Abn logo
Sep 25 2021 @ 00:36AM

క్షణక్షణం ఉత్కంఠ

హిరమండలం : స్వతంత్ర ఎంపీటీసీ అభ్యర్థిని నిర్బంధించిన దృశ్యం

- స్వతంత్ర ఎంపీటీసీని నిర్బంధించిన ఎమ్మెల్యే వర్గం 

- హిరమండలంలో ఇరువర్గాల కొట్లాట

- టీడీపీ మద్దతుతో వైసిపీ రెబల్‌ అభ్యర్థి విజయం 

హిరమండలం, సెప్టెంబరు 24: హిరమండలం ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఎంపీపీ ఎన్నిక ఉత్కంఠగా సాగింది. బెదిరింపులు, ప్రలోభాలు, కొట్లాటల మధ్య ఎన్నిక నిర్వహించగా.. చివరకు ఎంపీపీ పదవిని వైసీపీ రెబల్‌ అభ్యర్థి తూలుగు మేనక (ధనుపురం ఎంపీటీసీ) దక్కించుకున్నారు. మేనక తనకు ఎంపీపీ పదవి ఇవ్వాలని కోరగా.. స్థానిక  ఎమ్మెల్యే రెడ్డి శాంతి సుముఖత చూపలేదు. అంబావల్లి ఎంపీటీసీ లుకలాపు సావిత్రమ్మకు ఎంపీపీ అభ్యర్థిగా బీ-ఫారం ఇచ్చారు. దీంతో రెబల్‌ అభ్యర్థిగా మేనక బరిలో దిగారు. ఆమె భర్త తిరుపతిరావు.. టీడీపీకి చెందిన ముగ్గురు అభ్యర్థుల మద్దతు కూడగట్టారు. ఏకగ్రీవంగా ఎన్నికైన మర్రిగూడ ఎంపీటీసీ సవర వైకుంఠరావు, పెద్దగూడ స్వతంత్ర అభ్యర్థి శ్రీదేవి మద్దతును ముందే పొందారు. శుక్రవారం వారిద్దరినీ అప్పగించాలని ఎమ్మెల్యే వర్గీయులు రెబల్‌ అభ్యర్థిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో శుక్రవారం ఉదయం వైకుంఠరావు, శ్రీదేవిలను పాతపట్నం పోలీసుస్టేషన్‌కు అప్పగించారు.  


- స్వతంత్ర ఎంపీటీసీ నిర్బంధం 

మధ్యాహ్నం ఒంటి గంటకు ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కాగా, ఎమ్మెల్యే వర్గీయులు ఐదుగురు మాత్రమే హాజరయ్యారు. రెబల్‌ అభ్యర్థి మేనకకు మద్దతుగా ఉన్న ఇద్దరు అభ్యర్థులు హాజరుకాలేదు. దీంతో మేనక టీడీపీకి చెందిన ముగ్గురు ఎంపీటీసీ సభ్యులతో కలిసి.. ఎంపీడీవో కార్యాలయం నుంచి వెనుదిరిగారు. రెండున్నర గంటల సమయంలో పాతపట్నం సీఐ రవిప్రసాద్‌, ఎస్‌ఐ మధుసూదనరావు తమ ఆధీనంలో ఉన్న ఇద్దరు ఎంపీటీసీలను తీసుకువచ్చి ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో విడిచి పెట్టారు. ఆ సమయంలో వారిద్దరినీ ఎమ్మెల్యే వర్గీయులు బలవంతంగా పంచాయితీ కార్యాలయంలోకి తీసుకువెళ్లారు. లుకలాపు సావిత్రమ్మకు మద్దతు ఇవ్వాలని ప్రలోభాల వల విసిరారు. చివరకు భయపెట్టి బంధించారు. దీంతో సావిత్రమ్మకే మద్దతు ఇస్తానని చెప్పి.. వైకుంఠరావు సమావేశ మందిరంలో ఎన్నికకు హాజరయ్యారు. స్వతంత్ర ఎంపీటీసీ శ్రీదేవి మాత్రం సావిత్రమ్మకు మద్దతు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. దీంతో ఆమెపై దౌర్జన్యం చేశారు. భర్త, చిన్నబిడ్డతో సహా పంచాయతీ కార్యాలయంలో ఆమెను నిర్బంధించారు. ఆమెను విడిపించాలని మేనక భర్త తిరుపతిరావు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అది తమ పరిధిలో లేదని పోలీసులు చెప్పడంతో తిరుపతిరావు వర్గీయులు వాగ్వాదానికి దిగారు. ఎంపీపీ ఎన్నికకు సమయం మించిపోతుండడంతో తిరుపతిరావు పంచాయితీ కార్యాలయం వద్దకు వచ్చి తలుపులు తీసేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య కొట్లాకు దారి తీసింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సీఐ రవిప్రసాద్‌ ఆఽధ్వర్యంలో పోలీసులు అందరినీ చెదరగొట్టారు. ఎంపీటీసీ శ్రీదేవిని బయటకు విడిచిపెట్టారు. 


