విస్తరిస్తున్న కరోనా సెగ

ABN , First Publish Date - 2020-04-04T10:56:43+05:30 IST

నిర్మల్‌ జిల్లాలో కరోనావైరస్‌ సెగ మరింతగా విస్తరిస్తోంది. కరోనా వైరస్‌ పాజిటివ్‌ కారణంగా బుధవారం

విస్తరిస్తున్న కరోనా సెగ

ఐసోలేషన్‌ అబ్జర్వేషన్‌లో ఉన్న ఓ వ్యక్తి మృతి 

35 మందిని గాంధీ ఆసుపత్రికి తరలింపు 

పకడ్బందీగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌    

కొనసాగుతున్న ఇంటింటా సర్వే   


నిర్మల్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి)  : నిర్మల్‌ జిల్లాలో కరోనావైరస్‌ సెగ మరింతగా విస్తరిస్తోంది. కరోనా వైరస్‌ పాజిటివ్‌ కారణంగా బుధవారం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో నిర్మల్‌కు చెందిన జహూరానగర్‌ వాసి ఒకరు మృతి చెందారు. కాగా మృతుని కుటుం బ సభ్యులను, ఆయనతో సన్నిహితంగా ఉన్న 36 మందిని స్థానిక జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ సెంటర్‌కు తరలించిన సంగతి తెలిసిందే. అయితే ఐసోలేషన్‌ సెంటర్‌లో అబ్జర్వేషన్‌లో ఉన్న పట్టణంలోని చిక్కడ్‌పల్లికి చెందిన ఓ యువకుడు శుక్రవారం మరణించారు. ఇక్కడి ఐసోలేషన్‌ వార్డులో ఆయన పరిస్థితి విష మించిన కారణంగా వైద్యాధికారులు అతనిని గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయినట్లు వైద్యాధికారులు పే ర్కొంటున్నారు.


ఈ ఉదంతంతో ఇక్కడి ఐసోలేషన్‌ సెంటర్‌లో అబ్జ ర్వేషన్‌లో ఉన్న 35 మందిని హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. అలాగే జిల్లా కలెక్టర్‌ ముషారప్‌ ఆలీ ఫారూఖీ, ఎస్పీ శశిధర్‌రాజు, డీయంఅండ్‌హెచ్‌ఓ వసంత్‌రావు, జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్‌ దేవేందర్‌రెడ్డిలు కరోనావైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో చేపడుతున్న చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కరోనా పాజిటివ్‌తో మరణించిన వ్యక్తి ప్రాంతమైన జహూరానగర్‌కు చుట్టూ పక్కల దాదాపు కిలోమీటర్‌ పొడవునా ఉన్న ఇళ్లలో అధికార బృందాలు ఆరోగ్యసర్వే చేపడుతున్నాయి. ఉదయం 7గంటల నుంచి సాయం త్రం వరకు ఈ సర్వే కొనసాగుతోంది. ఇదిలా ఉండగా నిర్మల్‌లో చోటు చేసుకున్న మరణం కారణంగా పోలీసులు నాలుగు రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.


శుక్రవారం ఈ లాక్‌డౌన్‌ను పోలీసులు ఇటీవలీ లాక్‌డౌన్‌కు భిన్నంగా చేపట్టారు. రోడ్లపై ఎవరిని కూడా తిరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని అన్ని చౌరస్తాలను భారీకేడ్లతో మూసివేశారు. ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు, ఆటోలు, ఇతర అన్ని రకాల వాహనాల రాకపోకలను నిషేధించారు. ఉదయం కూరగాయలు, నిత్యావసర వస్తువుల కోసం ఓ రెండు గంటల పాటు అవకాశం కల్పించిన తరువాత పట్టణాన్ని దిగ్బంధించారు. ప్రభుత్వం నిర్మల్‌, భైంసా పట్టణాన్ని కరోనా హాట్‌స్పాట్‌లుగా ప్రకటించిన  నేపథ్యంలో ఇక్కడి జిల్లా యంత్రాంగమంతా మరింత అప్రమత్తంగా వ్యవహారిస్తోంది. ఢిల్లీలో జరిగిన తబ్లీగి జమాత్‌ కార్యక్రమానికి హాజరైన వారి తో కాంటాక్ట్‌ ఉన్న వారందరినీ గుర్తించేందుకు మరింత లోతుగా విచారణ కొనసాగుతోంది. అధికార యంత్రాంగం సమన్వయంతో ఈ గుర్తింపు కార్యక్రమం చేపట్టింది. అయితే అనూహ్యంగా కరోనా పాజిటివ్‌తో ఒకరు మరణించిన ఉదాంతం జిల్లా అంతటా కలకలం రేపుతున్న క్రమంలోనే మరో వ్యక్తి కూడా మరణించిన ఉదాంతం సమస్యను మరింత జటిలం చేసినట్లయ్యిందంటున్నారు. 


