దళితబంధుకు కసరత్తు

ABN , First Publish Date - 2022-01-26T05:38:19+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని హుజూరాబాద్‌ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని నాలుగు ఎస్‌సీ రిజర్వుడ్‌ నియోజకవర్గాల్లో అమలుచేసేందుకు నిర్ణయించింది.

దళితబంధుకు కసరత్తు


జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద నిజాంసాగర్‌ మండలం ఎంపిక
మొదటి విడతలో రూ.50 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
లబ్ధిదారుల ఎంపికకు కొనసాగుతున్న అధికారుల సర్వే
నిజాంసాగర్‌లో 28 గ్రామాల్లో 1600లకు పైగా కుటుంబాలు
ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు
 ప్రతీ నియోజకవర్గానికి 100 యూనిట్ల మంజూరు
 జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ఎస్సీ కుటుంబాల వివరాల సేకరణ

కామారెడ్డి,జనవరి 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని హుజూరాబాద్‌ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని నాలుగు ఎస్‌సీ రిజర్వుడ్‌ నియోజకవర్గాల్లో అమలుచేసేందుకు నిర్ణయించింది. నాలుగు నెలల కిందటే కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్‌ మండలంలో దళితబంధును అమలుచేసేందుకు పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా నెలరోజుల కిందట మొదటి విడతలో ప్రభుత్వం ఈ పథకం కింద జిల్లాకు రూ. 50 కోట్ల నిధులను సైతం మంజూరు చేసింది. అయితే నిజాంసాగర్‌ మండలానికే కాకుండా అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ పథకాన్ని అమలుచేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతీ నియోజకవర్గంలో మొదటి విడత కింద 100 యూనిట్లను మంజూరు చేయగా లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ చేపడుతున్నారు. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపికపై సర్వే నిర్వహించి దళితకుటుంబాల వివరాలను సేకరించారు.
నియోజకవర్గానికి వంద మందిచొప్పున
జిల్లాలో కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్‌ నియోజకవర్గాల్లోనూ దళితబంధును అమలుచేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రతీ నియోజకవర్గంలో వంద యూనిట్లు మంజూరు చేయనున్నారు. అయితే కుటుంబసమగ్ర సర్వే లెక్కల ప్రకారం కామారెడ్డి నియోజకవర్గంలో మొత్తం జనాభా 3,01,483 ఉండగా ఇందులో 42,913 ఎస్‌సీ కుటుంబాలు ఉన్నాయి. బాన్సువాడలో 1,19,123 జనాభా ఉండగా ఇందులో 15,129 ఎస్సీ కుటుంబాలు, ఎల్లారెడ్డిలో 2,92,101 జనాభా ఉండగా ఇందులో 47,722 ఎస్సీ కుటుంబాలు, జుక్కల్‌ నియోజకవర్గంలో 2,59,918 జనాభా ఉండగా ఇందులో 47,538 ఎస్‌సీ కుటుంబాలు ఉన్నట్లు అధికారుల రికార్డులు చెబుతున్నాయి. నియోజకవర్గానికి 100 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసే విధంగా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఆయా చోట్ల మండలాల వారిగా ఎస్సీ జనాభా కుటుంబాల సంఖ్య తదితర సమాచారాన్ని సమగ్ర కుటుంబసర్వే నుంచి సేకరించారు.
నిజాంసాగర్‌లో 28 గ్రామాలు.. 1600లకు పైగా కుటుంబాలు
