పెళ్లి వస్త్రాల్లో చక్కగా ముస్తాబైన వధువు.. పెళ్లి మంటపానికి ఆ వరుడు ఎంతకూ రాకపోవడంతో డౌట్.. నేరుగా అతడి ఇంటికి వెళ్లి చూస్తే..

ABN , First Publish Date - 2021-11-24T22:47:07+05:30 IST

చాలా ప్రేమ కథలు, వివిధ కారణాలతో మధ్యలోనే విషాదాంతం అవుతుంటాయి. అయితే ఒడిశాకు సంబంధించిన ఓ ప్రేమ కథ.. ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది...

పెళ్లి వస్త్రాల్లో చక్కగా ముస్తాబైన వధువు.. పెళ్లి మంటపానికి ఆ వరుడు ఎంతకూ రాకపోవడంతో డౌట్.. నేరుగా అతడి ఇంటికి వెళ్లి చూస్తే..
వధువు డింపుల్

సినిమాల్లో కనిపించే సీన్లు.. ఒక్కోసారి నిజ జీవితంలో కూడా కనిపిస్తుంటాయి. వాటిలో ఉన్నట్లే.. ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటూ ఉంటాయి. కొందరి ప్రేమకథల్లో చివరకు శుభం కార్డు పడితే.. చాలా ప్రేమ కథలు, వివిధ కారణాలతో మధ్యలోనే విషాదాంతం అవుతుంటాయి. అయితే ఒడిశాకు సంబంధించిన ఓ ప్రేమ కథ.. ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. పెళ్లికుమార్తె చక్కగా ముస్తాబై, పెళ్లి మంటపానికి చేరుకుంది. అంతా వరుడు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే అతను మాత్రం ఎంతకూ రాలేదు.. తర్వాత ఏం జరిగిందంటే..


ఒడిశాలోని బెర్హంపూర్‌‌కు చెందిన సుమిత్ సాహూ అనే వ్యక్తి, డింపుల్ అనే యువతి చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఇంట్లో చెబితే పెద్దవారు ఒప్పుకోరనే ఉద్దేశంతో 2020 సెప్టెంబర్‌లో రిజిస్ట్రార్ ఆఫీసులో స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఇరు కుటుంబాలకూ విషయం తెలిసింది. సాహూ తండ్రి వచ్చి ఇద్దరినీ ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటినుంచి ఆమె అత్తగారింట్లోనే ఉంటోంది. ఏ సమస్యలూ లేవనుకున్న క్రమంలో.. సినిమా తరహాలో ఉన్నట్టుండి అత్తగారింట్లో వేధింపులు స్టార్ట్ అయ్యాయి. మొదట భార్యను వెనకేసుకొచ్చిన భర్త.. రానురాను తల్లిదండ్రుల మాటలు విని, తాను కూడా హింసించేవాడు. ఈ గొడవలు చాలాసార్లు కేసుల వరకూ వెళ్లాయి.


దీంతో ఇటీవల డింపుల్.. పుట్టింట్లోనే ఉంటోంది. అయితే కొన్నాళ్లు గడిచాక సాహుల్ తండ్రి వచ్చి.. కోడలు కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. ఇద్దరికీ బంధువుల సమక్షంలో ఘనంగా వివాహం చేస్తామని, తర్వాత సమస్యలేవీ ఉండవని నచ్చజెప్పాడు. కూతురు జీవితం గురించి ఆలోచించిన తల్లిదండ్రులు అందుకు అంగీకరించారు. నవంబర్ 22న పెళ్లి నిశ్చయం చేసుకున్నారు. పెళ్లిరోజున బంధువులు, సన్నిహితులతో కలిసి.. వధువు కళ్యాణ మంటపానికి చేరుకుంది. ఇక వరుడు వస్తే తాళి కట్టడమే తరువాయి. అయితే ఎంతసేపు చూసినా వరుడు, కుటుంబ సభ్యులు మాత్రం అక్కడకు రాలేదు. అనుమానం వచ్చి వారింటికి వెళ్లగా తాళం వేసి ఉంది.


మోసపోయానని గ్రహించిన యువతి.. తన కుటుంబ సభ్యులతో పాటూ భర్త ఇంటి ముందే ధర్నాకు దిగింది. తన భర్త ఎక్కడున్నా.. వచ్చి పెళ్లి చేసుకోవాల్సిందే అని పట్టుబట్టింది. రెండు రోజులుగా ధర్నా చేస్తుండడంతో పోలీసులు అక్కడికి చేరుకుని యువతికి నచ్చజెప్పారు. అయినా ఆమె మాత్రం అంగీకరించలేదు. ఎవరెన్ని చెప్పినా పెళ్లి జరిగే వరకూ రాజీపడేది లేదని తేల్చి చెప్పేసింది. ఈ వ్యవహారంపై బెర్హంపూర్ ఎస్పీ పినాక్ మిశ్రా మాట్లాడుతూ.. వారి సమస్య కోర్టు పరిధిలో ఉందని, కోర్టు సూచనల ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - 2021-11-24T22:47:07+05:30 IST