విస్తరిస్తున్న కరోనా

ABN , First Publish Date - 2020-09-18T05:58:27+05:30 IST

జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మొన్నటి వరకు పట్టణ ప్రాంతాలకే పరిమితమైన కొవిడ్‌-19 క్రమంగా పల్లెలకు పాకుతోంది

విస్తరిస్తున్న కరోనా

పట్టణాల నుంచి పల్లెలకు వ్యాప్తి

ఇప్పటి వరకు 1,516 కేసులు నమోదు

జిల్లాలో నిర్ధారణ పరీక్షలు పెంపు

రోజుకు సగటున వెయ్యి టెస్టులు


(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.  మొన్నటి వరకు పట్టణ ప్రాంతాలకే పరిమితమైన కొవిడ్‌-19 క్రమంగా పల్లెలకు పాకుతోంది. ప్రస్తుతం   జిల్లాలోని అన్ని మండలాల్లోనూ కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే మరణాల శాతం తక్కువగా ఉండటం ఒకింత ఉపశమనం కలిగించే అంశం. జూన్‌ రెండో వారం వరకు జిల్లాలో కేవలం వందలోపు మాత్రమే బాధితులు నమోదు కాగా లాక్‌డౌన్‌ దశలను సడలిస్తున్న కొద్దీ కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. మరీ ముఖ్యంగా జూలై, ఆగష్టు, సెప్టెంబరు రెండో వారం వరకు కేవలం 75 రోజుల్లో 1200కు పైగా కరోనా నమోదయ్యాయి. అయితే ఒక్కసారిగా కేసుల ఉధృతి పెరగడానికి అనేక అంశాలు కారణమని నిపుణులు గుర్తించారు. ఇందులో ప్రధానంగా లాక్‌డౌన్‌ సడలింపుల తరువాత తిరిగి కార్యకలాపాలు పుంజుకోవడం, భౌతిక దూరం పాటించకపోవడం కారణాలుగా పేర్కొ న్నారు. 


వర్తకులు, వాణిజ్య సముదాయాల వద్ద నిబం ధనలు పాటించకుండా ఇష్టారీతిన వ్యాపారాలు నిర్వహించడంతో వైరస్‌ చాప క్రింద నీరులా వ్యాప్తి చెందిందని చెబుతున్నారు. ఇందుకు ఆసిఫాబాద్‌ పట్టణమే చక్కటి ఉదాహరణ. ఇక్కడ చిల్లర వ్యాపారాలు నిర్వహించే ఒకే సామాజిక వర్గానికి చెందిన దాదాపు 90శాతం కుటుంబాలు వైరస్‌ బారిన పడడం గమనార్హం. ప్రస్తుతం వ్యవసాయ పనుల సీజన్‌ కావడంతో రైతులు తమ సాగు అవసరాల కొనుగోళ్ల కోసం ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ వంటి పట్టణాలకు వచ్చి వెళ్తున్న క్రమంలో ప్రైమరీ కాంటాక్టులుగా వారు తమకు తెలియకుండానే వైరస్‌ను గ్రామాలకు మోసుకెళ్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ మహమ్మారి వ్యాప్తి చెందుతోంది. 


జిల్లాలో ఐదుగురు మృతి

జిల్లాలో నెల రోజుల క్రితం వరకు రోజుకు 80-85 కేసులు నమోదు కాగా తాజాగా సెప్టెంబరు మొదటి వారం నుంచి కేసుల సంఖ్యలో తగ్గుదల నమోదవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఆగష్టు నుంచి ప్రతీరోజు వెయ్యి పరీక్షలు నిర్వహిస్తుడగా 8 శాతంగా నమోదయిన కేసులు ప్రస్తుతం  3 శాతానికి తగ్గాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 24 కేంద్రాలలో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులను నిర్వహిస్తున్నారు. ఇందులో 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రెండు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, మరో రెండు సిర్పూర్‌ (టి), ఆసిఫాబాద్‌ సీహెచ్‌సీలలో ఏర్పాటు చేశారు. జిల్లాలో ప్రారంభమైన ఆర్‌ఏటి టెస్టుల్లో ఇప్పటివరకు 19,745 టెస్టులు నిర్వహించగా, 2807 ఆర్‌టిపిసిఆర్‌ టెస్టులు నిర్వహించారు.


