జైలు నుంచి విడుదలైన మాజీ దేశాధినేత

ABN , First Publish Date - 2021-12-31T22:53:12+05:30 IST

అయితే ఆమె ఆరోగ్యం క్షీణిస్తోందనే కారణంతో దక్షిణ కొరియా ప్రస్తుత అధ్యక్షుడు మూన్ జే-ఇన్, గతవారం జ్యూహైకు ప్రత్యేక క్షమాపణ మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దురదృష్ణకర చరిత్రను అధిగమించి జాతీయ ఐక్యతను పెంపొందించేందుకు..

జైలు నుంచి విడుదలైన మాజీ దేశాధినేత

సియోల్: ఐదేళ్లుగా జైలు జీవితం గడుపుతున్న దక్షిణ కొరియా మాజీ దేశాధినేత పార్క్ జ్యూహై (69) ఎట్టకేలకు విడుదలయ్యారు. అవినీతి కేసులో అరెస్టైన ఆమె.. దక్షిణ కొరియాకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మొట్టమొదటి దక్షిణ కొరియా అధ్యక్షులు జ్యూహైనే. అంతే కాదు.. ఆ దేశానికి మొదటి మహిళా అధినేత కూడా ఆమెనే. 2017లో అవినీతి కేసులో అరెస్టైన ఆమె శుక్రవారం డిసెంబర్ 31న విడుదల అయ్యారు. అయితే 2022 మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో జ్యూహై ఏదైనా పాత్ర పోషించనున్నారా అనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.


2017లో ఆమెపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఆమెపై పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానానికి దక్షిణ కొరియా రాజ్యాంగ న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఈ ఓటింగ్‌లో ఆమెకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఓట్లు వచ్చాయి. దీంతో ఆమెతో పాటు శాంసంగ్, లొట్టె సంస్థ చీఫ్‌లు కూడా జైలుపాలయ్యారు. తన కుటుంబ సభ్యులకు స్నేహితులకు అక్రమ సంపాదన సమకూర్చేందుకు పది వేల కోట్ల రూపాయలకు కుదుర్చుకున్న ఒప్పందంలో జ్యూహై దోషిగా తేలారు. దీంతో ఆమెకు 20 ఏళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది.


అయితే ఆమె ఆరోగ్యం క్షీణిస్తోందనే కారణంతో దక్షిణ కొరియా ప్రస్తుత అధ్యక్షుడు మూన్ జే-ఇన్, గతవారం జ్యూహైకు ప్రత్యేక క్షమాపణ మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దురదృష్ణకర చరిత్రను అధిగమించి జాతీయ ఐక్యతను పెంపొందించేందుకు పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు. జ్యూహై గత నెల రోజులుగా సియోల్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే విడుదలపై ఆమె ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ.. ఆమె తరపు న్యాయవాది మాత్రం అధ్యక్షుడు మూన్‌కి ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2021-12-31T22:53:12+05:30 IST