- ఎంపీపీగా రెబల్‌ అభ్యర్ధి తూలుగు మేనక

మొత్తం 11 మంది ఎంపీటీసీ సభ్యులు ఎన్నికకు హాజరయ్యారు. ఎమ్మెల్యే వర్గానికి చెందిన సావిత్రమ్మకు నలుగురు సభ్యులు మద్దతు తెలిపారు. రెబల్‌ అభ్యర్థి మేనకకు ముగ్గురు టీడీపీ అభ్యర్ధులతో పాటు ఒక వైసీపీ అభ్యర్థి, ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతు తెలిపారు. మొత్తం 5 ఓట్లతో మేనక ఎంపీపీగా ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి కిషోర్‌ ప్రకటించారు. వైస్‌ ఎంపీపీగా మర్రిగూడ ఎంపీటీసీ వైకుంఠరావును ఎన్నుకున్నారు. కోఆప్షన్‌  సభ్యులుగా విష్ణుప్రసాద్‌ పండాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో పి.వెంకటరాజు, తహసీల్దార్‌ సత్యనారాయణ పాల్గొన్నారు. 


మెళియాపుట్టిలో విప్‌ను ధిక్కరించి..

మెళియాపుట్టి : మెళియాపుట్టిలో నాటకీయ పరిణామాల మధ్య ఎంపీపీ ఎన్నిక జరిగింది. ఎంపీపీ అభ్యర్థి పేరు ప్రకటించకుండా.. స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతి సీల్డ్‌కవర్‌ రాజకీయం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సీల్డ్‌కవర్‌లో పేర్లను బయటపెట్టారు. రట్టిణి ఎంపీటీసీ సభ్యురాలు పి.ధనలక్ష్మి ఎంపీపీగా, పెద్దలక్ష్మీపురం ఎంపీటీసీ సభ్యురాలు ఈశ్వరమ్మను  వైఎస్‌ ఎంపీపీగా ప్రకటించారు. దీంతో ఓటింగ్‌ కావాలని పరశురాంపురం ఎంపీటీసీ సభ్యుడు ఎస్‌.అధినాయుడు కోరారు. పార్టీకోసం శ్రమిస్తున్న బైపోతు ఉదయ్‌ భార్య ఈశ్వరమ్మకు ఎంపీపీ పదవి కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఓటింగ్‌ నిర్వహించనున్నట్టు అధికారులు ప్రకటించారు. ఓటింగ్‌ వద్దని, విప్‌ను ధిక్కరించి అన్యాయం చేస్తున్నారని పాడి ధనలక్ష్మి, అప్పారావుల వర్గం ఆందోళనకు దిగింది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కొద్దిసేపటి తర్వాత అధికారులు ఓటింగ్‌ నిర్వహించారు. మండలంలో 15 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా, ధనలక్ష్మికి ముగ్గురు మాత్రమే మద్దతు ఇచ్చారు. ఈశ్వరమ్మకు తొమ్మిది మంది సభ్యులు మద్దతు తెలిపారు. టీడీపీకి చెందిన ఇద్దరు సభ్యులు సైతం ఈశ్వరమ్మ వైపు నిలిచారు. కొసమాల ఎంపీటీసీ సలాన జనార్దనరావు మాత్రం ఓటు వేయలేదు. తనకు వైస్‌ ఎంపీపీగా అవకాశం ఇవ్వాలని పట్టుబట్టారు. ఒకానొక దశలో రాజీనామాకు సిద్ధమై.. మళ్లీ వెనక్కి తగ్గారు మొత్తంగా మెజార్టీ సభ్యులు ఈశ్వరమ్మకు మద్దతు తెలపడంతో ఆమెనే ఎంపీపీగా అధికారులు ప్రకటించారు. వైస్‌ ఎంపీపీగా ఎస్‌.అధినాయుడును ఎన్నుకున్నారని ప్రత్యేకాధికారి భవానీ శంకర్‌ తెలిపారు.