అంతా ప్రకటనలకే పరిమితం

ABN , First Publish Date - 2021-01-17T06:12:39+05:30 IST

సువిశాలమైన సాగర తీరం... పక్కనే పచ్చటి కొబ్బరి తోటలు... తీరానికి ఆనుకుని రాతిగుట్టలు... వాటిపై లక్ష్మీమాధవస్వామి ఆలయం... ఇదీ రేవుపోలవరంలో కనిపించే దృశ్యం.

అంతా ప్రకటనలకే పరిమితం
అందాల రేవుపోలవరం తీరం

టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.5 కోట్లు మంజూరు

రూ.2 కోట్లతో నిర్మాణాలు

ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయిన వైనం

కనీస సదుపాయాలు లేకపోవడంతో సందర్శకుల అసంతృప్తి


ఎస్‌.రాయవరం, జనవరి 16: సువిశాలమైన సాగర తీరం... పక్కనే పచ్చటి కొబ్బరి తోటలు... తీరానికి ఆనుకుని రాతిగుట్టలు... వాటిపై లక్ష్మీమాధవస్వామి ఆలయం... ఇదీ రేవుపోలవరంలో కనిపించే దృశ్యం. జిల్లాలో అత్యంత సుందరమైన ప్రదేశాల్లో ఒకటిగా రేవుపోలవరం గుర్తింపు పొందింది. కార్తీకమాసంలోనే కాకుండా, ఏడాది పొడవునా ఆదివా రాలు, ఇతర సెలవు దినాల్లో పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. అయితే చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాధాన్యం వున్న రేవుపోలవరం అభివృద్ధిపై పాల కులు మాత్రం శీతకన్ను వేశారు. తాగునీరు, మరుగు దొడ్లు, షెల్టర్లు వంటి ఎటువంటి సదుపాయాలు లేవు. పర్యాటక శాఖా మంత్రి సొంత జిల్లాలోనే ఈ దుస్థితి నెలకొనడంపై స్థానికులు, పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రేవుపోలవరం తీరాన్ని టూరిజం స్పాట్‌గా అభి వృద్ధి చేయాలని 2018లో అప్పటి ఎమ్మెల్యే అనిత, నాటి అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు (ప్రస్తుతం పర్యాటక శాఖా మంత్రి)లు అప్పటి ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబునాయుడును కోరారు. దీంతో ఆయన రూ.5 కోట్లు మంజూరుచేశారు. పనుల బాధ్యతను ఏపీటీడీసీ చేపట్టింది. తీరానికి ఆనుకుని వున్న ఒక కొండపై శివపార్వతుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. కొండచుట్టూ ఫెన్సింగ్‌ వేసి గేటు ఏర్పాటుచేశారు. పర్యాటకుల కోసం రిసా ర్ట్‌ నిర్మించారు. ఈ పనులకు సుమారు రూ.2 కోట్ల మేర ఖర్చు చేశారు. రెండో దశలో మరికొన్ని పనులు చేపట్టే తరుణంలో ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో ప్రాజెక్టు ఆగిపోయింది. అప్పటికే నిర్మిం చిన వాటి నిర్వహణను కూడా ఏపీటీడీసీ అధికా రులు గొలికొదిలేశారు. దీంతో రిసార్ట్‌ ప్రారంభానికి నోచుకోకుండానే ఛిద్రమైంది. పై కప్పు, లోపల సీలిం గ్‌ ఊడిపోయి, రేకులు పడిపోయాయి.మెయిన్‌ గేటు తుప్పుపట్టి విరిగిపోయింది. శివపార్వతుల విగ్రహాల రంగు వెలిసిపోయి కళావిహీనంగా మారాయి. తీరం లో పర్యాటకులు సేదతీరడానికి షెడ్లుగానీ, సిమెంటు బెంచీలుగానీ లేదు. కనీసం తాగునీటి సదుపాయం లేదు. డబ్బులిచ్చి కొనుక్కుందామన్నా మంచినీరు లభించదు. మరుగుదొడ్లు లేకపోవడంతో మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. విద్యుద్దీపాలు లేకపోవడంతో సూర్యాస్తమయం తరువాత పర్యాటకులెవరూ వుండే పరిస్థితి లేదు.


అభివృద్ధిపై మంత్రి దృష్టిసారించాలి

- వంగలపూడి గోవింద్‌, తిమ్మాపురం

జిల్లాలో అందమైన సముద్ర తీరాల్లో రేవుపో లవరం మొదటి స్థానం లో నిలుస్తుంది. కానీ ఇక్కడ కనీస సదుపా యాలు లేవు. అయిన ప్పటికీ పర్యాటకులు బాగానే వస్తున్నారు. కనీస సౌకర్యాలు కల్పించడంతోపాటు పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా సందర్శకులు వస్తారు. జిల్లాకు చెందిన పర్యాటక శాఖా మంత్రి దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Updated Date - 2021-01-17T06:12:39+05:30 IST