అమ్మ భాషతోనే అస్తిత్వం

ABN , First Publish Date - 2020-02-21T07:25:25+05:30 IST

మాతృభాష అంటే వట్టి అక్షరాల పోగుకాదు. తల్లిపేగునుంచి గర్భస్థ శిశువుకు ప్రాణధార ఎలా ప్రవహిస్తుందో, తల్లి భాష నుంచి మనిషికి జ్ఞానధార అలానే సంక్రమిస్తుంది. దానితోనే మనిషికి అస్తిత్వం, గుర్తింపు, గౌరవం అన్నీ లభిస్తాయి...

అమ్మ భాషతోనే అస్తిత్వం

మాతృభాష కన్ను అయితే, ఆంగ్లభాష కళ్లజోడు లాంటిది. అసలు కళ్లుంటేనే కదా కళ్లజోడుతో పని పడేది.ఇవన్నీ తెలిసినా కూడా నేడు తెలుగు ప్రజలు పరభాష మోజులో పడి మాతృభాషనే మృతభాషగా మార్చేసుకుంటున్నారు. 


మాతృభాష అంటే వట్టి అక్షరాల పోగుకాదు. తల్లిపేగునుంచి గర్భస్థ శిశువుకు ప్రాణధార ఎలా ప్రవహిస్తుందో, తల్లి భాష నుంచి మనిషికి జ్ఞానధార అలానే సంక్రమిస్తుంది. దానితోనే మనిషికి అస్తిత్వం, గుర్తింపు, గౌరవం అన్నీ లభిస్తాయి. అంతటి విలువైన మాతృభాషలు ఇటీవల కాలంలో నిర్లక్ష్యాలకు గురవుతుండడం అతిపెద్ద విషాదం. అయినా, దీనిని ఎవరూ గుర్తించడం లేదు కాబట్టే ప్రపంచంలో ప్రతి రెండు వారాలకు ఓ భాష అంతరించిపోతున్నా పెద్దగా లక్ష్యపెట్టడం లేదు. పైగా ఇంగ్లీషు వంటి పరాయి భాషల్లో మాట్లాడడం ఫ్యాషన్‌గా మార్చుకుంటున్నాం. మాతృభాష కన్ను అయితే, ఆంగ్లభాష కళ్లజోడు లాంటిది. అసలు కళ్లుంటేనే కదా కళ్లజోడుతో పని పడేది. ఇట్లాగే జాతికి, మనిషికి జీవధార అయిన మాతృభాషే నశిస్తే, జీవితమే జారిపోతుందని అర్థం. రాష్ట్రాలన్నింటా మాతృభాషలే అధికార భాషగా ఉండాలనీ, పరిపాలన విద్యాబోధన, వ్యాపార వాణిజ్య వ్యవహారాలన్నీ మాతృభాషలో జరగాలని మన జాతీయ నేతలు భావించారు. కొఠారి, రాధాకృష్ణణ్‌ కమిటీలే కాదు, ఇటీవలి నూతన జాతీయ విద్యా విధాన ముసాయిదా కూడా పిల్లల్లో గ్రహణ శక్తి అత్యధికంగా ఉండే 2–8 ఏండ్ల వయస్సులో మాతృభాష బోధనే మేలు అని చెప్పాయి. సృజనకు అమ్మభాషకు దగ్గరి చుట్టరికం ఉంది. సొంత భాషలో ఆలోచించినప్పుడే సృజన పురి విప్పుతుంది, వినూత్నత వెల్లి విరుస్తుంది. ఇవన్నీ తెలిసినా కూడా నేడు తెలుగు ప్రజలు పరభాష మోజులో పడి మాతృభాషనే మృతభాషగా మార్చేసుకుంటున్నారు.


తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్‌, ప్రభుత్వ పాఠశాల్లో తెలుగు మాధ్యమం మాయమవుతుంది. రాష్ట్రంలో ఇప్పటికే 97% పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమమే కొనసాగుతోంది. ఆంగ్ల మాధ్యమం మోజులో పడి తెలుగు మాధ్యమానికి తిలోదకాలిస్తున్న సంకుచిత దృష్టి నుంచి ఎంత తొందరగా బయటపడితే అంతమంచిదనే భావనను తల్లిదండ్రుల్లో రావాలి.


