అంతా మా ఇష్టం!

ABN , First Publish Date - 2022-08-26T06:47:23+05:30 IST

ఆదిలాబాద్‌ పట్టణం గుండా వెళ్లే పాత జాతీయ రహదారి విస్తరణ పనులను అడ్డగోలుగా చేపడుతు అంతా మా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్న ఆర్‌అండ్‌బీ అధికారుల తీరును అడిగే నాథుడే కరువయ్యాడన్న ఆరోపణలు వస్తున్నాయి.

అంతా మా ఇష్టం!
జిల్లా కేంద్రంలోని తిర్పెల్లి వద్ద అసంపూర్తిగా కనిపిస్తున్న రోడ్డు విస్తరణ పనులు


అడ్డగోలుగా స్టేట్‌ ఫండ్‌ ప్లాన్‌ వర్క్‌ పనులు

మంజూరు ఓ చోట.. పనులు మరోచోట

అప్రోచ్‌ రోడ్ల పేరిట ఆర్‌అండ్‌బీ కార్యాలయాల్లో బీటీ పనులు

గడువు ముగిసిన పనులకు అడ్డదారిలో బిల్లులు

ప్రజల ఇబ్బందులను పట్టించుకోని ఆర్‌అండ్‌బీ అధికారులు

ఆదిలాబాద్‌, ఆగస్టు25:(ఆంధ్రజ్యోతి) : ఆదిలాబాద్‌ పట్టణం గుండా వెళ్లే పాత జాతీయ రహదారి విస్తరణ పనులను అడ్డగోలుగా చేపడుతు అంతా మా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్న ఆర్‌అండ్‌బీ అధికారుల తీరును అడిగే నాథుడే కరువయ్యాడన్న ఆరోపణలు వస్తున్నాయి. మూడేళ్ల క్రితం స్టేట్‌ఫండ్‌ ప్లాన్‌ వర్క్‌ కింద పట్టణానికి రూ.42కోట్ల నిధులను రాష్ట్ర ప్రభు త్వం మంజూరు చేసింది. ఈ నిధులతో పట్టణంలోని రిమ్స్‌ ఆసుపత్రి నుంచి తిర్పెల్లి ఎక్స్‌రోడ్డు వరకు పాత జాతీయ రహదారి విస్తరణ, డివైడర్‌, సెంట్రల్‌ లైటింగ్‌, అవసరమైన చోట అప్రోచ్‌ రోడ్ల నిర్మాణం పనులను చేపట్టాల్సి ఉంది. కానీ ఆర్‌అండ్‌బీ అధికారులు ఈ పనులను పూర్తి చేయకుండానే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కార్యాలయాల్లో పనులు చేపట్టడంపై విమర్శలు వస్తున్నాయి. తిర్పెల్లి కాలనీ వద్ద సుమారుగా 600 మీటర్ల రోడ్డు విస్తరణ పనులు ఇంకా అసంపూర్తిగానే కనిపిస్తున్నాయి. అయినా అడ్డదారిలో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కార్యాలయం, డివిజన్‌ కార్యాలయంతో పాటు గెస్ట్‌హౌస్‌లో బీటీ రోడ్ల నిర్మాణం పనులను చేపట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అసంపూర్తి పనులతో పట్టణ వాసులు అవస్థలు పడుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఈ యేడు భారీ వర్షాల కారణంగా రోడ్లన్ని ధ్వంసమైపోయి గుంతలమయంగా మారిన రోడ్లతో ప్రయాణికులు ఎన్నో అవస్థలు పడుతున్నా అధికారులు మాత్రం కార్యాలయాల కు మెరుగులు దిద్దడంపై ప్రజలు మండిపడుతున్నారు. అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేయాలని పలుమార్లు ఎమ్మెల్యే జోగురామన్న అధికారులను ఆదేశించిన పట్టించుకోకుండా సొంత నిర్ణయాలతో పనులు చేపట్టడాన్ని తప్పుబడుతున్నారు. 

అడ్డగోలుగా పనులు..

