రిజిస్ట్రేషన్‌ శాఖలో కలకలం!

ABN , First Publish Date - 2021-08-20T05:06:15+05:30 IST

రిజిస్ట్రేషన్‌ శాఖలో కలకలం రేగుతోంది. కడపలోని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో నకిలీ చలానాల ఉదంతం బయటపడింది. దీంతో ఇతర జిల్లాల్లోనూ అక్రమాల నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రిజిస్ట్రేషన్‌ చేసిన డాక్యుమెంట్‌లు, చలానాలను పునః పరిశీలించేందుకు యంత్రాంగం చర్యలు చేపడుతోంది. జిల్లా రిజిస్ట్రేషన్‌ శాఖ కార్యాలయం పరిధిలో 15 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. ఇక్కడ కూడా నకిలీ చలానాలు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేశారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది జూలై వరకు చేసిన రిజిస్ట్రేషన్లను అధికారులు ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు.

రిజిస్ట్రేషన్‌ శాఖలో కలకలం!
జిల్లా రిజిస్ట్రేషన్‌ కార్యాలయం

- నకిలీ చలానాలపై దర్యాప్తు

- ఆడిట్‌ సబ్‌రిజిస్ట్రార్‌ ఆధ్వర్యంలో తనిఖీలు 

- సుమారు 70వేల చలానాలు, డాక్యుమెంట్‌ల పరిశీలన

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

రిజిస్ట్రేషన్‌ శాఖలో కలకలం రేగుతోంది. కడపలోని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో నకిలీ చలానాల ఉదంతం బయటపడింది. దీంతో ఇతర జిల్లాల్లోనూ అక్రమాల నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రిజిస్ట్రేషన్‌ చేసిన డాక్యుమెంట్‌లు, చలానాలను పునః పరిశీలించేందుకు యంత్రాంగం చర్యలు చేపడుతోంది. జిల్లా రిజిస్ట్రేషన్‌ శాఖ కార్యాలయం పరిధిలో 15 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. ఇక్కడ కూడా నకిలీ చలానాలు సృష్టించి  రిజిస్ట్రేషన్లు చేశారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఈ నేపథ్యంలో గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది జూలై వరకు చేసిన రిజిస్ట్రేషన్లను అధికారులు ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. క్రయవిక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్న వ్యక్తి ప్రభుత్వానికి చలానా రూపంలో డబ్బులను చెల్లించాలి. స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు, యూజర్‌ ఛార్జీస్‌ చలానా చెల్లించాలి. ముందుగా డాక్యుమెంట్‌ రైటర్‌ ద్వారా   సంబంధిత ధ్రువపత్రాలను సబ్‌రిజిస్ర్టార్‌కు అందజేస్తారు. వాటిని పరిశీలించిన తర్వాత.. డాక్యుమెంట్లు సక్రమంగా ఉంటేనే రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇస్తారు. ఈ క్రమంలో ఎవరైనా నకిలీ చలానాలు సమర్పించారా? అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. 


 చురుగ్గా.. పరిశీలన

జిల్లాలోని 15 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 16 నెలల వ్యవధిలో  70వేలకుపైగా రిజిస్ట్రేషన్లు అయ్యాయి. వీటికి సంబంధించిన డాక్యుమెంట్‌లను, చలానాలను శ్రీకాకుళంలోని జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయానికి తెప్పించారు. రోజుకి సుమారు 300 డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. ఇలా పరిశీలన కోసం ఆడిట్‌ సబ్‌రిజిస్ట్రార్‌ను నియమించారు. ఆయన ఆధ్వర్యంలో ఆరుగురు సీనియర్‌ అసిస్టెంట్‌లు, ఆరుగురు జూనియర్‌ అసిస్టెంట్‌లు పరిశీలిస్తున్నారు. గురువారం నాటికి నాలుగు నెలలకు సంబంధించి రిజిస్ర్టేషన్లను పరిశీలించారు. మిగిలినవి కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తే.. వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. 

  

త్వరలో వివరాలు వెల్లడిస్తాం 

నకిలీ చలానాల ఉదంతం నేపథ్యంలో జిల్లాలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు, చలానాలపై తనిఖీలు చేపడుతున్నాం. ఆడిట్‌ సబ్‌రిజిస్ట్రార్‌ ఆధ్వర్యంలో సిబ్బందితో జిల్లా కార్యాలయంలోనే డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నాం.  మొత్తం తనిఖీలు పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడిస్తాం.

- ఆర్‌.సత్యనారాయణ, జిల్లా రిజిస్ట్రార్‌

Updated Date - 2021-08-20T05:06:15+05:30 IST