ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తీరని అన్యాయం

ABN , First Publish Date - 2022-01-24T06:18:57+05:30 IST

ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తీరని అన్యాయం

ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తీరని అన్యాయం

మాజీమంత్రి కొల్లు రవీంద్ర ధ్వజం

మచిలీపట్నం టౌన్‌, జనవరి 23 : వైసీపీ పాలనలో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పే-రివిజన్‌ కమిటీలో తీరని అన్యాయం జరిగిందని మాజీమంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మచిలీపట్నంలో హెచ్‌ఆర్‌ఏ 14 శాతం ఉండగా, అప్పట్లో సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి 2018, జనవరి నుంచి 20 శాతానికి పెంచామన్నారు. ఉద్యోగులు అడిగినా, అడగకపోయినా ప్రతి ఆరు నెలలకు డీఏ పెంచేవారన్నారు. పీఆర్‌సీలో చంద్రబాబు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చారని గుర్తుచేశారు. ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు, రిటైరైన ఆరు నెలల్లోగా గ్రాట్యుటీ, పింఛన్‌ ఇచ్చేవారని చెప్పారు. జగన్‌రెడ్డి పాలనలో ఉద్యోగులకు రివర్స్‌ పీఆర్సీ ఇస్తున్నారని మండిపడ్డారు. జీతాలు పెంచాల్సింది పోయి.. ఉద్యోగుల నుంచి జీతంలో రూ.50 నుంచి లక్ష రూపాయల వరకూ ఎదురు తీసుకునే పరిస్థితి దాపురించిందన్నారు. రిటైరైనా ఉద్యోగులకు పింఛనులో కోత విధించి ప్రభుత్వానికే 4 శాతం ఐఆర్‌ చెల్లించమనడం విడ్డూరంగా ఉందన్నారు. మట్టి ఖర్చులు కూడా తగ్గించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రభుత్వం వద్ద డబ్బు లేకే రిటైర్మెంట్‌ వయసును ఎవరూ అడగకుండానే 62 ఏళ్లకు పెంచారని చెప్పారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేసే ఉద్యమాలకు టీడీపీ మద్దతు ఇస్తుందన్నారు. 

Updated Date - 2022-01-24T06:18:57+05:30 IST