మరో మరణంతో దుమారం..

కాగా ఢిల్లీలో జరిగిన జమాత్‌కు హాజరైన ఓ వ్యక్తి ఇక్కడి ప్రభుత్వాసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో అబ్జర్వేషన్‌ పొందుతుండగానే ఆయన పరిస్థితి క్షీణించింది. దీంతో ఆయనను హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా అతను మార్గమధ్యంలో శుక్రవారం మరణించాడు. ఇతనితో పాటు ఐసోలేషన్‌ సెంటర్‌లో అబ్జర్వేషన్‌లో ఉన్న 35 మందిని హుటాహుటిన  హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. వీరందరికీ అవసరమైన చికిత్సలు జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉండకపోవచ్చన్న కారణంతోనే వీరిని గాంధీ ఆసుపత్రికి పంపినట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. ఐసోలేషన్‌ వార్డులో వీరందరినీ అబ్జర్వేషన్‌లో ఉంచడం సరికాదన్న ఉన్నతాధికారుల సూచనలతోనే ఈ చర్యను చేపట్టారు. 


పకడ్బందీగా లాక్‌డౌన్‌..

ఇదిలా ఉండగా వరుస సంఘటనల నేపథ్యంలో అధికారులు నిర్మల్‌ పట్టణాన్ని నాలుగు రోజుల పాటు లాక్‌డౌన్‌గా ప్రకటించారు. దీంతో పోలీసులు పట్టణంలోని ప్రధాన రహదారులనే కాకుండా గల్లీలను సైతం దిగ్బంధించి జనం ఇంటి నుంచి బయటకు వెళ్ళకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. వాహనాల రాకపోకలను పూర్తిగా నియంత్రించారు. ఇలా మూడు రోజుల పాటు లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయనున్నారు. జనం ఇంటి నుంచి బయటకు రాకుండా సోషల్‌, భౌతికదూరాన్ని పూర్తిగా పాటించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు ఆధ్వ ర్యంలో ఎఎస్పీ, డీఎస్పీలు, సీఐలు అంతా నిర్మల్‌ జిల్లా కేంద్రంలోనే మకాం వేసి లాక్‌డౌన్‌ను అమలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన పలువురిని అదుపులోకి తీసుకొని వారి వాహనాలను సైతం సీజ్‌ చేశారు. అలాగే పోలీసు సిబ్బందికి మాస్క్‌లు, సానిటైజేషన్‌లను సైతం పంపిణీ చేశారు. 


మొదలైన ఇంటింటా సర్వే..

కాగా కరోనా కారణంగా ఒకరు మృతి చెందిన అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న యంత్రాంగం మృతుని ప్రాంతంతో పాటు చుట్టూ పక్కల కిలో మీటర్‌ పొడవుతో ప్రతి ఇంటిని సర్వే చేపట్టాలని నిర్ణయించారు. దీని కోసం వైద్య, పోలీసు, రెవెన్యూ తదితర శాఖల సిబ్బందితో కలిసి 30 సర్వే బృందాలను ఏర్పాటు చేశారు. ఈ సర్వే బృందాలు ప్రతి ఇంటింటికీ తిరిగి ఆ ఇంటిలోని వ్యక్తుల ఆరోగ్య వివరాలను అలాగే ఎవరైనా ఆ ఇంటికి విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నట్లయితే వారి వివరాలను సేకరించనున్నారు. ఈ సర్వే ద్వారా ఢిల్లీ వెళ్ళి వచ్చిన వారి వివరాలు, వారితో కాంటాక్ట్‌లో ఉన్న వారి వివరాలతో పాటు కరోన లక్షణాలతో భాధపడుతున్న వారి సమాచారం వెల్లడి కానున్నట్లు అధికారులు భావిస్తున్నారు. నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ఈ సర్వే తదుపరి ముందు జాగ్రత్త చర్యలకు దోహదపడనున్నట్లు భావిస్తున్నారు. 

Updated Date - 2020-04-04T10:56:43+05:30 IST