ఉప ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయిస్తాయి..

ABN , First Publish Date - 2021-10-18T05:18:57+05:30 IST

ఉప ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయిస్తాయి..

ఉప ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయిస్తాయి..
శ్రీరాములపల్లిలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌, పక్కన బల్మూరి

  కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట నర్సింగరావు

కమలాపూర్‌, అక్టోబరు 17: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తాయని హుజూరాబాద్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట నర్సింగరావు అన్నారు. కమలాపూర్‌ మండలంలోని బత్తినివానిపల్లి, గోపాల్‌పూర్‌, శనిగరం, మాధన్నపేట, గూనిపర్తి, శ్రీరాములపల్లి, అంబాల, గూడూరు, నెరెల్ల, లక్ష్మీపూర్‌ గ్రామాలలో  ఆదివారం మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌గౌడ్‌, ములుగు ఎమ్మెల్యే సీతక్కతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మొదట బత్తినివానిపల్లి గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీల మోసాలను ఎండగట్టాలన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ఆస్తులను కాపాడుకోవడానికే ఆత్మగౌరవం గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు నాటకాలు ఆడుతున్నాయన్నారు. ప్రజలు చేతి గుర్తుకు ఓటు వేసి తనను ఆశీర్వదించాలని కోరారు.

బీజేపీ, టీఆర్‌ఎస్‌ దోస్తీ

బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు రెండు ఢిల్లీలో దోస్తీ చేస్తాయని, రాష్ట్రంలో కొట్లాడుకుంటారని  మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ అన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు వేర్వేరు కాదన్నారు. ఢిల్లీకి పోయి సీఎం కేసీఆర్‌ ప్రధానితో మీటింగ్‌ పెట్టి వచ్చారన్నారు. నియోజకవర్గంలోని అభివృద్ధిపై బీజేపీ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఒకరిపై ఒకరు విమర్శించుకుంటున్నారన్నారు. వాస్తవానికి  చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నారు. ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే మళ్లీ ఇందిరమ్మ రాజ్యం రావాలన్నారు 

ఆ రెండు పార్టీలు ఒక్కటే 

బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు రెండు ఒక్కటేనని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. రెండు పార్టీల విధానాలు ఒక్కటేనన్నారు. ఆ పార్టీలకు ఓటు వేస్తే కొత్తగా వచ్చే మార్పు ఏమీ ఉండదన్నారు. ప్రజల సమస్యలపై, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై మాట్లాడాలంటే ఒక గొంతు కావాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఆరుగురు ప్రజల సమస్యలపై పోరాడుతున్నామన్నారు. సీఎం కేసీఆర్‌ వద్ద ఉన్న వందమంది టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ మాట్లాడం లేదన్నారు. అసెంబ్లీలో చెక్క భజన చేస్తున్నారన్నారు. బాగుందని చెప్పడానికి వారికి మైక్‌ ఇస్తారు గానీ, ప్రజల బాధలను చెప్పడానికి అసెంబ్లీలో తమకు మైక్‌ ఇవ్వడం లేదన్నారు. ప్రతిపక్షాల గొంతు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. నిద్రపోయిన ప్రభుత్వాన్ని లేపేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఉండాలన్నారు. ఎన్నికలలో చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బల్మూరు వెంకట నర్సింగరావును గెలిపించాలన్నారు. కార్యక్రమంలో వరంగల్‌ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, దొమ్మాటి సాంబయ్య, నమిండ్ల శ్రీనివాస్‌,  బట్టి శ్రీనివాస్‌, బొమ్మనపల్లి అశోక్‌రెడ్డి, వెంకట్‌రామిరెడ్డి,  మండల కాంగ్రెస్‌ నాయకులు చరణ్‌పటేల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-18T05:18:57+05:30 IST