ఉపాధ్యాయుల పదోన్నతులకు కసరత్తు

ABN , First Publish Date - 2022-05-18T06:25:22+05:30 IST

విద్యాశాఖలో సుదీర్ఘకాలం తరువాత పదోన్నతులకు కసరత్తు మొదలైంది. జూన్‌లో పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయడానికి సన్నద్ధం అయ్యారు. పదోన్నతులకు సంబంధించి కోర్టు పరంగా ఉన్న అడ్డంకులు తొలగిపోవడంతో దాదాపు ఏడేళ్లుగా నీరిక్షిస్తున్న ఉపాధ్యాయుల్లో ఆశలు చిగురించాయి.

ఉపాధ్యాయుల పదోన్నతులకు కసరత్తు

 - ఏడేళ్లుగా నిరీక్షణ 

- జిల్లాలో 150 నుంచి 200 మందికి అవకాశం

- 300 పోస్టులు ఖాళీ

-  ఎంఈవో, ప్రధానోపాధ్యాయుల ఖాళీల సమస్యకు పరిష్కారం 

- నేడు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ధర్నా 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

విద్యాశాఖలో సుదీర్ఘకాలం తరువాత పదోన్నతులకు కసరత్తు మొదలైంది. జూన్‌లో పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయడానికి సన్నద్ధం అయ్యారు. పదోన్నతులకు సంబంధించి కోర్టు పరంగా ఉన్న అడ్డంకులు తొలగిపోవడంతో దాదాపు ఏడేళ్లుగా నీరిక్షిస్తున్న ఉపాధ్యాయుల్లో ఆశలు చిగురించాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటికే ప్రాథమిక అంచనాలు పూర్తి చేశారు.  జిల్లాలో 529 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 2341 ఉపాధ్యాయ పోస్టులు ఉండగా ప్రస్తుతం 2041 మంది పని చేస్తున్నారు. 300 ఖాళీలు ఉన్నాయి. ఇందులో కేటగిరీల వారీగా పదోన్నతులు పొందనున్నారు. దాదాపు 150 నుంచి 200 మంది వరకు పదోన్నతులు పొందనున్నారు. మరోవైపు ఇప్పటికే ఖాళీగా ఉన్న పీజీహెచ్‌ఎంలు, ఎంఈవోల ఖాళీల సమస్య కూడా తగ్గనుంది. జిల్లాలో ప్రస్తుతం 13 మండలాల్లో ఇన్‌చార్జి ఎంఈవోలుగానే సీనియర్‌ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.  పదోన్నతులతో మరికొన్ని కొత్త పోస్టులు పెరగనున్నాయి. ప్రమోషన్ల ప్రక్రియ ఎలా ఉంటుదనే దానిపై ఉపాధ్యాయ వర్గాలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కొన్ని సంఘాలు ఇప్ప  పదోన్నతుల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని కోరుతున్నారు. మరోవైపు పదోన్నతులు వచ్చే అవకాశం ఉన్న ఉపాధ్యాయులు ఇప్పటి నుంచే ఎక్కడ పోస్టింగ్‌ వస్తుందోననే అంశంపై చర్చించుకుంటున్నారు. 

నేడు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ధర్నా 

ఉపాధ్యాయుల బదిలీలు, పదన్నోతల షెడ్యూల్‌ విడుదలలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విద్యాశాఖ వైఖరికి నిరసనగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌ వద్ద ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం యూస్‌పీఎస్‌ బాధ్యులు మాట్లాడుతూ ఏడేళ్లుగా పదోన్నతులు లేక ఉపాధ్యాయులు, విద్యార్థులు నష్టపోతున్నారని, ముఖ్యమంత్రి పలుమార్లు పదోన్నతులు కల్పిస్తామని ప్రకటించారని అన్నారు.  వేసవి సెలవుల్లో బదిలీలు, పదోన్నతులు పూర్తి చేస్తామని విద్యాశాఖ మంత్రి చెప్పారని,   సగం రోజులు గడిచినా షెడ్యూల్‌ విడుదల చేయలేదని అన్నారు. పరస్పర బదిలీల సమస్య పరిష్కరించాలని ఉద్యోగులు వేతనాలను ఒకటో తేదీన విడుదల చేయాలని కోరారు. ధర్నాకు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. 


