‘ఎక్సైజ్‌’ పునర్వ్యవస్థీకరణ

ABN , First Publish Date - 2020-12-05T06:06:34+05:30 IST

ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖను ప్రభుత్వం పునర్‌వ్యస్థీకరించింది. ఈ శాఖను కేవలం మద్యం సరఫరాకే పరిమితం చేసింది. ఇప్పటివరకు వున్న ఎక్సైజ్‌ పోలీసు స్టేషన్లన్నీ ‘స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ)’ స్టేషన్లుగా మారతాయి.

‘ఎక్సైజ్‌’ పునర్వ్యవస్థీకరణ
నర్సీపట్నం ఎక్సైజ్‌ స్టేషన్‌

ఇకనుంచి మద్యంపై పర్యవేక్షణకే పరిమితం

ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ స్టేషన్లన్నీ ఎస్‌బీఈ స్టేషన్లుగా మార్పు

ఇసుక, మద్యం అక్రమ రవాణాను నిరోధించే బాధ్యతలు అప్పగింత

గంజాయి, నాటుసారా,  గుట్కా, ఆన్‌లైన్‌ జూదం కూడా

గ్రామీణ జిల్లాలో ఏఈఎస్‌ విభజన

కొత్తగా నర్సీపట్నంలో కూడా ఏఈఎస్‌ కార్యాలయం ఏర్పాటు

గొలుగొండలో కొత్తగా స్టేషన్‌

అనకాపల్లి ఏఈఎస్‌...చోడవరం తరలించే యోచన

కనుమరుగు కానున్న సబ్బవరం సర్కిల్‌


నర్సీపట్నం/అనకాపల్లి టౌన్‌, డిసెంబరు 4: 

ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖను ప్రభుత్వం పునర్‌వ్యస్థీకరించింది. ఈ శాఖను కేవలం మద్యం సరఫరాకే పరిమితం చేసింది. ఇప్పటివరకు వున్న ఎక్సైజ్‌ పోలీసు స్టేషన్లన్నీ ‘స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ)’ స్టేషన్లుగా మారతాయి.  గ్రామీణ ప్రాంతంలో ప్రస్తుతం అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ (ఏఈఎస్‌) స్టేషన్‌ వుండగా, దీనిని రెండుగా విభజించి నర్సీపట్నంలో కొత్త స్టేషన్‌ ఏర్పాటుచేసే యోచనలో ప్రభుత్వం వున్నట్టు తెలిసింది. అంతేకాక అనకాపల్లి పట్టణం...జీవీఎంసీ పరిధిలో వుండడంతో ఇక్కడి ఏఈఎస్‌ స్టేషన్‌ను చోడవరం తరలించే ప్రతిపాదన కూడా వున్నట్టు సమాచారం. కాగా నర్సీపట్నం సర్కిల్‌లో కొత్తగా గొలుగొండలో ఎస్‌ఈబీ స్టేషన్‌ ఏర్పాటుచేయగా, సబ్బవరంలోని ఎక్సైజ్‌ సర్కిల్‌ ఆఫీస్‌ను ఎత్తివేస్తున్నారు. 