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల్లో విద్యాసామర్థ్యాల స్థాయి తెలుసుకొనుటకు ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో నిర్వహించిన వివిధ సర్వేల్లో ఆంగ్ల మాధ్యమ విద్యార్థుల స్థాయి తల్లిదండ్రులు ఆశించినంతగా, ప్రభుత్వం నిర్ధేశించిన స్థాయికి చేరుకోలేదని తేలింది. అందుకనే, నూతన జాతీయ విద్యా విధానంపై తన అభిప్రాయం తెలుపుతూ తెలంగాణ ప్రభుత్వం ‘ప్రాథమిక విద్యను మాతృభాషలోనే బోధించాలే నిర్దేశించాల’ని చెప్పింది. ఈ మధ్య జరిగిన కేంద్ర విద్యా సలహా మండలి (కేబ్‌) సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి పాల్గొని ప్రైవేటు పాఠశాల్లోనూ మాతృభాషను తప్పనిసరి చేయాని సూచించారు. అంతేకాకుండా దక్షిణాదిలోనే ఆంగ్ల మాధ్యమానికి ఆకర్షితులవుతున్నారని, ఉత్తరాది రాష్ట్రాల్లో, ఉదాహరణకు రాజస్థాన్‌లో 96% మంది మాతృభాషలోనే చదువుతున్నారని స్పష్టం చేశారు. ప్రజలను చైతన్య పరిచి ప్రాథమిక స్థాయివరకు అన్ని పాఠశాలల్లో మాతృభాషలోనే విద్యనందించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవడం తక్షణావసరం. 


మాతృభాషలో బోధన జరపడమంటే పరభాషను నేర్చుకోవద్దని కాదు. ప్రాథమిక విద్యాబోదన మాతృభాషలో తప్పనిసరి చేసి, ఉన్నత విద్యలో తెలుగును ఒక విషయంగా ఉంచినప్పుడే అమ్మ భాష మనుగడలో ఉండగలదు. రాజ్యాంగంలో పొందుపరుచుకున్నట్లు మాతృభాషను రక్షించుకుంటూ అన్యభాషలు నేర్చుకోవడం ఉత్తమం. అభివృద్ధి చెందిన దేశాలైన జపాన్‌, చైనా, ఫ్రాన్స్‌, ఇటలీ, జర్మనీల్లో వారి వారి మాతృభాషల్లోనే విద్యాభ్యాసం చేస్తున్నారు. మన దేశంలోని కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్ర ప్రభుత్వాలు వారి మాతృభాషకు తగిన గుర్తింపు, ప్రోత్సాహాన్ని ఇస్తూ పరిరక్షిస్తున్నాయి. మింగలేని మెతుకులాంటి ఆంగ్లమాధ్యమాన్ని ఆర్భాటాల అద్దాల్లో చూపిస్తూ మాతృభాషపట్ల నిర్లక్ష్య భావనకు గురిచేస్తున్న కార్పోరేట్‌ పాఠశాలలకు అడ్డుకట్టవేయాలి. 


ఆధునిక సాంకేతిక ఉపకరణాల్లో వాడటానికి మాతృభాషను ఆధునీకరించే కృషి తక్షణమే చేపట్టాలి. ప్రభుత్వ శాఖల్లో కార్యకలాపాలన్నీ తెలుగు జరపాలి. తెలుగు మాధ్యమంలో చదివే వారికి ఉద్యోగ, ఉపాధిలో ప్రత్యేక అవకాశాలు కల్పించాలి. ఈ విధంగా ప్రభుత్వ పరంగానే కాదు, వ్యక్తులందరూ కూడా తెలుగు భాష పరిరక్షణకు కృషి చేయాలి. అప్పుడే మన భాషను మనం కాపాడుకోగలుగుతాం. మన అస్తిత్వాన్ని నిలుపుకోగలుగుతాం. లేని నాడు తెలుగు జాతి గుర్తింపే పోతుంది. తస్మాత్‌ జాగ్రత్త!!

మేకిరి దామోదర్‌

(నేడు అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం)

Updated Date - 2020-02-21T07:25:25+05:30 IST