 షెడ్యూల్‌ ప్రకటించాలి

- పాకాల శంకర్‌గౌడ్‌, టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను వెంటనే ప్రకటించాలి. నాలుగేళ్లుగా బదిలీలు, ఏడేళ్లుగా పదోన్నతులు, 17 ఏళ్లుగా పర్యవేక్షణ అధికారుల పోస్టుల భర్తీలేక విద్యాశాఖలో తీవ్ర సంక్షోభం నెలకొంది. చాలా ఏళ్లుగా ఉపాధ్యాయులందరూ బదిలీలు, పదోన్నతుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ వేసవి సెలవుల్లో షెడ్యూల్‌ను ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాం. నిరుద్యోగ యువత ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న టీఆర్‌టీ వెంటనే నిర్వహించాలి. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి. 


 మాట నిలబెట్టుకోవాలి

- దోర్నాల భూపాల్‌రెడ్డి, టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు 

ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు చేపడతామన్న ప్రభుత్వం వెంటనే ప్రక్రియను ప్రారంభించి మాటను నిలబెట్టుకోవాలి. బదిలీలు, ప్రమోషన్‌లు లేక చాలా సంవత్సరాలు అవుతోంది. ప్రమోషన్లు ఇస్తామంటు ప్రభుత్వం కాలయాపన చేస్తోంది తప్ప ఆ వైపుగా కార్యాచరణ చేయడంలేదు. మోడల్‌స్కూల్‌లు ప్రారంభమైననాటి నుంచి ఇప్పటి వరకు పదేళ్లుగా బదిలీలు లేవు. బదిలీలు, ప్రమోషన్లలో సర్వీస్‌ సమస్యలు ఉత్పన్నమైతే మేనేజ్‌మెంట్‌ల వారీగా పదోన్నతులు ఇవ్వాలి. లేనిపక్షంలో విద్యావ్యవస్థ కుంటు పడుతుంది. 


  జాబితా పారదర్శకంగా ఉండాలి 

- మొగిలి లక్ష్మణ్‌, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు

ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను పారదర్శకంగా తయారు చేయాలి. బదిలీలు, ప్రమోషన్లు చేపట్టాలి. విద్యాశాఖలో చాలా సంవత్సరాలుగా బదిలీలు, ప్రమోషన్లు లేక అదే కేడర్లలో చాలా మంది రిటైర్డ్‌ అవుతున్నారు. ప్రభుత్వం వెంటనే ప్రక్రియను ప్రారంభించాలి. పరస్పర బదిలీలు కూడా పూర్తి చేయాలి.


వేసవి సెలవుల్లో ప్రారంభించాలి

- దొంతుల శ్రీహరి, డీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు స్పష్టమైన విదానాన్ని ప్రకటించి వేసవిసెలవుల్లో ప్రారంభించాలి. బదిలీలు, పదోన్నతులు లేకపోవడంతో విద్యావ్యవస్థ సంక్షోభంలో ఉంది. జీవో నంబరు 317 ద్వారా ఉత్పన్నమైన అన్ని సమస్యలు వెంటనే పరిష్కరించాలి. అన్ని రకాల పాఠశాలల్లో ఉపాధ్యాయుల బదిలీల, పదోన్నతుల షెడ్యూల్‌ను వెంటనే ప్రకటించాలి. వేసవి సెలవులు ప్రారంభమై రెండు వారాలు గడిచినా ఇంకా షెడ్యూల్‌ ప్రకటించకపోవడంతో ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన నెలకొంది.  


 సంతోషకరమైన విషయం 

- శ్రీనివాసరావు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు

నూతన జిల్లాలకు ఉద్యోగుల విభజన, కేటాయింపు పూర్తియినందున   జిల్లాలు, జోన్‌ల ప్రాతిపదికన, మేనేజ్‌మెంట్‌ల వారీగా గెజిటెడ్‌, ప్రధానోపాధ్యాయుల స్థాయి వరకు పదోన్నతులు కల్పించడానికి విద్యాశాఖ సమాయత్తం అవడం సంతోషకరమైన విషయం.  పదోన్నతుల షెడ్యూల్‌కు ముందు 317 జీవో ద్వారా బదిలీ అయి పరస్పర బదిలీకి దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులకు సర్వీస్‌ ప్రొటెక్షన్‌ కల్పించాలి. కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేసి ప్రభుత్వం బదిలీ ఉత్తర్వులు ఇవ్వాలి. 





Updated Date - 2022-05-18T06:25:22+05:30 IST