ఆదిలాబాద్ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌పై గోనె ప్రకాశ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. మరీ ఇలాంటి కామెంట్సా?

ABN , First Publish Date - 2021-12-09T18:29:30+05:30 IST

ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్‌పై మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాశ్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం ఉదయం ప్రెస్‌మీట్ పెట్టి పలు విషయాలపై మాట్లాడిన గోనె ప్రకాశ్..

ఆదిలాబాద్ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌పై గోనె ప్రకాశ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. మరీ ఇలాంటి కామెంట్సా?

కరీంనగర్: ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్‌పై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం ఉదయం ప్రెస్‌మీట్ పెట్టి పలు విషయాలపై మాట్లాడిన గోనె ప్రకాశ్.. కలెక్టర్‌పై వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఆదిలాబాద్ కలెక్టర్ తన బయోడేటా గురించి ఆరా తీశారని, ఓ జర్నలిస్ట్‌ను అడిగి తన గురించి తెలుసుకున్నారని చెబుతూ.. ఆమె చీర తడపకపోతే తన పేరు గోనె ప్రకాష్ రావే కాదంటూ సవాల్ విసిరారు. 22 మంది టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కలెక్టర్ ఛాంబర్‌లో ఏం చేశారని, 10 మంది ఎమ్మెల్యేలు, నలుగురు జెడ్పీ చైర్మన్లు, ఒక ఎమ్మెల్సీ కలెక్టర్ ఛాంబర్‌లో ఎలా ఉంటారని ప్రశ్నించారు. ఛాంబర్ సీసీటీవీ ఫుటేజీ అడిగినట్లు తెలిపారు. ‘కేసీఆర్ భాషలో లాగు తడవాలని అంటారు కదా.. నేను ఆమె చీర తడుపుతా’ అంటూ గోనె ప్రకాశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.


చల్మెడ లక్ష్మీ నరసింహరావును బకరా చేస్తున్నారని, వేములవాడకు ఉప ఎన్నికలు వస్తే డబ్బులు పెట్టడానికే ఆయనను పార్టీలోకి ఆహ్వానించారని, తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీని విమర్శించడం తప్పని అధికార పార్టీకి హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆగడాలపై తెలంగాణ ప్రజాస్వామ్య చర్చావేదిక ద్వారా ప్రజల్లోకి వెళతామని చెప్పారు. బీజేపీకి అన్నింటిలోనూ టీఆర్ఎస్ సపోర్ట్ చేసిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పునాదులు కదులుతున్నాయని గోనె ప్రకాశ్ అన్నారు.


కలెక్టర్‌పై ఇలాంటి వ్యాఖ్యలా?

ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్‌పై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఒక పార్టీ నేతలు మరో పార్టీ నేతలపై వ్యాఖ్యలు చేయడం సాధారణమని, కానీ ఒక కలెక్టర్‌పై.. అది కూడా మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని పలువురు నేతలు గోనె ప్రకాశ్‌ను తప్పుబడుతున్నారు.

Updated Date - 2021-12-09T18:29:30+05:30 IST