ఆదమరిచిన అజమాయిషీ

ABN , First Publish Date - 2020-03-14T07:02:58+05:30 IST

డబ్బు, ఇంకా విలువైన ఇతర వస్తువులను దాచుకునేందుకు వీలుండడమేగాక, ఖాతాదారుల ఆదేశాను సారం డబ్బు చెల్లించే సంస్థే బ్యాంకు. కరెంట్ ఖాతాలు, పొదుపు (సేవింగ్స్) ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపేణా ప్రజల నుంచి నిధులను బ్యాంకు...

ఆదమరిచిన అజమాయిషీ

2014 మార్చి తరువాత కొత్త రుణాలు మంజూరు చేసేందుకు యెస్ బ్యాంక్‌కు అనుమతి ఇచ్చింది ఎవరు? విశృంఖలంగా రుణాలు మంజూరు చేస్తున్న విషయం రిజర్వ్ బ్యాంక్ లేదా ప్రభుత్వానికి తెలియదా? ప్రతి సంవత్సరాంతంలో బ్యాంక్ బ్యాలెన్స్ షీట్‌ను రిజర్వ్ బ్యాంక్ లేదా ప్రభుత్వంలో ఏ ఒక్కరూ పరిశీలించనే లేదా? యెస్ బ్యాంక్ తన మొట్టమొదటి త్రైమాసిక నష్టాన్ని 2019 జనవరి–-మార్చిలో ప్రకటించిన తరువాత కూడా ప్రమాద ఘంటికలు ఎందుకు మోగలేదు? బ్యాంకింగ్ వ్యవస్థపై పలు స్థాయిల్లో వున్న పర్యవేక్షణ, యెస్ బ్యాంక్ విషయంలో పూర్తిగా విఫలమయిందని ఈ ప్రశ్నలు స్పష్టం చేస్తున్నాయి.


డబ్బు, ఇంకా విలువైన ఇతర వస్తువులను దాచుకునేందుకు వీలుండడమేగాక, ఖాతాదారుల ఆదేశాను సారం డబ్బు చెల్లించే సంస్థే బ్యాంకు. కరెంట్ ఖాతాలు, పొదుపు (సేవింగ్స్) ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపేణా ప్రజల నుంచి నిధులను బ్యాంకు స్వీకరిస్తుంది; వాటిపై వడ్డీ (నిధుల వ్యయం.. -కాస్ట్ ఆఫ్ ఫండ్స్) చెల్లిస్తుంది. ఈ డిపాజిట్లలో ఒక ప్రముఖ భాగాన్ని, రిజర్వ్ బ్యాంక్ నిబంధనల మేరకు షేర్లు, బాండ్లు తదితర ఆర్థిక సాధనాల రూపేణా ఒక క్రమ పద్ధతిలో నిల్వ చేస్తుంది. ఇలా పోగా మిగిలిన నిధులనే రుణాలుగా ఇచ్చి వడ్డీ ఆర్జిస్తుంది (వడ్డీ ఆదాయం-.. ఇంట్రెస్ట్ ఇన్‌కమ్). ఆర్థిక సాధనాల రూపేణా నిల్వ చేసే సొమ్ముపై కూడా విధిగా పరిమితులు ఉంటాయి. ‘వడ్డీ ఆదాయం’, ‘నిధుల వ్యయం’ మధ్య తేడా నికర వడ్డీ పరిమాణం (ఇంట్రెస్ట్ మార్జిన్..- ఎన్‌ఐఎమ్). ఇదే బ్యాంకుకు సమకూరే లాభం. ఎన్‌ఐఎమ్ ఎప్పుడూ ధనాత్మకంగా, నిర్దిష్టంగా ఉంటుంది గనుక బ్యాంకులు సాధారణంగా లాభాలను ఆర్జిస్తాయి. 

లెండింగ్ బ్యాంక్ (రుణాలు ఇచ్చే బ్యాంక్) రుణగ్రహీత ఖాతాలను నిరంతరం గమనిస్తూ వుండవల్సిన అవసరం ఎంతైనా వున్నది. రుణగ్రాహి వడ్డీని క్రమబద్ధంగా చెల్లిస్తున్నాడా? అసలు వాయిదాలను నిబంధనల ప్రకారం గడువు తేదీలలోగా చెల్లిస్తున్నాడా? బ్యాలెన్స్ షీట్ (ఆస్తి అప్పుల పట్టీ), లాభనష్టాల ప్రకటనను తనిఖీ చేశారా? అవి, అప్పు తీసుకున్న వ్యక్తి నిజ ఆర్థిక స్థితిగతులను చూపుతున్నాయా లేదా అనే విషయాలను ఎప్పటికప్పుడు నిగ్గు తేల్చుకోవడం బ్యాంకుల బాధ్యత.