ప్రభుత్వం కేటాయించిన స్టేట్‌ ఫండ్‌ ప్లాన్‌ వర్క్‌ నిధులతో ఆర్‌అండ్‌బీ అధికారులు అడ్డగోలుగా పనులు చేపడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ముందస్తు అంచనాలు, అనుమతులు లేక పోయిన ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో బీటీ రోడ్ల నిర్మాణం పనులను చేపడుతూ అడ్డదారిలో బిల్లులు ముట్టచెప్పే ప్లాన్‌ చేస్తున్నారు. రోడ్డు విస్తరణ, డివైడర్‌, అప్రోచ్‌ రోడ్ల నిర్మాణం పనులను చేపట్టాల్సిన కాంట్రాక్టర్‌ చేత కార్యాలయంలో బీటీ రోడ్ల నిర్మాణం పనులను చేయిస్తూ లక్షల రూపాయల నిధులను పక్కదారి పట్టిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. రోడ్డు విస్తర్ణతో పాటు అవసరమైన చోట మురికి నీటి కాలువల నిర్మాణం కూడా చేపట్టాల్సి ఉంది.  కానీ అంబేద్కర్‌ భవనం వద్ద అక్రమ కట్టడాలను తొలగించక పోవడంతో అసంపూర్తిగానే వదిలేశారు. తిర్పెల్లి వద్ద నిలిచి పోయిన పనులకు సంబంధించి అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోక పోవడంతోనే యజమాని కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్న ఆరోపణలున్నాయి. సాత్నాల క్వాటర్స్‌కు వెళ్లే దారికి అప్రోజ్‌ రోడ్డు వేయకుండానే వదిలేయడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలా పలు చోట్ల అప్రోచ్‌రోడ్ల పనులు అసంపూర్తిగానే కనిపించడంతో పట్టణ ప్రజలు అవస్థల పాలవుతున్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసిన ఆర్‌అండ్‌బీ శాఖాధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు లేక పోలేదు. 

ఈవోటీ అనుమతులు లేక పోయినా..

స్టేట్‌ ఫండ్‌ ప్లాన్‌ వర్క్‌ కింద కేటాయించిన పను లకు సంబంధించి గడువు సమయం ముగిసి పోయిన ఆర్‌అండ్‌బీ అధికారులు అడ్డగోలుగా పనులు చేపడుతున్నారు. గత ఏప్రిల్‌ మాసంలోనే ఈ పనులకు సంబంధించి గడువు సమయం ముగిసి పోయింది. అయినా మళ్లీ తాజాగా గత రెండు రోజులుగా నిబంధనలకు విరుద్ధంగా బీటీ పనులను చేపడుతున్నారు. ఈఓటీ (ఎక్స్‌టెన్షన్‌ ఆఫ్‌ టైం) అనుమతుల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసిన ఇప్పటి వరకు ప్రభుత్వం అనుమతులను జారీ చేయలేదని ఆర్‌అండ్‌బీ శాఖ డీఈ సురేష్‌ తెలిపారు. కానీ మరో రెండు మూడు మాసాల పాటు అగ్రిమెంట్‌ గడువు సమయం ఉందని ఈఈ నర్సయ్య చెప్పడం కొసమెరుపు. ఇలా అధికారులు పొంతన లేని సమాధానాలు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు దీంతో స్పష్టమవుతోంది. అగ్రిమెంట్‌ గడువు ముగిసి పోవడంతో సంబంధిత కాంట్రాక్టర్‌ పనులు చేయలేనని అభ్యంతరం వ్యక్తం చేసిన సంబంధిత ఉన్నతాధికారుల ఒత్తిళ్లతో పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే పాత తేదీలలో బీటీ పనులు చేపట్టినట్లు రికార్డులు చేసి బిల్లులు ముట్ట చెప్తామంటూ భరోసా ఇవ్వడంతోనే కాంట్రాక్టర్‌ పనులు చేసేందుకు ముందుకు వచ్చినట్లు తెలిసింది. దీంతో రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎస్‌ఈ కార్యాలయంతో పాటు డివిజన్‌ కార్యాలయం, గెస్ట్‌హౌస్‌ల్లో బీటీ పనులను నిర్వహిస్తున్నారు.  రికార్డులను సైతం తారుమారు చేస్తు తమ పంతం నెగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అడిగినంత  ఇస్తే ఆర్‌అండ్‌బీ శాఖలో ఏదైనా సాధ్యమేనని దీంతో అధికారులు నిరూపిస్తున్నారు. 

కలెక్టర్‌ అనుమతులు అవసరం లేదు...

- నర్సయ్య (ఈఈ, ఆర్‌అండ్‌బీ, ఆదిలాబాద్‌)

స్టేట్‌ ఫండ్‌ ప్లాన్‌ వర్క్‌ కింద చేపట్టే పనులకు కలెక్టర్‌ అనుమతులు అవసరం లేదు. అప్రోచ్‌ రోడ్ల పనుల పేరిటనే ఆర్‌అండ్‌బీ కార్యాలయాల్లో బీటీ రోడ్ల నిర్మాణం పనులను చేపడుతున్నాం. మరో రెండు మూ డు మాసాల పాటు అగ్రిమెంట్‌ గడువు సమయం ఉం ది. సంబంధిత కార్యాలయాల్లో పనులు చేపట్టి అప్రోచ్‌ రోడ్ల పేరిట రికార్డులు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అవసరమైన చోట్ల అప్రోచ్‌ రోడ్ల నిర్మాణం పనులను చేపట్టడం జరిగింది. తిర్పెల్లి వద్ద కోర్టు కేసు ఉండడంతోనే పనులను నిలిపి వేయడం జరిగింది. 


Updated Date - 2022-08-26T06:47:23+05:30 IST