రీజనల్‌ రింగ్‌ రోడ్డు రాష్ట్రానికే మణిహారం.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ABN , First Publish Date - 2021-02-24T05:08:51+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలల ప్రాజెక్టు అయిన రీజనల్‌ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) రాష్ట్రానికే మణిహారమని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రహదారిని మంజూరుచేసిన కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

రీజనల్‌ రింగ్‌ రోడ్డు రాష్ట్రానికే మణిహారం..   మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

 కేంద్ర అనుమతుల మంజూరు నేపథ్యంలో ప్రకటన విడుదల

ఖమ్మంటౌన్‌, ఫిబ్రవరి 23: ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలల ప్రాజెక్టు అయిన రీజనల్‌ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) రాష్ట్రానికే మణిహారమని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రహదారిని మంజూరుచేసిన కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. గతంలో తాను ఆర్‌అండ్‌బీ మంత్రిగా ఉన్నప్పుడు సీఎం  కేసీఆర్‌ తనను ఢిల్లీ తీసుకెళ్లి కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీతో సమావేశమై రీజనల్‌ రింగ్‌రోడ్డు ప్రతిపాదనలు అందించినట్టు వివరించిన ఆయన 2016నవంబరు 24న కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరిస్తూ డిటైల్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) అందచేయాలని కోరిందన్నారు. అయితే ఈ రీజనల్‌ రింగ్‌రోడ్డు జాతీయ రహదారుల శాఖ పరిధిలో మంజూరుకు అవకాశం లేకపోవడంతో రహదారులను ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజించి 2017 ఏప్రిల్‌13న డీపీఆర్‌ అందించామని తుమ్మల తెలిపారు. మొదటి భాగంలో సంగారెడ్డి, నర్సాపూర్‌, గజ్వేల్‌, జగదేవ్‌పూర్‌, భువనగిరి, చౌటుప్పల్‌ మొత్తం 158కిలోమీటర్ల మార్గాన్ని జాతీయ రహదారి 161ఏఏ గా కేంద్రం గుర్తించిందని, 2017 జూన్‌ 23న మంజూరు ఇచ్చారన్నారు. రెండోభాగం చౌటుప్పల్‌, చేవెళ్ల, శంకరపల్లి, ఆమనగల్‌, సంగారెడ్డి మొత్తం 186కి.మీ.కు సోమవారం అనుమతి ఇచ్చారని తుమ్మల తెలిపారు. దీన్ని కూడా జాతీయ రహదారిగా గుర్తించి సంఖ్య కేటయించాలని తుమ్మల నితిన్‌గడ్కరీని కోరారు. మొత్తం 384కి.మీ. ఆర్‌ఆర్‌ఆర్‌కు సుమారు రూ.17వేల కోట్ల వ్యయం అవుతుందని తెలిపారు. ఈ నిర్మాణం వల్ల నూతన శాటిలైట్‌ టౌన్‌షి్‌ప పర్యాటక ప్రదేశాలు ఐటీ కంపెనీలు వస్తాయని, స్థిరాస్థి రంగం పుంజుకుంటుందన్నారు. ఈ రహదారి భూసేకరణ వ్యయాన్ని కేంద్రమే భరించాలని తుమ్మల కోరారు. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత 25రాష్ట్ర రహదారులు సుమారు 3వేల174కి.మీ.మేర జాతీయ రహదారులుగా మార్చుకున్నామన్నారు. భద్రాచలం-సిర్పూర్‌ వయా ఏటూరునాగారం వరకు 396కి.మీ. జాతీయ రహదారిని తాను ఆర్‌అండ్‌బీ మంత్రిగా ఉన్నప్పుడే కేంద్రం మంజూరుచేయగా డీపీఆర్‌ అందించామన్నారు. దీనివల్ల కోల్‌కారిడార్‌తోపాటు జలరవాణాకు అనుసంధానం ఏర్పడుతుందని తుమ్మల పేర్కొన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ జాతీయ రహదారులు మంజూరు చేయించిన సీఎం కేసీఆర్‌కు తుమ్మల ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.


Updated Date - 2021-02-24T05:08:51+05:30 IST