భీమవరం ప్రజలు గెలిచారు... నరసాపురం ప్రజలు ఓడిపోయారు: హరిరామ జోగయ్య

ABN , First Publish Date - 2022-01-26T21:17:52+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ ప్రకటించిన కొత్త జిల్లాల కారణంగా మొదలైన చిచ్చు ఏపీలో

భీమవరం ప్రజలు గెలిచారు... నరసాపురం ప్రజలు ఓడిపోయారు: హరిరామ జోగయ్య

నర్సాపురం: రాష్ట్ర ప్రభుత్వ ప్రకటించిన కొత్త జిల్లాల కారణంగా మొదలైన చిచ్చు ఏపీలో రగులుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా భీమవరం జిల్లా ఏర్పడడంపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య సంచలన ప్రకటన చేశారు. కొత్తజిల్లాల ఏర్పాటులో భీమవరం వైసీపీ నేతలు, ప్రజలు విజయం సాధించారని ఆయన పేర్కొన్నారు. నరసాపురం వైసీపీ నేతలు, ప్రజలు ఓడిపోయారని ఆయన మంటలు రేపారు. ఈ ఒక్క నిర్ణయం చాలు ప్రభుత్వం ఏ ప్రాంతాన్ని, ఏ కులాన్ని వెనకేసుకొస్తుందో తెలియడానికి అని హరిరామజోగయ్య ప్రజలలో భావోద్వేగాలను కల్గించారు. 




కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాను రెండు జిల్లాలుగా అనగా ఏలూరు  కేంద్రంగా ఏలూరు జిల్లా, భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఏలూరు జిల్లాలో ఏలూరు, దెందులూరు, పోలవరం, చింతలపూడి, ఉంగుటూరు పాత నియోజకవర్గాలతో పాటు కొత్తగా కృష్ణా జిల్లా పరిధిలోని నూజివీడు, కైకలూరులను ఇందులో విలీనం చేయనున్నారు. దాదాపు ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలను ఒకటిగా చేసి కొత్త జిల్లాకు రూపకల్పన చేశారు.


భీమవరం జిల్లాలో నరసాపురం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను చేరుస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. నరసాపురం, ఉండి, భీమవరం, పాలకొల్లు, ఆచంట, తణుకు, తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజక వర్గాలు ఉంటాయి. రాజకీయంగా, రైతు వారీగా, మార్కెట్‌పరంగా ఒకింత చైతన్యం కలిగిన ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందినదిగా పేరొందింది. ఇప్పటికే తాడేపల్లిగూడెం విద్యా, వాణిజ్య రంగాల్లో దూసుకు పోతుండగా భీమవరం రాష్ట్రానికే కాకుండా ఇతర ప్రాంతాలకు చిరపరిచితమైన పేరు. ఆక్వా రంగంలో విదేశీయులను ఆకర్షించిన ప్రాంతమిది.


Updated Date - 2022-01-26T21:17:52+05:30 IST