బ్యాంకులపై అనేక స్థాయిల్లో పర్యవేక్షణ వుంటుంది. బ్యాంకు ఫైనాన్స్ కమిటీ, బ్యాంకు డైరెక్టర్ల బోర్డు; బ్యాంకు అంతర్గత ఆడిటర్, ఎక్స్టర్నల్ ఆడిటర్, రిజర్వ్ బ్యాంక్ ఆమోదించిన చట్ట బద్ధ ఆడిటర్, బ్యాంకు వాటాదారుల వార్షిక సాధారణ సమావేశం, రిజర్వ్ బ్యాంకులోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ ఆండ్ డెవలప్‌మెంట్ (డిబిఓడి), ప్రతి చిన్న లావాదేవీని నిశితంగా పరీక్షించే ఆర్థిక విశ్లేషకుడు. వీటన్నిటికీ మించి లిస్టెడ్ కంపెనీ అయిన బ్యాంక్ లాభాలకు దోహదం చేసే లేదా నష్టాలకు కారణమయ్యే అదృశ్య మార్కెట్. ఇవే గాక ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ పైనాన్షియల్ సర్వీసెస్ (డిఎఫ్‌ఎస్) కూడా బ్యాంకులపై పర్యవేక్షణ చేస్తుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులతో సహా ప్రతి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుకు సంబంధించిన అన్ని లావాదేవీలను ఈ ప్రభుత్వ విభాగం నిరంతరం తప్పక గమనిస్తూ వుంటుంది. 

బ్యాంకులపై ఇన్ని విధాలుగా పర్యవేక్షణ వున్నప్పటికీ కొన్ని రుణాలు నిరర్ధక ఆస్తులుగా మిగిలిపోవడం కద్దు. రుణ గ్రహీతల వ్యాపారాలు దివాలా తీయడం మొదలైనవి అందుకు కారణం కావచ్చు. ఈ వ్యాపార వైఫల్యాలు అర్థం చేసుకోదగినవే. అయితే రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు, ఆదేశాల మేరకు ఒక రుణాన్ని ‘నాన్ -పెర్ఫార్మింగ్ అస్సెట్ (ఎన్పిఏ.. -నిరర్ధక ఆస్తి)గా వర్గీకరించడం జరుగుతుంది. ఏదైనా ఒక రుణాన్ని ఇలా వర్గీకరించడం జరిగితే, బ్యాంకుకు ఆ మేరకు నష్టమే. దీనివల్ల బ్యాంకు లాభాలు తగ్గిపోతాయి. స్థూల నిరర్ధక ఆస్తులు పెరగడమంటే బ్యాంకు ప్రతిష్ఠకు, అస్తిత్వానికి ప్రమాద ఘంటికలు మోగినట్లే. 

సరే, ఇక యెస్ బ్యాంక్ విషయానికొద్దాం. ప్రతి త్రైమాసికంలో ఈ బ్యాంకు తన లాభాలను ప్రకటిస్తుంది. అయితే వాస్తవాలు వేరుగా వున్నాయి. ఆ వాస్తవాలను పసిగట్టడంలో పైన పేర్కొన్న పర్యవేక్షణ వ్యవస్థలన్నీ విఫలమయ్యాయి. యెస్ బ్యాంక్ తన మొదటి నష్టాన్ని 2019 జనవరి-–మార్చి త్రైమాసికంలో ప్రకటించింది. అప్పుడు డిబిఒడి, డిఎఫ్ఎస్‌లలో ఎలాంటి ప్రమాద ఘంటికలు మోగనేలేదు! నిజానికి 2014 ఏప్రిల్ నుంచే యెస్ బ్యాంక్ విశృంఖలంగా రుణ వితరణ చేస్తోంది. ఆ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్‌లోని వివరాలను చూడండి: ప్రతి ఆర్థిక సంవత్సరాంతంలో ఆ బ్యాంకుకు వసూలు కావలసిన బకాయిల వివరాలు ఇలా వున్నాయి: 2014 మార్చి: రూ.44,633 కోట్లు; 2015 మార్చి: రూ.75,550 కోట్లు; 2016 మార్చి: రూ.98,210 కోట్లు; 2017 మార్చి: రూ.1,32,263; 2018 మార్చి: రూ.2,03,534; 2019 మార్చి: రూ.2,41,499. 2014 మార్చి నుంచి 2019 మార్చి వరకు రుణ వితరణ పురోగతి ఎలా వున్నదో గమనించారా? ఏడాదికి 35 శాతం మేరకు ఆ పెరుగుదల రేటు వున్నది! మరో ముఖ్యమైన విషయం మీ దృష్టికి వచ్చిందా? నోట్ల రద్దు జరిగిన తరువాత మొదటి రెండు సంవత్సరాలలో అంటే 2016-–17, 2017–-18 ఆర్థిక సంవత్సరాలలో యెస్ బ్యాంక్ రుణ వితరణ మధ్య వున్న తేడా గమనార్హం. 

