కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల పంపిణీకి కసరత్తు

ABN , First Publish Date - 2021-11-26T06:51:53+05:30 IST

కరోనా నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పాడి రైతులకు తోడ్పాటునందించేందుకు కేంద్ర ప్రభుత్వం కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను అందజేయాలని నిర్ణయించింది. ఈ కార్డులతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పాడి రైతులకు ఆర్థిక సహకారం అందనుంది.

కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల పంపిణీకి కసరత్తు

ఉమ్మడి జిల్లాలో 1.34 లక్షల మంది పాడి రైతులకు రుణ సదుపాయం 

నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ 



భువనగిరి రూరల్‌, నవంబరు 25: కరోనా నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పాడి రైతులకు తోడ్పాటునందించేందుకు కేంద్ర ప్రభుత్వం కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను అందజేయాలని నిర్ణయించింది.  ఈ  కార్డులతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పాడి రైతులకు ఆర్థిక సహకారం అందనుంది. దీనికి సంబంధించిన విఽధివిధానాలను కేంద్ర పశుసంవర్ధక మంత్రిత్వశాఖ నుంచి జిల్లా అధికార యంత్రాంగానికి ఉత్తర్వులు అందాయి. ఇందుకు అవసరమైన ప్రణాళికను పూర్తి చేసేందుకు అధికారులు నిమగ్నమయ్యారు. పాడి ఉత్పత్తులను ప్రోత్సహించే లక్ష్యంతో తక్కు వ వడ్డీకి బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వనున్నారు.  ఈ మేరకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లోని వివిధ బ్యాంకుల ప్రతినిధులు సభ్యులుగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ ప్రతి శుక్రవారం జిల్లాస్థాయి కిసాన్‌ క్రెడిట్‌ కార్డు క్యాంపును ఏర్పాటుచేసి రైతుల నుంచి వచ్చే ఏడాది జనవరి నెల చివరి నాటికి దరఖాస్తులు స్వీకరించి, తదుపరి ఫిబ్రవరి నెలలోపు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను అందించనున్నారు.


ఉమ్మడి జిల్లాల్లో పాడి రైతుల వివరాలిలా..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1,34,850 మంది పాడి రైతులు ఉన్నారు. జిల్లాల వారీగా నల్లగొండలో 58,250 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 31,589 మంది, సూర్యాపేట జిల్లాలో 45,011 మంది పాడి రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు అందజేసేందుకు ఆయా జిల్లాల్లోని పశుసంవర్థక శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.


కనిష్ఠంగా రూ.లక్షా 60వేలు.. గరిష్ఠంగా రూ.3లక్షలు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు ఉన్న రైతులకు రూ.లక్షా 60వేల నుంచి రూ.3లక్షల వరకు కరోనా రుణసదుపాయం కల్పించనున్నారు. రైతులకు కేవైసీ ద్వారా అందించే రుణాలను బ్యాంక్‌ లింకేజీ ద్వారా ఇవ్వనున్నారు. రైతుకు ఉన్న పాడిపశువుల లెక్క ప్రకారం ఒక్కో దానికి రూ.20నుంచి రూ.25వేల వరకు రుణం మంజూరుచేస్తారు. కనిష్ఠంగా ఎలాంటి ఆస్తి తాకట్టు లేకుండా రూ.లక్షా60వేల వరకు రుణం ఇస్తారు. అయితే అంతకుముందు ఆ రైతు బకాయి ఉన్న పంట రుణం మొత్తాన్ని మినహాయించి మిగిలిన మొత్తాన్ని రుణంగా ఇస్తారు. డెయిరీ ఫార్మర్‌, పాడి రైతు సహకార సంఘాలు, బ్యాంకర్లు కలిసి పాడి రైతుల రుణాలను అందించేందుకు లబ్ధిదారులను గుర్తించాల్సి ఉంది. అయితే జిల్లాలోని మరికొన్ని డెయిరీల సంస్థలే కాకుండా ఇళ్లు, హోటళ్లలో పాలుపోసేపోసే రైతులకు కూడా క్రెడిట్‌ కార్డు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎలాంటి పూచీకత్తు లేకుండానే రూ.లక్షా60వేల రుణాలను అందజేస్తారు. రూ.3లక్షల రుణాన్ని అందజేసేందుకు రైతులు బ్యాంకు గ్యారంటీకి సంబంధించిన పూచీకత్తు ఇవ్వాల్సి ఉంటుంది.


పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి :  డాక్టర్‌ వి కృష్ణ, పశుసంవర్థక శాఖ జిల్లా అధికారి, యాదాద్రి 

జిల్లాలోని పాడి రైతులు ఆధార్‌ కార్డు, ఓటరు గుర్తిం పు కార్డు, పాడి పశువుల సంఖ్య, వ్యవసాయ భూమి వివరాలను వెల్లడిస్తూ దరఖాస్తు చేసుకోవాలి. అర్హులైన రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు అందజేస్తాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పాడి రైతులు ఆర్థికంగా ఎదగాలి.  


Updated Date - 2021-11-26T06:51:53+05:30 IST