గంజాయి, నాటుసారా, ఇసుక, మద్యం రవాణాను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కొద్దికాలం క్రితం ‘స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ)’ను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ప్రతి జిల్లాకు ఒక (విశాఖ నగరం, రూరల్‌ జిల్లాకు వేర్వేరుగా) ఏఎస్పీ స్థాయి అధికారిని ఇన్‌చార్జిగా నియమించింది. కిందిస్థాయిలో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ అధికారులు, సిబ్బందిలో ఎక్కువ మందిని ఎస్‌ఈబీకి బదలాయించింది. దీంతో గ్రామీణ ప్రాంతంలోని ఎక్సైజ్‌ స్టేషన్లు ఎస్‌ఈబీ స్టేషన్లుగా మారుతున్నాయి. ఈ విభాగం పరిధిలోకి తాజాగా గుట్కా, ఆన్‌లైన్‌ జూదాన్ని కూడా తీసుకువచ్చారు. ప్రాహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ కేవలం ప్రభుత్వ మద్యం అమ్మకాలకే పరిమితం అవుతున్నది. జిల్లా అంతటికీ విశాఖలో మాత్రమే కార్యాలయం ఉంటుంది. అనకాపల్లిలో వున్న అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయం ‘అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌’ కార్యాలయంగా మారింది. దీని పరిధిలో గ్రామీణ జిల్లా మొత్తం ఉంది. పరిపాలనాపరంగా ఇబ్బందులు వుండడంతో దీనిని రెండుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. కొత్తగా నర్సీపట్నంలో ఏఈఎస్‌ కార్యాలయాన్ని ఏర్పాటుచేస్తారని సమాచారం. అంతేకాక అనకాపల్లి ఏఈఎస్‌ ఆఫీస్‌ను చోడవరం తరలిస్తారని తెలిసింది.  అనకాపల్లి పట్టణం... జీవీఎంసీ పరిధిలో వుండడమే కారణమని అంటున్నారు.  


గొలుగొండలో కొత్త సర్కిల్‌...సబ్బవరం ఎత్తివేత!

నర్సీపట్నం ఎక్సైజ్‌ స్టేషన్‌ (కొత్తగా ఎస్‌ఈబీ) పరిధిలో ఇప్పటివరకు నర్సీపట్నం, రోలుగుంట, మాకవరపాలెం, కోటవురట్ల, గొలుగొండ, నాతవరం, కొయ్యూరు మండలాలు ఉన్నాయి. దీని పరిఽధి ఎక్కువగా వుండడంతో పలురకాల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో నర్సీపట్నం స్టేషన్‌ పరిధిని రెండుగా విభిజించి, గొలుగొండలో కొత్త స్టేషన్‌ ఏర్పాటుచేశారు. ఇకనుంచి నర్సీపట్నం స్టేషన్‌ పరిధిలో నర్సీపట్నం, రోలుగుంట, మాకవరపాలెం, కోటవురట్ల మండలాలు మాత్రమే ఉంటాయి. నాతవరం, గొలుగొండ, కొయ్యూరు మండలాలు గొలుగొండ స్టేషన్‌ పరిధిలో ఉంటాయి. ఈ మూడు మండలాల పరిధిలో ఇప్పటివరకు నమోదైన కేసులు, సీజ్‌ చేసిన వాహనాలను నర్సీపట్నం నుంచి గొలుగొండకు బదలాయిస్తారు. గొలుగొండ ఇన్‌స్పెక్టర్‌గా నర్సీపట్నం ఎస్‌ఈబీ ఇన్‌స్పెక్టర్‌ ఎ.మహేశ్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఇక సబ్బవరం ఎక్సైజ్‌ స్టేషన్‌ను ఎత్తివేస్తున్నారు. దీనిలోని ఫర్నీచర్‌, వాహనాలను గొలుగొండ స్టేషన్‌కు పంపిస్తున్నట్టు తెలిసింది. సబ్బవరం మండలాన్ని అనకాపల్లిలో, పరవాడ మండలాన్ని గాజువాకలో కలిపారు. ఎలమంచిలి సర్కిల్‌ పరిధిలోని ఎస్‌.రాయవరం మండలాన్ని పాయకరావుపేటలో, చోడవరం సర్కిల్‌ పరిధిలోని రావికమతం మండలాన్ని వి.మాడుగులలో చేర్చారు. ఇదిలావుండగా ఎస్‌ఈబీ స్టేషన్‌ల సీఐలందరికీ త్వరలో స్థానచలనం జరిగే అవకాశాలు వున్నట్టు తెలిసింది.

Updated Date - 2020-12-05T06:06:34+05:30 IST