AP: ప్రభుత్వం నిర్ణయంతో ఎగ్జిబిటర్లు రోడ్డున పడతారు..: విజయ్ కుమార్

ABN , First Publish Date - 2021-12-02T17:48:55+05:30 IST

ప్రభుత్వం నిర్దేశించిన రేట్ల ప్రకారం ధియేటర్లను నడపలేమని ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

AP: ప్రభుత్వం నిర్ణయంతో ఎగ్జిబిటర్లు రోడ్డున పడతారు..: విజయ్ కుమార్

అమరావతి: ఏపీ ప్రభుత్వం బెన్ ఫిట్ షోలకు అనుమతి రద్దు చేసింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ’అఖండ’ సినిమా విడుదలైంది. ప్రభుత్వం నిర్దేశించిన రేట్ల ప్రకారం ధియేటర్లను నడపలేమని ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఈ సంద్భంగా ఎగ్జిబిటర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయంతో ఎగ్జిబిటర్లు రోడ్డున పడతారన్నారు. మూడు నెలల్లో సింగిల్ ధియేటర్‌లు పూర్తిగా మూత పడతాయన్నారు. పది మంది చేసే తప్పు చూపించి వేల మంది కడుపు కొడుతున్నారన్నారు. ప్రభుత్వ యంత్రాంగం ద్వారా తప్పులను సరి చేయాలి గానీ.. అసలు వ్యవస్థనే నాశనం చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఐదు రూపాయలకు టీ కూడా రావడం లేదు.. అలాంటిది రెండు గంటలు కుర్చీ వేసి ఐదు, పది రూపాయలకు సినిమా అంటున్నారు... ఇప్పటికే కోవిడ్, లాక్ డౌన్‌ల కారణంగా అప్పుల్లో ఉన్నామని, మూలిగే నక్కపై తాటిపండు పడినట్లుగా ఎపీ ప్రభుత్వం నిర్ణయం ఉందన్నారు. తాము బ్రతకటానికి, థియేట‌ర్లను బ్రతికించటానికి అప్పులు చేయాల్సి వస్తుందన్నారు. తమ బాధలన్నీ మంత్రి పేర్ని నానికి విన్నవించామని, అయినా ఏకపక్షంగా నిర్ణయాలు చేసి జీవోలు ఇచ్చారన్నారు. టిక్కెట్ ధరల తగ్గింపు వల్ల  ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుందన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ స్పందించి ధియేటర్‌ల మనుగడ కోసం నిర్ణయం మార్చుకోవాలని విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-12-02T17:48:55+05:30 IST