బైక్‌పై ఈవీఎంల తరలింపు వ్యవహారం.. ముగ్గురు సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2021-04-08T16:14:54+05:30 IST

స్థానిక వేళచ్చేరి నియోకవర్గంలో మంగళవారం రాత్రి పోలింగ్‌ ముగిశాక మూడు ఈవీఎంలను బైక్‌పై తరలించిన వ్యవహారానికి సంబం

బైక్‌పై ఈవీఎంల తరలింపు వ్యవహారం.. ముగ్గురు సస్పెన్షన్‌


    - రీ పోలింగ్‌కు డిమాండ్‌ చేసిన కాంగ్రెస్‌


ప్యారీస్‌(చెన్నై): స్థానిక వేళచ్చేరి నియోకవర్గంలో మంగళవారం రాత్రి పోలింగ్‌ ముగిశాక మూడు ఈవీఎంలను బైక్‌పై తరలించిన వ్యవహారానికి సంబంధించి ముగ్గురు ఉద్యోగులు సస్పెన్షకు గురయ్యారు. వీటిని తరలించిన గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ)కు చెందిన ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ కార్పొరేషన్‌ కమిషనర్‌, ఎన్నికల అధికారి ప్రకాష్‌ బుధవారం ఉత్తర్వు జారీ చేశారు. ఆ ముగ్గురు ఉద్యోగుల  నుంచి స్వాధీనం చేసుకున్న రూ.1.12 లక్షల నగదుపై పోలీసులు కేసు నమోదుచేసుకొని విచారణ జరుపుతున్నారు. ఆ ముగ్గురు ఉద్యోగులు ఈవీఎంలు తరలించేందుకు అనుమతించిన అధికారుల వద్ద విచారణ జరపాలని ఉత్తర్వు జారీ చేశారు. ఇదిలా వుండగా, సంబంధిత పోలింగ్‌ బూత్‌లో రీ పోలింగ్‌ జరపాలని కాంగ్రెస్‌ తరఫున ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. స్థానిక తరమణి 100 అడుగుల రోడ్డులో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు మూడు ఈవీఎంలను రాత్రి 7.30 గంటలకు బైక్‌పై తరలిస్తుండగా అడ్డుకున్న స్థానికులు ఆ ముగ్గురినీ పట్టుకొని పోలీసులకు అప్పగించారు. విచారణలో, తాము ఎన్నికల సిబ్బందిమని, మొరాయించిన ఈవీఎంలను సచివాలయంలోని ఎన్నికల కమిషన్‌ కార్యాలయానికి తీసుకెళ్తున్నామని చెప్పినట్టు తెలిసింది. అయితే,  ఎన్నికల అధికారుల ఆధీనంలో వుండాల్సిన ఈవీఎంలు ఎలా బయటకు వచ్చాయన్న దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయ. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఉన్నతస్థాయి అధికారులు ఈవీఎలతో పట్టుబడిన వ్యక్తులు జీసీసీ సిబ్బంది అని గుర్తించారు. అయితే, వారి నుంచి స్వాధీనం చేసుకున్న నగదు వారికి ఎలా వచ్చింది? ఈవీఎంలను తరలించేందుకు ఎవరి నుంచైనా లంచంగా పుచ్చుకున్నారా? అన్న కోణంలో విచారణ సాగిస్తున్నారు. ఇదిలా వుండగా, ఈ వ్యవహారంపై స్పందించిన జీసీసీ కమిషనర్‌, ఎన్నికల అధికారి ప్రకాష్‌, వేళచ్చేరి పోలింగ్‌ కేంద్రంలో మొరాయించిన ఈవీఎంలను తమ సిబ్బంది తరలిస్తూ పట్టబడ్డారని, అయినప్పటికీ వారిని తాత్కాలికంగా సస్పెండ్‌ చేస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా,  జీసీసీ కమిషనర్‌ చేపట్టిన చర్యలపై తృప్తి చెందని వేళచ్చేరి కాంగ్రెస్‌ అభ్యర్ధి హాసన్‌మౌలానా, తన ఓటు బ్యాంక్‌ను తగ్గించాలన్న దురుద్దేశంతోనే ఈవీఎంలను అక్రమంగా తరలించారని, అందువల్ల సంబంధిత పోలింగ్‌ కేంద్రాల్లో రీ పోలింగ్‌ జరపాలని ఎన్నికల అధికారికి ఫిర్యాదు పిటిషన్‌ అందజేశారు. పట్టుబడిన ఉద్యోగుల సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకొని, వారు ఎవరెవరిని సంప్రదించి మాట్లాడారు? అన్నదానిపై వివరాలు సేకరించి విచారణ జరపాలని ఆయన ఎన్నికల కమిషన్‌ను డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-04-08T16:14:54+05:30 IST