ఎమ్మెల్యేలను బెదిరించారు.. ఆధారాలున్నాయి : పుదుచ్చేరి మాజీ సీఎం

ABN , First Publish Date - 2021-02-25T00:16:39+05:30 IST

తమ ఎమ్మెల్యేలను బీజేపీ బెదిరించిందని, అందుకు తగ్గ ఆధారాలూ తమవద్ద ఉన్నాయని మాజీ సీఎం నారాయణ

ఎమ్మెల్యేలను బెదిరించారు.. ఆధారాలున్నాయి : పుదుచ్చేరి మాజీ సీఎం

పుదుచ్చేరి : తమ ఎమ్మెల్యేలను బీజేపీ బెదిరించిందని, అందుకు తగ్గ ఆధారాలూ తమవద్ద ఉన్నాయని మాజీ సీఎం నారాయణ స్వామి ఆరోపించారు. అంతేకాకుండా కాంగ్రెస్ నుంచి బయటికి రావాలంటూ తీవ్ర స్థాయిలో ఒత్తిడి కూడా చేశారని ఆయన పేర్కొన్నారు. ఓ జాతీయ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు. అయితే తన వ్యవహార శైలి కారణంగానే పార్టీకి గుడ్ బై చెప్పారన్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని, అవంతా పుకార్లేనని కొట్టిపారేశారు. ‘‘గత నాలుగు సంవత్సరాలుగా ఎమ్మెల్యేలందరూ నాతోనే ఉన్నారు. హఠాత్తుగా నాకు వ్యతిరేకంగా మారిపోయారు. నాపై విమర్శలకు దిగారు. వారిని భయభ్రాంతులకు గురి చేశారు. అందుకు తగ్గ ఆధారాలు నావద్ద ఉన్నాయి.’’ అని ఆయన పేర్కొన్నారు.


అయితే ‘ప్యారాచూట్ సీఎం’ అన్న విమర్శలపై కూడా మాజీ సీఎం స్పందించారు. అందర్నీ సంప్రదించిన తర్వాతే తాను సీఎం పగ్గాలు తీసుకున్నానని, ఇందులో అధిష్ఠానం ఒత్తిడి ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. తనను సీఎంగా నియమించే వ్యవహారంలో సోనియా, రాహుల్ ఎలాంటి జోక్యమూ చేసుకోలేదని తెలిపారు. కాంగ్రెస్ నేతల బృందం రాష్ట్రానికి వచ్చి, ఎమ్మెల్యేలందర్నీ సంప్రదించిన  తర్వాతే సీఎం పదవికి తన పేరును ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. ఇందులో మాత్రం అధిష్ఠానం పాత్ర ఏమీ లేదని కుండబద్దలు కొట్టారు. అయితే పాండిచ్చేరి రాజకీయ వ్యవహారంపై సోనియా, రాహుల్ ఏమాత్రం అసంతృప్తితో లేరని, వ్యవహారం ముదిరినప్పటి నుంచీ తనకు వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారని ఆయన వెల్లడించారు.


కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసి నరేంద్ర మోదీ సాధించినదేముందో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పుదుచ్చేరి ప్రజలు కాంగ్రెస్‌పై సానుభూతితో ఉన్నారని, వారందరూ కాంగ్రెస్‌తోనే ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘‘పాండిచ్చేరి ప్రజలు కాంగ్రెస్‌తోనే ఉన్నారు. వారికి మాపై సానుభూతి ఉంది. అనుమానం ఉంటే వచ్చి చూడండి. నాకు, నా ఎమ్మెల్యేలకు ప్రజల సంపూర్ణ మద్దతు ఉంది. తిరిగి కాంగ్రెస్, డీఎంకే ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది.’’ అని నారాయణ స్వామి ధీమా వ్యక్తం చేశారు. తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడతారా? అని ప్రశ్నించగా... సోనియా, రాహుల్ ఏ బాధ్యతలు అప్పజెబితే ఆ బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని నారాయణ స్వామి స్పష్టం చేశారు. 


Updated Date - 2021-02-25T00:16:39+05:30 IST