ఇవేం వనాలు?

ABN , First Publish Date - 2020-12-04T05:20:11+05:30 IST

పట్టణాల మాదిరిగానే పల్లెల్లోనూ ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించి వనాలను పెంచే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అనుకున్నట్లుగానే ఐదు నెలలుగా జిల్లా వ్యాప్తంగా ప్రకృతి వనాల నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి.

ఇవేం వనాలు?
బజార్‌హత్నూర్‌ మండలం కొల్హారిలో మొక్కలు లేకుండా కనిపిస్తున్న పల్లె ప్రకృతి వనం

జిల్లాలో అధ్వానంగా పల్లె ప్రకృతి వనాలు

గ్రామాలకు దూరంగా అటవీ ప్రాంతాల్లో ఏర్పాటు

రికార్డుల్లోనే మొక్కలు నాటినట్లు లెక్కలు

అధికారుల హడావిడితో అంతా ఉరుకులు పరుగులు

పార్కుల నిర్వహణ గాలికొదిలేస్తున్న సర్పంచ్‌లు

ఆదిలాబాద్‌, డిసెంబరు3 (ఆంధ్రజ్యోతి): పట్టణాల మాదిరిగానే పల్లెల్లోనూ ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించి వనాలను పెంచే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అనుకున్నట్లుగానే ఐదు నెలలుగా జిల్లా వ్యాప్తంగా ప్రకృతి వనాల నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. మోడల్‌ పల్లె ప్రకృతి వనంగా ఇచ్చోడ మండలం ముక్ర(కె) గ్రామంలో పార్కును పచ్చదనంతో తీర్చిదిద్దారు. ఈ విధంగానే జిల్లా అంతటా ప్రకృతి వనాలను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినా ఆచరణ సాధ్యం కావడం లేదు. మెజార్టీ గ్రామాల్లో స్థల సేకరణ పెద్ద సమస్యగా మారుతోంది. కావాల్సినంత స్థలం అందుబాటులో లేకపోవడంతో హడావిడిగానే పనులు ప్రారంభించారు. జిల్లాలో 467 గ్రామ పంచాయతీల్లో ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తుండగా ఇప్పటి వరకు 462 గ్రామాల్లో పనులు ప్రారంభమయ్యాయి. మరో 5 పంచాయతీల్లో స్థల వివాదం ఉండడంతో పనులు నిలిచిపోయాయి. ఇప్పటి వరకు 126 ప్రకృతి వనాల పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతు న్నారు. మిగతా గ్రామాల్లో వివిధ దశల్లో కనిపిస్తున్నాయి. ఉపాధి హామీ నిధుల కింద ఒక్కో ప్రకృతి వనానికి రూ.6లక్షలు నిధులు మంజూరు చేశారు. కానీ కొందరు సర్పంచ్‌లు పనులు చేపట్టడంలో నిర్లక్ష్యం చూపడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. జిల్లా అధికారులు తరచూ సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తూ దిశా నిర్దేశం చేస్తున్నా అనుకున్నంత స్థాయిలో పనులు ముందుకు సాగడం లేదు. హడావిడిగా పనులు చేపట్టడంతో నగుబాటుగానే మారుతున్నాయి. పార్కుల నిర్వహణ గాలికొదిలేయడంతో అధ్వానంగా తయారవుతున్నాయి. 

ఊరికి కిలో మీటర్ల దూరం..

స్థలం లేదన్న సాకుతో కొన్ని గ్రామాల్లో ప్రకృతి వనాలను ఊరికి కిలో మీటర్ల దూరంలో ఏర్పాటు చేస్తున్నారు. రెవెన్యూ, ప్రభుత్వ భూములు అందుబాటులో లేక  అటవీ ప్రాంతంలో ప్రకృతి వనాలను నిర్మిస్తున్నారు. అటవీ ప్రాంతంలో ఉన్న చెట్లను నరికి మరి పార్కు స్థలాన్ని చదును చేస్తూ మొక్కలు నాటుతున్నారు. ఊరికి కిలో మీటర్ల దూరంలో పార్కులను ఏర్పాటు చేస్తే చిన్న పిల్లలు, వృద్ధులకు ఇబ్బందులు తప్పవంటున్నారు. అటవీ ప్రాంతంలోకి వెళ్లేందుకు ఎవరు ఆసక్తి చూపరన్న వాదనలు వినిపిస్తున్నాయి. గ్రామంలో అందుబాటులో ఉంటేనే సాయంత్రం, ఉదయం వేళల్లో పార్కుల్లో ప్రజలు సేదతీరే అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల ఎలాంటి రక్షణ చర్యలు ఏర్పాటు చేయక పోవడంతో నాటిన మొక్కలు పశువుల పాలవుతున్నాయి.

