హద్దుమీరిన వివాదం

ABN , First Publish Date - 2021-07-29T07:22:35+05:30 IST

ఒక్కఅంగుళం భూభాగాన్ని కూడా పొరుగురాష్ట్రానికి వదిలేదిలేదంటూ ప్రకటించిన అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ మిజోరంతో ఉన్న సరిహద్దు వివాదంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు...

హద్దుమీరిన వివాదం

ఒక్కఅంగుళం భూభాగాన్ని కూడా పొరుగురాష్ట్రానికి వదిలేదిలేదంటూ ప్రకటించిన అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ మిజోరంతో ఉన్న సరిహద్దు వివాదంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. అసోం–మిజోరం సరిహద్దు తగాదా కొత్తగా పుట్టుకొచ్చినదేమీ కాదు. మొన్న ఆరుగురు అసోం పోలీసులు మరణించడం, ఉభయ రాష్ట్రాలకు చెందిన వారు కొందరు గాయపడటం వంటి ఉద్రిక్తఘటనలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. ఇప్పుడు వివాదం ఏకంగా దేశాలమధ్య యుద్ధంలాగా పరిణమించడం, రెండు రాష్ట్రాల పోలీసులూ పరస్పరం కాల్పులు జరుపుకోవడం విస్మయం కలిగిస్తోంది. ఈ పరిణామాలకంటే, హిమంత బిశ్వశర్మ మారిన వైఖరి మరింత విస్మయం కలిగిస్తోంది.


హిమంతశర్మ అసోం ముఖ్యమంత్రి మాత్రమే కాదు, ఈశాన్యంలో కమలానికి పెద్దదిక్కు, కాంగ్రెస్‌ వ్యతిరేక పక్షాలతో కూడిన ‘నార్త్‌ఈస్ట్‌ డెమోక్రాటిక్‌ అలయెన్స్‌’ (నెడా) కన్వీనర్‌. అందుకే, ఆయన దూకుడు చూస్తున్నవారికి అనుమానాలు కలుగుతున్నాయి. ఆయనే ఘర్షణలను రెచ్చగొడుతున్నట్టుగా ఉన్నదని కొందరివాదన. ఇటువంటి సందర్భంలో జరిగినదానిపై ఆవేదన వెలిబుచ్చడం, సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటామని చెప్పడం జరగాలి. పైగా, ఇద్దరు ముఖ్యమంత్రులతో అమిత్‌షా దీనికి రెండురోజుల ముందు షిల్లాంగ్‌లో సమావేశమై, హద్దులమీద చర్చించి వెళ్ళిన తరువాత, ఉద్రిక్తతలను చల్లార్చేందుకు మరింత విశేష ప్రయత్నం జరగాలి. కానీ, హిమంత శర్మ తాను స్వయంగా దాడుల విడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి, కఠినవ్యాఖ్యలు చేశారు. ఐదుగురు అసోం పోలీసులను చంపివేసిన తరువాత మిజో పోలీసులూ, గూండాలూ ఎలా వేడుకలు చేసుకుంటున్నారో చూడండి, ఎంత దారుణం అంటూ ఓ విడియో పోస్టు చేశారు. అసోం పోలీసులమీద మిజోపోలీసులు మెషీన్‌గన్లు ప్రయోగించారన్న తన ఆరోపణకు ఇదిగో ఆధారం అంటూ మరో విడియో పోస్టుచేశారు. ఈ విడియోల సందర్భం పూర్తిగా వేరని విమర్శలు వస్తున్నాయి. 


ఐదేళ్ళక్రితం ‘నెడా’ ఆరంభించి, మిజోరం ముఖ్యమంత్రి జోరమ్‌తంగా పార్టీ మిజోనేషనల్‌ ఫ్రంట్‌ని కూడా అందులో భాగస్వామినిచేశారు హిమంత. ఆ పార్టీ విజయాలను కూడా తన ఖాతాలో వేసుకున్నారు. కానీ, ఇటీవలికాలంలో బీజేపీ ఎంఎన్‌ఎఫ్‌ మధ్య వ్యవహారం చెడిన మాట నిజం. ఈశాన్యంలోని ఏడురాష్ట్రాల్లోనూ ఎన్డీయే పాలకపక్షంగా ఉన్నప్పటికీ, నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీ నేరుగా అధికారంలో ఉన్నది. మేఘాలయ, నాగాలాండ్‌, మిజోరంలో మిత్రపక్షమే. ఇంతకుమించి, ఈశాన్యంలో బీజేపీ విస్తరించడం సాధ్యం కాదనీ, అందువల్ల, తాను నేరుగా అధికారంలో లేని రాష్ట్రాలనుంచి ఏదో ఒక వివాదమో, సమస్యో ఎదురవుతున్నట్టుగా, వాటిని శక్తిమంతంగా ఎదుర్కొంటున్నట్టుగా చిత్రీకరించడం ద్వారా తానూ పార్టీ బలపడేట్టుగా హిమంతశర్మ చూస్తున్నారని ఓ విమర్శ. ఇనస్పెక్టర్‌ జనరల్‌ స్థాయి అధికారి నాయకత్వంలో అసోం పోలీసులే మిజో చెక్‌పోస్టుమీదకు మొదటగా దండెత్తి వివాదానికి ఆజ్యంపోశారనీ, కేంద్రహోంమంత్రి నెడాస్ఫూర్తితో వివాదాన్ని పరిష్కరించుకోమని చెప్పిన తరువాత కూడా ఇలా ఎందుకు జరుగుతోందని కొందరు ఆశ్చర్యపోతున్నారు. సీఏఏకు సంపూర్ణ మద్దతునివ్వడం, బంగ్లాదేశీ హిందువుల పక్షాన నిలవడం, ఈశాన్యంలోని క్రైస్తవ మెజారిటీ రాష్ట్రాలను ఇరుకునపెట్టేరీతిలో గోరక్షణచట్టం తేవడం వంటి చర్యలు ఆయన దూరదృష్టితో చేస్తున్న పనులే. దమ్మున్న నాయకుడిగా రుజువుచేసుకొనేందుకు ప్రయత్నించడంలో తప్పేమీ లేదు కానీ, సరిహద్దు వివాదాలకు పోలీసు పరిష్కారాలను వెతికే ప్రయత్నం చేస్తే అవి వికటించే ప్రమాదం ఉన్నది. పలు తెగలు, జాతులకు నిలయమైన ఈశాన్యంలో నిప్పు రాజేయడం సులువేగానీ, చల్లార్చడమే కష్టం. పొరుగుదేశాలతో సరిహద్దు పంచుకుంటున్న ఈశాన్యంతో సున్నితంగా వ్యవహరించడం, ఇటువంటి ఘర్షణలకు తావులేని రీతిలో వివాదాలను పరిష్కరించడం ముఖ్యం.

Updated Date - 2021-07-29T07:22:35+05:30 IST