‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2021-12-08T05:07:18+05:30 IST

ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లా అధికారయంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.

‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

 - ఉమ్మడి జిల్లాలో ఎనిమిది పోలింగ్‌ కేంద్రాలు 

- 1,324 మంది ఓటర్లు 

- ముగిసిన ప్రచారం....

- 10న పోలింగ్‌....14న కౌంటింగ్‌   

- రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

కరీంనగర్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లా అధికారయంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఉమ్మడి జిల్లాలోని  1,324 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 581 మంది పురుషులు, 743 మంది మహిళలు ఉన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఎనిమిది పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరీంనగర్‌ జిల్లాలో  కరీంనగర్‌, హుజూరాబాద్‌, జగిత్యాల జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, పెద్దపల్లి జిల్లాలో రెండు పెద్దపల్లి, మంథని, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒకటి, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో, మొత్తం 8 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈనెల 10న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు కరీంనగర్‌లోని ప్రభుత్వ ఎస్సారార్‌ డిగ్రీ కాలేజీలో డిస్ర్టిబ్యూషన్‌ సెంటర్‌, రిసెప్షన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రంలోనే ఈనెల 14న ఓట్లను లెక్కిస్తారు. ఎన్నికల పోలింగ్‌కు 36 మంది ఎన్నికల సిబ్బందిని నియమించి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో కొవిడ్‌ మార్గదర్శకాల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది.  మంగళవారం జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మీడియాకు ఎన్నికల ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు. 

- పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ 

ఈ నెల 10న కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా పరిధిలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను నిస్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించనున్నట్లు రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ తెలిపారు. ఉమ్మడి జిల్లా పరిధిలో రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 10న పోలింగ్‌ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 14న ఎస్సారార్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ సెంటర్‌లో నిర్వహిస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నగరపాలక సంస్థలోని కార్పొరేటర్లు, మున్సిపాలిటీల్లోని కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఓటు హక్కు కలిగి ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 1,324 మంది ఓటర్లు ఉన్నారని, అందులో నలుగురు నిరక్షరాస్యులు ఉన్నారని, వారికి సహాయకులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల్లో శానిటైజర్లు, మాస్కులు, హెల్త్‌ వర్కర్లను నియమించామని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఇండెబుల్‌ ఇంక్‌ ఉండదని తెలిపారు. ఎన్నికల పోలింగ్‌ కేంద్రాల లోపలికి సెల్‌ఫోన్లను అనుమతించమని తెలిపారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ చేస్తున్నామని అన్నారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఎన్నికల పోలింగ్‌కు ఒకటే బ్యాలెట్‌ పేపర్‌ ఉంటుందని ప్రాధాన్య క్రమంలో వారి పేర్లకు ఎదురుగా ఎన్నికల అధికారులు ఇచ్చిన ప్రత్యేక పెన్నుతో నంబర్లు వేయాలన్నారు. అన్ని పోలింగ్‌ స్టేషన్లలో సీపీ వి సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు 1,113 మందితో పకడ్బందీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎనిమిది రూట్లు ఉన్నాయని, డిస్ర్టిబ్యూషన్‌ సెంటర్‌ నుంచి తీసుకువెళ్లే వాహనాలకు పోలీసులను ఎస్కార్టుగా పంపిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంత వరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా నిర్వహించడానికి సహకరించాలని కోరారు. 

- పోలింగ్‌ కేంద్రం పరిశీలన

స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 10న జరగనున్న సందర్భంగా జడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాన్ని మంగళవారం రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ పరిశీలించారు. పోలింగ్‌ విధులు నిర్వర్తించే అధికారులు, పోలింగ్‌ ఏజెంట్లు కూర్చునే వరుస క్రమము, కంపార్ట్మెంట్‌, లైటింగ్‌, తాగునీరు, ర్యాంపు తదితర అంశాలను పరిశీలించి ఇంకా ఏర్పాటు చేయవలసిన వాటి గురించి అధికారులకు సూచించారు. కలెక్టర్‌ వెంట ఆర్డీవో ఆనంద్‌కుమార్‌, కరీంనగర్‌ అర్బన్‌ తహసీల్దార్‌ సుధాకర్‌ ఉన్నారు.

Updated Date - 2021-12-08T05:07:18+05:30 IST