అనివార్యంగా కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2014 మార్చి తరువాత కొత్త రుణాలు మంజూరు చేసేందుకు ఏ కమిటీ అనుమతిచ్చింది? ఆ రుణాల మంజూరుకు ఎవరు బాధ్యులు? యెస్ బ్యాంక్ విచ్చలవిడిగా రుణాలు మంజూరు చేస్తున్న విషయం రిజర్వ్ బ్యాంక్ లేదా ప్రభుత్వానికి తెలియదా? ప్రతి సంవత్సరాంతంలో బ్యాంక్ బ్యాలెన్స్ షీట్‌ను రిజర్వ్ బ్యాంక్ లేదా ప్రభుత్వంలో ఏ ఒక్కరూ పరిశీలించనే లేదా? రిజర్వ్ బ్యాంక్ 2019 జనవరిలో యెస్ బ్యాంక్ సిఇఓను మార్చేసి, కొత్త సిఇఓను నియమించిన తరువాత బ్యాంక్ వ్యవహారాలలో ఏమీ మార్పు లేక పోవడానికి కారణమేమిటి? రిజర్వ్ బ్యాంక్ మాజీ డిప్యూటీ గవర్నర్ ఒకరిని యెస్ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో నియమించిన తరువాత కూడా బ్యాంక్ కార్యకలాపాలాలలో ఎటువంటి మార్పు ఎందుకు చోటు చేసుకోలేదు? యెస్ బ్యాంక్ తన మొట్ట మొదటి త్రైమాసిక నష్టాన్ని 2019 జనవరి-–మార్చిలో ప్రకటించిన తరువాత కూడా ప్రమాద ఘంటికలు ఎందుకు మోగలేదు? 

ఈ ప్రశ్నలను తొలుత 2020 మార్చి 7న లేవనెత్తడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ అధికారులు గానీ, ప్రభుత్వంలోని మరే ఇతర బాధ్యతాయుత అధికారి గానీ ఆ ప్రశ్నలకు ఇంతవరకు సమాధానమివ్వలేదు. ఎందుకని? యెస్ బ్యాంక్ కథ ప్రజల దృష్టి నుంచి కనుమరుగైపోగలదని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా కన్పిస్తోంది. ఈ సంక్షోభాన్ని ప్రజలు అంత తొందరగా మరచిపోతారా? సామాజిక మాధ్యమాల పుణ్యమా అని  ప్రజలు దీన్ని అంత త్వరగా విస్మరించే అవకాశం లేదు. ప్రింట్, టీవీ మీడియాకు ఈ వార్తలు, విశ్లేషణలు నివేదించడం మినహా మరో గత్యంతరం లేదు. 

సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రంగంలోకి దిగారు. మంచిదే. వీరేదో సత్యావిష్కరణ చేస్తారని నేను భావించడం లేదు. జరిగిన అక్రమాలకు యెస్ బ్యాంక్, డిబిఓడి అధికారుల్లో జవాబుదారులు ఎవరో రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించక ముందే ఈ దర్యాప్తు సంస్థలు రంగంలోకి ప్రవేశించడమేమిటి? ‘దర్యాప్తు’ పూర్తయ్యేవరకు జవాబుదారులు ఎవరో నిర్ధారించక పోవచ్చునేమో? నా యీ భయాలకు సహేతుక కారణాలు వున్నాయి. అభిజ్ఞ వర్గాలు ఏవో వివరాలు వెల్లడిస్తున్నాయనుకోండి. అయితే, అవి మీడియా స్పేస్ నింపడానికి మాత్రమే ఉపయోగపడతాయి. యెస్ బ్యాంక్ నుంచి రుణాలు తీసుకున్నవారి (ముఖ్యంగా వందలు, వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్న బడా వ్యాపారుల) పేర్లను వెల్లడించి తీరాలని ప్రజలు, పార్లమెంటు డిమాండ్ చేయాలి. యెస్ బ్యాంక్ పై పర్యవేక్షణకు బాధ్యుల నుంచి సంజాయిషీని డిమాండ్ చేయాలి. యెస్ బ్యాంకులో అక్రమాలు కొంత మంది బాధ్యుల అజాగ్రత్త వల్లే గాక, అవి శిక్షార్హమైన ఉదాసీనత వల్లే జరిగాయని నేను భావిస్తున్నాను. 

యెస్ బ్యాంక్‌ను గట్టెక్కించడానికి రిజర్వ్ బ్యాంక్, ప్రభుత్వం పూనుకోవడం విచిత్రంగా వున్నది. ఈ నెల 12న ప్రకటించిన ఒక పథకం ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యెస్ బ్యాంక్‌లో రూ.7250 కోట్ల రూపాయలు మదుపు చేసి, 49 శాతం వాటాలను స్వాయత్తం చేసుకోనున్నది. యెస్ బ్యాంక్ నికర విలువ, బహుశా జీరో అని చెప్పవచ్చు. అటువంటి బ్యాంక్ షేర్లను ఒక్కోదానికి పది రూపాయలకు పైగా ధర కట్టి ప్రభుత్వ రంగ బ్యాంకు కొనుగోలు చేయడమేమిటి? ఆ షేర్లకు ఇప్పుడు ఏ పాటి విలువ వున్నది? ప్రజల సొమ్మును ఇలా వృథా చేయడం సబబేనా? అందరమూ ఆలోచించాలి. ఏమైనా యెస్ బ్యాంక్ కథ ఇంకా ముగియలేదు.


పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2020-03-14T07:02:58+05:30 IST