని ఆంక్షలు

వినాయక చవితి వచ్చిందంటే వీధివీధిలో మండపాలు ఏర్పాటుచేసి గణనాథుడి విగ్రహాలకు పూజలు చేసి సందడిగా నిమజ్జనం చేయడం పరిపాటి. అయితే ఈసారి కరోనా వల్ల ఘనంగా నిర్వహించిన సందర్భాలు తక్కువే. కానీ అదనపు కలెక్టర్‌ నివాసముండే మాచవరంలోని వీధిలో గణనాథుడి నవరాత్రి ఉత్సవాలపైనా ఆంక్షలు విధించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సౌండ్‌ సిస్టం ఏర్పాటు చేయవద్దని ఆయన కుటుంబీకులు ఆదేశించినట్లు సమాచారం. అదే విధంగా నిమజ్జనం రోజు కూడా డప్పుచప్పుళ్ల హడావుడి లేకుండానే కార్యక్రమం పూర్తిచేసేలా ఒత్తిడి తెచ్చినట్లు వారు పేర్కొంటున్నారు. పోలీసులను బందోబస్తుగా పెట్టి భజనలు కూడా లేకుండా చేశారని వారు వాపోయారు.


అదేవీధిలో ఓ వ్యక్తి ఇటీవల వివాహం చేసుకోగా వేడుక, బరాత్‌, విందు నిర్వహణపైనా ఆంక్షలు పెట్టినట్లు పలువురు విమర్శిస్తున్నారు. ఆ గల్లీలో ఎవరైనా తమ ఇంటి ముందున్న అరుగుపై కూర్చోవడానికి వీల్లేదని, ఎవరైనా ప్రశ్నిస్తే పోలీసులు వచ్చే వారని ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. జిల్లాస్థాయి ఉన్నతాధికారి తమ ఊళ్లో నివాసముంటే తమ గ్రామానికి ఎంతో కొంత మేలు జరుగుతుందని భావించామని, కానీ నగేష్‌, ఆయన కుటుంబీకుల ప్రవర్తనతో విసుగిపోయామని వివరించారు. ఆఖరుకు బట్టలు ఉతికే విషయంలోనూ ఇద్దరి చాకలి వాళ్ల మధ్య గొడవ జరిగితే.. ఏకంగా ఓ కుటుంబంపై కేసు పెట్టించడం స్థానికులతో వ్యవహరించిన తీరుకు నిదర్శనంగా చెబుతున్నారు. అదనపు కలెక్టర్‌ను ఏసీబీ అరెస్టు చేయడంతో ఆయన కుటుంబీకులు హైదరాబాద్‌ వెళ్లిపోయారు. దాంతో తాము ఇన్నాళ్లు పడిన ఇక్కట్లు తొలగిపోయాయని గ్రామస్థులు సంబరపడుతున్నారు. గ్రామంలో నివాసముంటున్న మరో ఇద్దరు జిల్లాస్థాయి అధికారులతో తాము ఏనాడూ ఇబ్బందులు ఎదుర్కోలేదని పేర్కొన్నారు.

Updated Date - 2020-09-12T09:49:03+05:30 IST