Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీడీపీ కార్యకర్తలపై అనాగరిక దాడులు

సైదాను పరామర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే యరపతినేని, మాజీ మంత్రి పుల్లారావు డాక్టర్‌ చదలవాడ

మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు

నరసరావుపేట టౌన్‌, నవంబరు28: టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అనాగరిక దాడులు చేస్తున్నారని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. ఇటీవల దాడిలో తీవ్రంగా గాయపడి నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న  పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువుకు చెందిన సైదాను ఆదివారం ఆయన పరామర్శించారు. సైదా కుటుంబానికి రూ.50 వేలు ఆర్థిక సహాయం చేశారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధిలో తీవ్రంగా వెనుకబడి పోయిందని, ఆయా విషయాలను దారి మళ్లించడానికి అసెంబ్లీలో ఇష్టారాజ్యంగా మాట్లాడడం, మహిళలను కించపరచడం, దాడులు చేయడం వంటివి చేస్తున్నారని ఆరోపించారు. మేము అధికారంలో ఉన్నాం, ఏమైనా చేస్తాం అనుకుంటే పొరపాటన్నారు. రేపు మాది అవుతుందని, అప్పడు మీరు వెనకకు తిరిగి చూసుకొనే పరిస్థితి ఉండదన్నారు. ప్రజలిచ్చిన అధికారాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి మీ ఇష్టారాజ్యంగా చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. చైతన్యవంతమైన రాష్ట్ర ప్రజలు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పి ఇంటికి పంపుతారని గుర్తుపెట్టుకొని, వళ్ళు దగ్గరపెట్టు కోవాలన్నారు. 

మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని, ముఖ్యమంత్రి మాత్రం తాడేపల్లి రాజప్రసాదం వదలి బయటకు రావడం లేదన్నారు. నేడు తడిసిన ధాన్యం కొనే పరిస్థితి లేదన్నారు. ఎన్యూమరేషన్‌ చేయాల్సిన అధికారులు ఎక్కడున్నారో తెలియడం లేదన్నారు. హెక్టారుకు రూ.50వేలు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, పడిపోయిన గృహాలకు పరిహారం ఇవ్వాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ విపత్తుగా పరిగణించి సాధారణ పరిస్థితులు వచ్చేవరకు సౌకర్యాలు కల్పించాలని కోరారు. తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షం గొంతునొక్కేందుకు జగన్‌మోహనరెడ్డి చేయని అరాచకం లేదన్నారు.  ఏముహూర్తాన జగన్‌మోహనరెడ్డి కాలుమోపాడో కానీ మూడు ఖరీఫ్‌, రెండు రబీ సీజన్లలో పంటలు సరిగా చేతికొచ్చింది లేదన్నారు. సమావేశంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు, వేల్పుల సింహాద్రి యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

Advertisement
Advertisement