Abn logo
Sep 18 2021 @ 10:23AM

మాజీ మంత్రిపై ఇసుక స్మగ్లింగ్‌ కేసు

చెన్నై: ఏసీబీ దాడులకు గురైన అన్నా డీఎంకే మాజీ మంత్రి కేసీ వీరమణిపై తాజాగా ఇసుక స్మగ్లింగ్‌ కేసు నమోదైంది. ఆదాయానికి మించి ఆరింతలకు పైగా అక్రమార్జనలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు గురువారం వీరమణి నివాసాలు, సంస్థలు, బంధువుల ఇళ్లు, హోటళ్ళలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 35 చోట్ల ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఈ సోదాలు కొనసాగాయి. ఈ తనిఖీల్లో రూ.34లక్షల నగదు, ఐదు కేజీల బంగారం, లక్షరూపాయల విలువచేసే విదేశీ మాదక ద్రవ్యం, రోల్స్‌రాయిస్‌ సహా తొమ్మిది లగ్జరీ కార్లు ఐదు కంప్యూటర్లు, హార్డ్‌ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల సందర్భంగా వీరమణి నివాసం వద్ద రూ.30 లక్షల విలువ చేసే 275 యూనిట్ల ఇసుకను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీరమణి తన హోటళ్ళ నిర్మాణానికి, తిరుపత్తూరు, ఆంబూరు ప్రాంతాల్లో ప్రైవేటు వ్యక్తుల కట్టడాలను నిర్మించడానికి పాలారు నదిలో భారీ స్థాయిలో ఇసుకను చోరీ చేసి తరలించారని ఏసీబీ అధికారుల విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం వీరమణిపై ఇసుక స్మగ్లింగ్‌ కేసును నమోదుచేశామని, త్వరలో ఆయనకు సమన్లు పంపి విచారణ జరుపుతామని అధికారులు తెలిపారు. ఇదే విధంగా లగ్జరీ కార్ల కొనుగోలు కు సంబంధించిన వివరాల గురించి కూడా ఆరా తీస్తున్నామని తెలిపారు. రోల్స్‌రాయిస్‌ కారును ఆయన గుట్టుచప్పుడు కాకుండా కారు షెడ్డులో దాచి ఉంచారని పేర్కొన్నారు. వీరమణి అక్రమార్జనలకు సంబంధించి కూడా కీలకమైన దస్తావేజులను కూడా తనిఖీల సందర్భంగా స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.