Abn logo
Sep 25 2021 @ 22:01PM

ఓదార్చమని పంపిస్తే.. మృతురాలి ఇంట్లో.. California పోలీసు అధికారి నిర్వాకం ఇదీ!

సాంటా ఆనా(కాలిఫోర్నియా): మృతురాలి కుటుంబసభ్యులను ఓదార్చేందుకు వెళ్లిన ఓ పోలీసు అధికారి ఆమె క్రెడిట్ కార్డులను దొంగతనం చేసిన ఘటన కాలిఫోర్నియాలోని ఆరెంజ్ కౌంటీలో తాజాగా వెలుగు చూసింది. నిందితుడు స్టీవ్ హోర్ట్స్‌పై ఈ అభియోగాలు మోపుతున్నట్టు అక్కడి డిస్ట్రిక్ట్ అటార్నీ తెలిపారు. గతేడాది ఆగస్టులో.. స్టీవ్ హోర్ట్స్ కౌంటీ డిప్యుటీ షెరిఫ్‌గా ఉన్న సమయంలో ఈ దొంగతనానికి పాల్పడినట్టు వెలుగులోకి వచ్చింది. కాగా..అంతకుమునుపే అతడిపై మరో దొంగతనానికి సంబంధించి ఓ ఫిర్యాదు నమోదైంది. 

జులైలో ఓ వ్యక్తి మృతి చెందడటంతో దర్యాప్తుకు వెళ్లిన సదరు అధికారి అతడి ఇంట్లో కూడా చోరీకి పాల్పడినట్టు తేలింది. అతడు దొంగతనం చేస్తున్న దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో అతడు సెప్టెంబర్ నెలలో రాజీనామా చేశాడు. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. అతడి నేరం ఇంకా రుజువు కాలేదు. ఈ క్రమంలో అతడు అదే ఏడాది ఆగస్టులోనూ ఓ మృతురాలికి చెందిన క్రెడిట్ కార్డులు దొంగతనం చేసినట్టు తాజాగా బయటపడింది. కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో అతడు ఈ చోరి చేసినట్టు తేలింది. దీంతో..డిస్ట్రిక్ట్ అటోర్నీ మరోసారి స్టీవ్ హోర్ట్స్‌పై దొంగతనం అభియోగాన్ని నమోదు చేశారు.