మొక్కల లెక్కల్లో తేడాలు..

అసలు నిబంధనల ప్రకారం ప్రకృతి వనాల చుట్టు భారీ వృక్ష జాతీ మొక్కలను నాటి మధ్యలో పూల, ఔషధ మొక్కలను నాటాల్సి ఉంటుంది. అలాగే చుట్టూ ట్రాక్‌ను ఏర్పాటు చేయాలి. కానీ నాటిన మొక్కల్లోనే భారీ తేడాలు కనిపిస్తున్నాయి. రికార్డుల్లో ఉన్న మొక్కలకు, క్షేత్ర స్థాయిలో కనిపిస్తున్న మొక్కలకు ఎలాంటి పొంతన లేకుండానే పోతోంది. ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో నర్సరీని ఏర్పాటు చేసుకుని అందులో పెంచిన మొక్కలనే నాటాల్సి ఉంది. దీనికి పంచాయతీ నిధుల నుంచి 10 శాతం ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంది. కానీ కొందరు సర్పంచ్‌లు ఇతర ప్రాంతాల నుంచి మొక్కలను కొనుగోలు చేస్తూ తప్పుడు బిల్లులతో కాకీ లెక్కలు చెబుతు కొంత సొమ్మును జేబులో వేసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు చెబుతున్నట్లుగా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. మొక్కలను నాటి వదిలేయడంతో రోజుల వ్యవధిలోనే కనిపించకుండా పోతున్నాయి. 

ఆసక్తి చూపని సర్పంచ్‌లు..

గ్రామాల్లో ప్రకృతి వనాలను ఏర్పాటు చేసేందుకు ఎక్కువ మంది సర్పంచ్‌లు అంతగా ఆసక్తి చూపించినట్లు కనిపించడం లేదు. ఏదో అధికారుల ఆదేశాల ప్రకారమే పనులు చేస్తూ చేతులు దలుపుకుం టున్నారు. జిల్లా ఉన్నతాధికారుల హెచ్చరికలతో మండల స్థాయి అధికారులు హడావిడి చేస్తున్నా ఆశించినంత ఫలితం కనిపించడం లేదు. ఏదో మొక్కలు నాటామా, వదిలేశామా అన్నట్లుగా సర్పంచ్‌ల తీరు కనిపిస్తోంది. ఆహ్లాదాన్ని పంచేందుకు పూల మొక్కలను ఎక్కడా పెంచడం లేదు. ఇప్పటికే గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్‌, నీటి ట్యాం కర్లను అందజేసినా సక్రమంగా సద్వినియోగం కావడం లేదు. క్రమం తప్పకుండా మొక్కలకు నీటిని సరఫరా చేయక పోవడంతో మొలక దశలోనే వాడు ముఖం పట్టి ఎండిపోతున్నాయి. గ్రామాల్లో జరుగుతు న్న ఇతర అభివృద్ధి పనుల్లో బిజీగా మారిపోతున్న సిబ్బంది ప్రకృతి వనాల జోలికి వెళ్లక పోవడంతో పరిస్థితి అధ్వానంగా తయారవు తోంది. మండల స్థాయి అధికారులు మాత్రం ఉన్నతాధికారులకు తప్పుడు నివేదికలు ఇస్తూ తప్పించుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.

పనులను వేగవంతం చేయాలని చెబుతున్నాం..

- రాథోడ్‌ రాజేశ్వర్‌ (డీఆర్డీఏ పీడీ, ఆదిలాబాద్‌)

జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ప్రకృతి వనాల పనులను వేగవంతంగా చేయాలని  పదే పదే చెబుతున్నాం. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ప్రకృతి వనాలు పచ్చగా ఆహ్లాద కరంగా కనిపిస్తున్నాయి. మిగతా గ్రామాల్లో ప్రకృతి వనాలను పూర్తి చేయాలని ఆదేశిస్తున్నాం. హరితహారం, ప్రకృతి వనాల ఏర్పాటుపై నిర్లక్ష్యం వహిస్తున్న సర్పంచ్‌లపై చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2020-12-04T05:20:11+05:30 IST