జిల్లాలో దళితబంధుకు కసరత్తు

ABN , First Publish Date - 2022-01-25T06:12:34+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకాన్ని జిల్లా వ్యాప్తంగా అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో వంద మందిని ఎంపిక చేసి పథకాన్ని అమలు చేయనున్నారు.

జిల్లాలో దళితబంధుకు కసరత్తు

ప్రతీ నియోజకవర్గంలో 100 మంది ఎంపిక

అర్హులను గుర్తించేది ఎమ్మెల్యేలు, కలెక్టర్లు

ఆర్థిక సంవత్సరం ముగింపులోపే పథకం అమలు

జిల్లాలో 550 మంది అర్హుల ఎంపిక

నిజామాబాద్‌, జనవరి 24(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకాన్ని జిల్లా వ్యాప్తంగా అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో వంద మందిని ఎంపిక చేసి పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే లబ్ధిదారులకు యూనిట్లను మంజూరు చేయనున్నా రు. వారికి శిక్షణ ఇవ్వనుండడంతో పాటు యూని ట్లను నెలకొల్పేవిధంగా ఏర్పాట్లను చేస్తున్నారు. నియో జకవర్గాల వారీగా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో అర్హులను ఎంపిక చేసి పథకాన్ని అమలు చేయనున్నారు.     ప్రయోగాత్మకంగా వంద మంది ఎంపిక..

ప్రయోగాత్మకంగా నియోజకవర్గానికి వందమంది అర్హులను ఎంపిక చేయనున్నారు. ఒక్కో లబ్ధిదారుడికి రూ.10లక్షలను మంజూరు చేస్తారు. ఈ నిధుల ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారునికి యూనిట్‌ను మంజూరు చేస్తారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు యూనిట్‌లు నెలకొల్పేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.  5వ తేదీలోపు ఎంపిక పూర్తి..

జిల్లాలో మొత్తం ఐదున్నర నియోజకవర్గాలు ఉన్నాయి. నిజామాబాద్‌అర్బన్‌, నిజామాబాద్‌రూరల్‌, బోధన్‌, ఆర్మూర్‌, బాల్కొండ నియోజకవర్గాలతో పాటు బాన్సువాడ నియోజకవర్గం పరిధిలో వీటిని అమలు చేయనున్నారు. ఐదున్నర నియోజకవర్గాల పరిధిలో మొత్తం 550 మందిని ఎంపిక చేస్తారు. వచ్చే నెల 5వ తేదీలోపు ఎంపిక ప్రక్రియను పూర్తిచేస్తారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పరిశీలించిన తర్వాత ఆమోదం తెలుపుతారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఈ దళితబంధు పథకాన్ని అమలు చేయనున్నారు. జిల్లాకు ఈ పథకం కోసం రూ.55 కోట్లను ఖర్చు చేయనున్నారు. పరిశ్రమలశాఖ, డెయిరీ, ఇతర శాఖలతో అనుసంధానం చేసి యూనిట్లకు మంజూరు చేస్తారు. లబ్ధిదారుల ఆసక్తి ప్రకారం యూనిట్లను నెలకొల్పుతారు. వాహనాలు కొనుగోలుచేసే వాటికి అనుమతి ఇస్తారు. పౌల్ర్టీ, డైయిరీ, ఫిషరిస్‌, చిన్న కుటీర పరిశ్రమలు, దుకాణాలు, ఇతర షాప్‌లను నెలకొల్పేందుకు అవకాశం ఇస్తారు. లబ్ధిదారులు ఇద్దరు ముగ్గురు కలిసి ఒక యూనిట్‌ను నెలకొల్పుకునేందుకు కూడా ఈ దళితబంధులో అవకాశం కల్పిస్తారు. 

ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 30లోపు పథకం అమలును మొత్తం పూర్తిచేసేవిధంగా ఏర్పాట్లను చేస్తున్నారు. దళితబంధు కింద ఎంపిక చేసేందుకు ఇప్పటికే మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ నారాయణరెడ్డి రెండు దఫాలు సమీక్షించారు. అన్ని నియోజకవర్గాల్లో అర్హులైన వారిని గుర్తించి ఈ పథకం అమలు చేసేవిధంగా ఏర్పాట్లను చేస్తున్నారు. జిల్లాలో దళితబంధు అమలుకోసం చర్యలు చేపట్టామని ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ రమేష్‌ తెలిపారు. జిల్లా మొత్తం 55 కోట్ల రూపాయలను ఈ దళితబంధుకు ఖర్చు చేస్తామని తెలిపారు. గైడ్‌లైన్స్‌ రాగానే ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. ఎంపికైన వారికి యూనిట్లను నెలకొల్పుతామని తెలిపారు.

Updated Date - 2022-01-25T06:12:34+05:30 IST