నన్ను అరెస్టు చేయాలని ఉత్తర్వులు!

ABN , First Publish Date - 2021-11-28T16:24:26+05:30 IST

తన నేతృత్వంలో గత శాసనసభ ఎన్నికల్లో కోవై జిల్లాలోని 10 నియోజవర్గాలను అన్నాడీఎంకే కైవసం చేసుకుందని, త్వరలో జరుగనున్న పురపాలక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో డీఎంకే ప్రభుత్వం

నన్ను అరెస్టు చేయాలని ఉత్తర్వులు!

            కక్షసాధింపు ధోరణిలో సీఎం: మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి


పెరంబూర్‌(చెన్నై): తన నేతృత్వంలో గత శాసనసభ ఎన్నికల్లో కోవై జిల్లాలోని 10 నియోజవర్గాలను అన్నాడీఎంకే కైవసం చేసుకుందని, త్వరలో జరుగనున్న పురపాలక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో డీఎంకే ప్రభుత్వం తనను అరెస్టు చేసేందుకు ఉత్తర్వులు జారీచేసినట్టు వార్తలు వస్తున్నాయని అన్నాడీఎంకే మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి ఆరోపించారు. కోవైలో శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం చెన్నైలో సంభవించిన వరదలకు అన్నాడీఎంకే ప్రభుత్వం, అప్పటి మంత్రిగా ఉన్న తాను కారణం అని ముఖ్యమంత్రి ఆరోపిస్తున్నారన్నారు. తమ ప్రభుత్వ హయాంలో చెన్నైలో 3,200 ప్రాంతాల్లో వరద నీరు చేరేదని, తాము చేపట్టిన ముందస్తు చర్యల కారణంగా ప్రస్తుతం 67 ప్రాంతాల్లో మాత్రమే నీరు చేరుతుందన్నారు. ప్రతి ఏడాది ఆగస్టు నెలలో కాలువల్లో పూడికతీత పనులు చేపట్టి వర్షాకాలంలో వరదలు ఎదుర్కొనేందుకు, ప్రజలు ఇబ్బందులు పడకుండా వుండేలా చర్యలు చేపడతామన్నారు. కానీ, డీఎంకే హయాంలో అలాంటి ముందస్తు చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. రాబోయే పురపాలక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అధికార డీఎంకే పావులు కదుపుతోందని అన్నారు. అందుకోసం ఓ ఒక్క కేసులోనైనా తనను అరెస్టు చేయాలని ఉత్తర్వులు జారీ అయినట్టు వార్తలు తెలుస్తున్నాయని, తనపై వచ్చే ఆరోపణలు, కేసులను చట్టపరంగా ఎదుర్కొంటానని ఎస్పీ వేలుమణి తెలిపారు.

Updated Date - 2021-11-28T16:24:26+05:30 IST