నిష్క్రమణ కావ్యం

ABN , First Publish Date - 2022-01-17T05:54:46+05:30 IST

వెలుతురుని తిని చీకటిని విసర్జించే పడమటి కనుమలు చీకటిని తిని రవి బింబాన్ని కనే తూరుపు కనుమల వెనుకాతల కొన్ని నిష్క్రమణాలు అనివార్యం...

నిష్క్రమణ కావ్యం

వెలుతురుని తిని చీకటిని విసర్జించే పడమటి కనుమలు

చీకటిని తిని రవి బింబాన్ని కనే తూరుపు కనుమల వెనుకాతల 

కొన్ని నిష్క్రమణాలు అనివార్యం


అనాథ విత్తనం నుండి పుట్టిన ఓ అనామక చెట్టుకు అడవి అంటుకట్టుకుంటుంది

వికసిత పుష్పాల దేహాలను ఖండించి ఫలాలు కాస్తుంది ఋతువు

అదృశ్యమయ్యే ప్రతి నదీ ప్రవాహం- మహా సముద్రంలో అలలై ఎగసిపడుతుంది

తెగిపడే తలపాగాలు ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడోచోట ఎర్రపాగాలేస్తాయి

బూడిదయ్యే ప్రతి అస్తిత్వం ఏదొక చెట్టుకు జవసత్వపు జీవం కాదా?

గొంగళిపురుగు అంత్యదశ ఎప్పుడూ ముగింపు కాదు, కొత్త అవతారానికి నాందీ గీతం

కాసేపు వసంతమని కాసేపు శిశిరమని కాలం వేషాలేస్తుంది 

దానికే నాటకం ముగిసిందనుకుంటే ఎలా?


పేగుపాశాలు అడ్డుకోలేని మహాప్రస్థానాలు 

నిత్యం యమపాశాల ఊయలే ఊగుతాయి

రాజీలేని సిద్ధాంతాలు ఎప్పుడూ తుపాకీ గొట్టాలకే వేలాడతాయి

అనాదిగా వస్తున్న రక్త సిద్ధాంతమే కదా..!

అయినా ఏనాడైనా తిరుగుబాటు విరామం ఎరిగిందా?

ధిక్కారపు గొంతులేమైనా తెగాయా? అణిగాయా?

మహాభినిష్క్రమాణాలు ఎప్పుడూ ముగింపు కాదు రూపాంతరం మాత్రమే!

తిరిగి ఎక్కడోచోట ఉదయిస్తాయి, చలిస్తాయి, జ్వలిస్తాయి

గాథలు గేయాలవుతాయి, బాధలు కావ్యాలవుతాయి

తుపాకీ కలం కాగలదు, కలం పిడిబాకు కాగలదు


నీ తర్వాత

ఖాళీ రంగుడబ్బాలో పచ్చివాసనలా ఓ స్వప్నం సజీవంగా అలాగే ఉంటుంది

ప్రసవించని శిశువులా ఓ ఆకాంక్ష గర్భాశయ గోడల్ని బద్దలు చేసుకొని మళ్లీ పుడుతుంది అచ్చం నీలాగే...!

(ఆదివాసీల హక్కుల కోసం, సమ సమాజ నిర్మాణం కోసం అరణ్యాల్లో- హక్కుల గురించి జనారణ్యాల్లో పోరాడి జీవితాలను త్యజించి నిష్క్రమించిన ఎంతోమంది జన నాయకుల స్మృతిలో)

వెంకటేష్‌ పువ్వాడ

72047 09732 

Updated Date - 2022-01-17T05:54:46+05:30 IST