బీజేపీ అభ్యర్థి కారులో ఈవీఎం

ABN , First Publish Date - 2021-04-03T07:16:14+05:30 IST

అసోంలో ఓ పెద్ద రాజకీయ వివాదం చెలరేగింది. రెండోదశ పోలింగ్‌ ముగిసిన కరీంగంజ్‌ జిల్లాలోని రత్‌బాడీ నియోజవర్గంలో ఈవీఎంల తరలింపులో హైడ్రామా చోటుచేసుకుంది.

బీజేపీ అభ్యర్థి కారులో ఈవీఎం

  • అసోంలో తీవ్ర రగడ...
  • హింస, కాల్పులు


కరీంగంజ్‌- న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 2: అసోంలో ఓ పెద్ద రాజకీయ వివాదం చెలరేగింది. రెండోదశ పోలింగ్‌ ముగిసిన కరీంగంజ్‌ జిల్లాలోని రత్‌బాడీ నియోజవర్గంలో ఈవీఎంల తరలింపులో హైడ్రామా చోటుచేసుకుంది. ఓ ఈసీ వాహనానికి మధ్యలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆ వాహనాన్ని వదిలేసి మరో ప్రైవేటు వాహనంలో కొన్ని ఈవీఎంలను తరలించబోయారు. అయితే ఆ కారు రత్‌బాడీ పక్కనే ఉన్న పథర్‌ఖండీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే కృష్ణేందు పాల్‌ భార్య మధుమితా పాల్‌ పేరిట ఉంది. రత్‌బాడీ ఎమ్మెల్యే బిజోయ్‌ మలకర్‌ కూడా బీజేపీ అభ్యర్థే.. ఈయన వాహనమూ ఆ వెనకే ఉంది. 


ఈ విషయాన్ని గుర్తించిన కాంగ్రెస్‌, ఏఐయూడీఎఫ్‌ కార్యకర్తలు వాహనాన్ని ధ్వంసం చేశారు. ఆ ధాటికి ఈసీ సిబ్బంది అక్కడి నుంచి పారిపోయారు. ఈవీఎంలను తారుమారు చేసేందుకు బీజే పీ యత్నిస్తోందని, అందుకే తమ వాహనాల్లో తరలించబోయిందని, ఈసీ అందుకు సహకరించిందని ఆరోపణలు రేగాయి. విధ్వంసం కొనసాగుతున్న సమయంలో జిల్లా పోలీస్‌ అధికారులు హుటాహుటి చేరుకుని అల్లరిమూకను చెదరగొట్టడానికి యత్నించారు. ఆ తరువాత ఈవీఎంలను సురక్షితంగా పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. తాము పొరపాటున బీజేపీ అభ్యర్థి భార్య వాహనంలో ఈవీఎంలను తరలించబోయినట్లు ఈసీ సిబ్బంది అంగీకరించడంతో కమిషన్‌ ప్రిసైడింగ్‌ అధికారి సహా నలుగురిని సస్పెండ్‌ చేసింది. ఆ ఈవీఎంలున్న ఇందిరా ఎంవీ స్కూల్‌ పోలింగ్‌ కేంద్రంలో రీపోలింగ్‌కు ఆదేశించింది. ఈ ఘటనపై కాంగ్రెస్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.


ఎలక్షన్‌ కమిషన్‌ ఇకనైనా మేల్కొనాలని, లేదంటే ప్రజాస్వామ్యానికే పెనుప్రమాదమని రాహుల్‌గాంధీ ట్వీట్‌ చేశారు. ఈవీఎంలను ప్రైవేటు వాహనాల్లో తరలించడాన్ని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. ఏఐయూడీఎఫ్‌, లెఫ్ట్‌, అసోం ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీని టార్గెట్‌ చేశాయి. అయితే బీజేపీ అభ్యర్థి కృష్ణేందుపాల్‌ ఈ ఆరోపణలను తిరస్కరించారు. ‘‘మేం ఈవీఎంలను దొంగిలించలేదు. ఈసీ వాహనం బ్రేక్‌డౌన్‌ అయింది. వారు మా కారు డ్రైవర్‌ సాయం కోరారు. అంతే... నా కారు మీద బీజేపీ అభ్యర్థి అన్న పేపరు అంటించి ఉంది. ఇది ఈసీకి తెలియనిదికాదు’ అని వివరించారు. ఈ మొత్తం ఘటనపై ఎలక్షన్‌ కమిషన్‌ సమగ్ర దర్యాప్తు జరిపించాలని, బాధ్యులైన వారిపై చర్య తీసుకోవాలని కేంద్ర మంత్రి అమిత్‌ షా కోరారు. 


Updated Date - 2021-04-03T07:16:14+05:30 IST