జిల్లాలో ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గమైన జుక్కల్‌లో దళితబంధు పథకాన్ని అమలుచేయడానికి సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకుని మొదటగా నిజాంసాగర్‌ మండలంలో పథకాన్ని చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. నిజాంసాగర్‌ మండలంలో 28 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇటీవల గ్రామాల వారీగా దళిత బంధుకు ఎస్సీ కుటుంబాలను గుర్తించేందుకు ఇంటింటి సర్వేను చేపట్టారు. ఈ సర్వేలో మొత్తం 1648 దళిత కుటుంబాలు, 5600 జనాభా ఉన్నట్లు తేలిందని సంబంధితశాఖ అధికారులు పేర్కొంటున్నారు. మాదిగ(హిందూ) కుటుంబాలు 579 ఉండగా, మాల(హిందూ) 565 కుటుంబాలు, మాదిగ  మస్టి 247, మాదిగ మస్టి(ఇస్లాం) 1, దండసీ 4, హోలీయా దాసరి 1, మాదిరికురువా 5, మాల హనాయి(హిందూ) 68, మాల హనాయి(క్రిస్టియన్‌) 1, మాల జంగం 2, మాల మస్టి 1, మాదిగ (క్రిస్టియన్‌) 3, బెడబుడగ జంగం 27, ఎస్సీ అదర్స్‌(హిందూ) 106, గోసంగి 2, బుడగజంగాలు 16 కుటుంబాలతో పాటు మోచి, బ్యాగరా, మాదిగ దాసు తదితర కుటుంబాలు ఉన్నట్లు గుర్తించారు.
రూ.50 కోట్లు మంజూరు
నిజాంసాగర్‌ మండలంలోని 28 గ్రామాల్లో సుమారు 1600లకు పైగా దళిత కుటుంబాలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలతో వివిధ వృత్తులు, వ్యాపారాలు, పరిశ్రమలు ఏర్పాటుచేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న 1648 కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున అందిస్తే మొత్తం రూ. 180 కోట్లు అవసరం కానున్నాయి. ఇందులో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గత నెల కిందట రూ.50 కోట్ల నిధులను మొదటి విడత కింద మంజూరు చేసింది. అయితే ఆ సమయంలో హుజూరాబాద్‌ ఉప ఎన్నికల కోడ్‌ కారణంగా కోర్టు ఆదేశాలమేరకుపంపిణీ చేయలేదు. జుక్కల్‌ నియోజకవర్గంలో జుక్కల్‌, బిచ్కుంద, మద్నూర్‌, పిట్లం, పెద్దకొడప్‌గల్‌ మండలాల్లో దళిత సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ ఐదు మండలాల్లో 10 వేలకు పైగా దళిత కుటుంబాలు ఉంటాయని అంచనా.
30 రకాల యూనిట్లు
రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్న దళితబంధు పథకం కింద లబ్ధిదారుడు కుటుంబానికి ఇచ్చే రూ.10 లక్షలతో పరిశ్రమలు, వ్యాపారాలు, వివిధ వృత్తులను ఏర్పాటుచేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఇప్పటికే 30 రకాల వ్యాపారాలు, వృత్తులకు సంబంధించి జాబితాను ప్రభుత్వం రూపోందించింది. ఇందులో మినీ డెయిరీ, పందిరి కూరగాయల సాగు, వరినాటు యంత్రాలు, వేప నూనె, పిండి తయారీ, ఆటో ట్రాలీ, వ్యవసాయసాగు కోసం యంత్ర పరికరాల అమ్మకం, మట్టి ఇటుకల తయారీ, ట్రాక్టర్‌ ట్రాలీ, కోడి పిల్లల పెంపకం, 7 సీటర్‌ ఆటో, విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందుల దుకాణం, పెంట్‌ హౌస్‌, డెకరేషన్‌, లైటింగ్‌, సౌండ్‌సిస్టం, మడిగెల నిర్మాణం, వ్యాపారం, ఆయిల్‌మిల్‌, పిండి గిర్ని, ఎలకా్ట్రనిక్‌ పరికరాల అమ్మకం, డయాగ్నోస్టిక్‌ ల్యాబ్‌, మెడికల్‌ షాపు, హార్డ్‌వేర్‌, శానిటరీ దుకాణం, సిమెంట్‌, ఇటుకలు, రింగుల తయారీ తదితర అంశాలను పొందుపరిచింది.

Updated Date - 2022-01-26T05:38:19+05:30 IST