జిల్లా వ్యాప్తంగా అన్ని కేంద్రాలతో కలిపి సగటున ప్రతీ రోజు 1000 పరీక్షలు నిర్వహిస్తున్నారు. రోజువారీ నిర్వహిస్తున్న పరీక్షల్లో ప్రతీ వంద మందిలో ముగ్గురి చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. వారం రోజుల గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే సగటున ప్రతీ రోజు ముప్పై కేసుల చొప్పున ఇప్పటివరకు మొత్తం 1,516 కేసులు నమోదయ్యాయి. ఇందులో 979 మంది చికిత్స పొంది వ్యాధి నుంచి విముక్తులయ్యారు. ప్రస్తుతం 532 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. జిల్లాలో ఇప్పటివరకు ఐదుగురు మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం క్వారంటైన్‌ కేంద్రాలలో 122 మంది చికిత్స పొందుతుండగా స్వల్ప లక్షణాలు కలిగిన వారిని హోం క్వారంటైన్‌ చేశారు.  


కొవిడ్‌ టెస్టుల్లో రకాలు

అర్‌టి-పిసిఆర్‌ టెస్ట్‌: దీనిలో ముక్కు లేదా గొంతులోని స్వాబ్‌ తీసి పరీక్షిస్తారు. ఫలితం రావడానికి 2-3 రోజులు పడుతుంది. 


ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌: ఈ పరీక్ష కూడా స్వాబ్‌ ద్వారానే పరీక్షిస్తారు. కానీ ఫలితం 15 నిమిషాల్లో తెలుస్తుంది. ఈ పరీక్షలో నెగిటివ్‌ వచ్చి కొవిడ్‌ లక్షణాలు తగ్గకపోతే కచ్చితంగా అర్‌టి-పిసిఆర్‌ టెస్ట్‌ చేయించుకోవాలి.


యాంటీ బాడీ టెస్ట్‌: ఈ పరీక్షని రక్త నమూనాలను సేకరించి చేస్తారు. ఫలితం ఒక్కరోజు లోపే వస్తుంది. దీని ద్వారా వచ్చే ఫలితంలో కచ్చితత్వం ఉండదు. బయట ప్రైవేట్‌గా కొంతమంది  యాంటీబాడీ టెస్టులు చేయిస్తున్నారు. దీని వల్ల కచ్చితమైన రిజల్ట్‌ రాదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

 

అప్రమత్తంగా ఉండాలి-కుమరం బాలు, డీఎంహెచ్‌వో

జిల్లాలో మొన్నటి వరకు ప్రతీ రోజు 80-85 కేసులు నమోదయ్యేవి. ప్రస్తుతం జిల్లాలో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. మా అంచనా ప్రకారం సెప్టెంబరు చివరికల్లా కరోనా మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి. అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలి. దూర ప్రయాణాలను వీలైనంతగా తగ్గించాలి. సామూహికంగా గుమిగూడే   కార్యక్రమాలకు వీలైనంత దూరంగా ఉండాలి.


తాజాగా 32 కొవిడ్‌ కేసులు 

ఆసిఫాబాద్‌ రూరల్‌: జిల్లాలో గురువారం 32 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా తెలిపారు. ఆసిఫాబాద్‌లో 6, కాగజ్‌నగర్‌లో 9, రెబ్బెనలో 5, జైనూరులో 9, సిర్పూర్‌(టి))లో 2, బెజ్జూరులో ఒక్క కేసు నమోదు అయినట్లు ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-18T05:58:27+05:30 IST