ఎక్సైజ్‌ పాలసీపై ఉత్కంఠ

ABN , First Publish Date - 2021-10-22T06:02:14+05:30 IST

ఎక్సైజ్‌ పాలసీపై ఉత్కంఠ

ఎక్సైజ్‌ పాలసీపై ఉత్కంఠ

 - జిల్లాలో 41 మద్యం దుకాణాలు 

- నెలకు సరాసరి రూ.30 నుంచి రూ.35 కోట్ల  వ్యాపారం

- రిజర్వేషన్లతో మారనున్న మద్యం వ్యాపారుల సమీకరణలు 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ఎక్సైజ్‌ పాలసీపై వ్యాపారుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే మద్యం టెండర్లలో రిజర్వేషన్ల అమలు ముందుకు వచ్చింది. దీనికి అనుగుణంగా దుకాణాలను కేటాయించనున్నారు. ఇందుకోసం ఎక్సైజ్‌ శాఖ కసరత్తు చేస్తోంది. మరోవైపు వ్యాపారుల్లో మాత్రం ఏ దుకాణం ఎలా రిజర్వేషన్‌ కాబోతుందోననే చర్చ మొదలైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 41 మద్యం దుకాణాలు ఉన్నాయి. వచ్చే నెలతో లీజు గడువు ముగిసిపోనుంది. కొత్త మద్యం పాలసీ ప్రకటించి దానికి అనుగుణంగా టెండర్ల ప్రక్రియను చేపట్టనుంది.   ప్రభుత్వ విధి విధానాలు ఎలా ఉన్నా దుకాణాలు దక్కించుకోవడానికి మద్యం వ్యాపారులు సిద్ధమవుతున్నారు. 

టెండర్లలో రిజర్వేషన్లు  

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 41 దుకాణాల టెండర్‌ గడువు నవంబరు 30తో ముగియనుంది. దీనికి అనుగుణంగానే రిజర్వేషన్ల ప్రకారం దుకాణాలను కేటాయించనున్నారు. కొత్త మద్యం పాలసీ రానున్న నేపథ్యంలో టెండర్లలో ఎస్సీలకు పది శాతం, ఎస్టీలకు 5 శాతం, గౌడ కులస్థులకు పది శాతం రిజర్వేషన్‌ను కల్పించనున్నారు. రిజర్వేషన్లలో జిల్లాల వారీగా కేటాయింపులు లేదా జోన్ల వారీగా, లేదా రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుంటారా? అనే దానిపై వ్యాపారుల్లో అయోమయం నెలకొంది. తొలిసారిగా మద్యం టెండర్లలో రిజర్వేషన్లు అమలు చేస్తుండడంతో ఎస్సీ, ఎస్టీ, గౌడ సామాజిక వర్గాల్లోని ఔత్సాహికులు టెండర్లలో పాల్గొనడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. 

దరఖాస్తు ఫీజుతోనే జిల్లాలో 12.96 కోట్ల ఆదాయం 

జిల్లాలో మద్యం అమ్మకాల ద్వారా భారీ ఆదాయం ఎక్సైజ్‌ శాఖకు లభిస్తోంది. 2019 అక్టోబరులో నిర్వహించిన టెండర్‌ ప్రక్రియలో డిపాజిట్‌ రూ.2 లక్షలు చెల్లించారు. జిల్లాలో 41 దుకాణాలకు 648 దరఖాస్తులు వచ్చాయి. దీని ద్వారా ఎక్సైజ్‌ శాఖకు రూ.12.96 కోట్ల ఆదాయం లభించింది. ఈ సారి డిపాజిట్‌ ఫీజు పెంచుతారా? లేదా పాత పద్ధతినే కొనసాగిస్తారా? అనే సందిగ్ధం వ్యాపారుల్లో  నెలకొంది. జిల్లాలో మద్యం అమ్మకాల ద్వారా భారీ ఆదాయం వస్తుండగా దాదాపు ప్రతి నెలా రూ.35 కోట్ల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. వ్యాపారులకు గిట్టుబాటు అవుతుండడంతో మరింత పోటీ పెరిగే అవకాశం ఉంది. 

Updated Date - 2021-10-22T06:02:14+05:30 IST