త్వరలోనే యాసంగి రైతు బంధు జమ

ABN , First Publish Date - 2021-12-07T04:24:02+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి సహాయం త్వరలోనే రైతు చేతికి అందనుంది. మరో పది రోజుల్లో జిల్లా వ్యవసాయాధికారులు పంపే తుది జాబితాలకు అనుగుణంగా రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ.5వేల చొప్పున యాసంగి(రబీ) రైతుబంధు నగదు జమ చేయనున్నారు.

త్వరలోనే యాసంగి రైతు బంధు జమ

- మరో 15రోజుల్లో నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ

- జిల్లాలో మొత్తం 1,09,857 మంది రైతులు

- 188.88 కోట్ల పెట్టుబడి సహాయం

- యుద్ధ ప్రాతిపదికపై జాబితాల వెరిఫికేషన్‌

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి సహాయం త్వరలోనే రైతు చేతికి అందనుంది. మరో పది రోజుల్లో జిల్లా వ్యవసాయాధికారులు పంపే తుది జాబితాలకు అనుగుణంగా రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ.5వేల చొప్పున యాసంగి(రబీ) రైతుబంధు నగదు జమ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం నిధుల విడుదలకు సంబంధించి సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. జిల్లాలో వానాకాలం(ఖరీఫ్‌) సీజన్‌ సాయం అందుకున్న దాదాపు ప్రతీ రైతుకు యాసంగి సాయం కూడా అందనుంది. ప్రభుత్వం నిఫ్ట్‌ పద్ధతిలో నేరుగా ఖాతాలోకే నగదు జమ చేస్తున్నందున ఆరోహణ పద్ధతిలో ఖాతాల్లోకి పెట్టుబడి సాయం జమ కానుంది. జాబితాల్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే సరి చేసేందుకు వ్యవసాయ అధికారులకు లాగిన్‌ అవకాశం ఇచ్చారు. దీంతో యుద్ధ ప్రాతిపదికపై జాబితాను రివెరిఫికేషన్‌ చేయనున్నారు. గత వానాకాలం జాబితాను అనుసరించి జిల్లాలో మొత్తం 335 గ్రామాలకు చెందిన 1,17,096 మంది రైతులకు గాను ఖరీఫ్‌లో 1,09,857మంది రైతులకు మొత్తం 188కోట్ల 88లక్షల రూపాయలు పెట్టుబడి సాయం అందింది. ప్రస్తుత యాసంగిలోనూ అంతే మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేసేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయనుంది.

 ఇందుకు సంబంధించి రైతులు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌ కార్డులకు అనుగుణంగా, వానాకాలం(ఖరీఫ్‌) వరకు కొత్త పాసు పుస్తకం వచ్చిన రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందించారు. ప్రస్తుతం ఆ జాబితాలకు అదనంగా కొత్త పాస్‌ పుస్తకాలు అందుకున్న రైతులను కూడా నమోదు చేసి రబీ రైతు బంధును జమ చేయనున్నారు. అయితే ఇది పెద్దగా తేడా ఉండకపోవచ్చని చెబుతున్నారు. ఈ నెల15 నుంచి మొదటి విడుతగా చిన్న, సన్నకారు రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం జమ చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే వానాకాలం సీజన్‌ నాటికి పాసు పుస్తకాలు లేని రైతులసంఖ్య 3-4వేలవరకు ఉండవచ్చని అధికా రులు అంచనా వేశారు. అయితే వానాకాలం సహాయం అందుకో లేని రైతులు ప్రస్తుతం యాసంగిలోనైనా సహాయమైనా అందుతుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. 

ముందుగా చిన్న సన్నకారు రైతులకే..

రైతు బంధు పథకం కింద రైతులకు అందజేయనున్న పెట్టుబడి సాయానికి సంబంధించి వ్యవసాయశాఖ జాబితాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసింది. తరువాత ప్రభుత్వం జిల్లాలోని రైతులందరికీ నగదును ఖాతాల్లోకి జమ చేసే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. జిల్లాలో 90శాతం చిన్న రైతులే కావడం వల్ల జిల్లా లోని రైతులందరికీ ఒకేసారి నగదు అందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గతంలో రైతులకు దఫదఫాలుగా నగదును జమ చేయగా అంతటా గందరగోళ పరిస్థితి ఉత్పన్నం అయింది. దాంతో రైతుల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయి. దానికి తోడు గత యాసంగి, వానాకాలం సీజన్‌లకు సంబంధించి దాదాపు 8వేల మందికి పైగా రైతులకు పెట్టుబడి సాయం అందలేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని నిలిపివేసిందనే రీతిలో జోరుగా దుష్ప్రచారం జరిగింది. అయితే ప్రభుత్వం వారికి కూడా రైతు బంధు ఇవ్వడంతో ఊహాగానాలకు తెరపడింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ సారి రోజుల తేడాతోనైనా నగదు జమ చేయవచ్చని భావిస్తున్నారు. కాగా పెట్టుబడి సాయానికి సంబంధించి ప్రభుత్వం రెండు దఫాలుగా ఒక ఎకరాకు రూ.10 వేల చొప్పున అందజేస్తోంది. ఇందులో భాగంగా మొదటి విడతగా వానాకాలంలో రూ.5వేలు, రెండో విడత యాసంగిలో రూ.5వేల చొప్పున జమ చేస్తోంది.

  జాబితాలు రీవెరిఫై చేస్తాం..

 - శ్రీనివాస రావు, జిల్లా వ్యవసాయాధికారి

పెట్టుబడి సాయం అందించేందుకు అవసరమైన పూర్తిజాబితాలను సిద్ధం చేస్తాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందగానే  రైతుల వివరాలను రీవెరిఫై చేసి మార్పులు, చేర్పులు ఉంటే పూర్తి చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తాం. 


Updated Date - 2021-12-07T04:24:02+05:30 IST