నిర్మాణంలో పట్టణ పీహెచ్‌సీలు

ABN , First Publish Date - 2021-12-04T05:03:42+05:30 IST

జిల్లా వ్యాప్తంగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(యూపీహెచ్‌సీలు) నిర్మాణ దశలో ఉన్నాయి. ఇవి పూర్తయితే పట్టణ ప్రజలకు వైద్య సేవలు మెరుగుపడతాయి.

నిర్మాణంలో పట్టణ పీహెచ్‌సీలు
నెల్లూరు కోటమిట్టలోని పట్టణ పీహెచ్‌సీ

రూ.18.40 కోట్లతో పనులు

పురోగతిపై కలెక్టర్‌ సమీక్ష


నెల్లూరు (వైద్యం), డిసెంబరు 3 : జిల్లా వ్యాప్తంగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(యూపీహెచ్‌సీలు) నిర్మాణ దశలో ఉన్నాయి. ఇవి పూర్తయితే పట్టణ ప్రజలకు వైద్య సేవలు మెరుగుపడతాయి. ఈ కేంద్రాలపై ఎప్పటికప్పుడు కలెక్టర్‌ చక్రధర్‌బాబు వైద్యాధికారులతో సమీక్షిస్తున్నారు. వీటి నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా కేంద్రాలకు ఇప్పటికే వైద్యులను కూడా నియమించారు. పట్టణ ఆరోగ్య కేంద్రాలను పట్టణ ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాలుగా పేరు మార్చారు.  ప్రస్త్తుతం నెల్లూరు, గూడూరు, కావలి, వెంకటగిరిలో వైద్య చికిత్సలు అందిస్తున్నాయి. కొన్ని డివిజన్‌ పరిధిలో ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ వైద్యసేవలతోపాటు టెలిమెడిసిన్‌ సేవలు కూడా అందిస్తున్నారు. అయితే ఆ సేవలు విస్తరింపచేయాలన్న ఉద్దేశంతో వీటిని పట్టణ  పీహెచ్‌సీలుగా ప్రభుత్వం మార్పు చేసింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో రిసెప్షన్‌, ఓపీ, రోగులు ఉండే గది, పరీక్షల గది, ఇన్‌పేషెంట్‌ వార్డు, అత్యవసర సేవలు, ఔషధాల నిల్వలకు గదులు, ల్యాబ్‌, శస్త్రచికిత్సల గది, లేబర్‌వార్డు, టీకాల గది, గర్భిణులకు, బాలింతలకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేస్తున్నారు. యోగా, జిమ్‌ సౌకర్యానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.

రూ. 18.40 కోట్లతో నిర్మాణాలు

జనాభా ప్రాతిపదికన ఒక్క నెల్లూరు నగరంలోనే 21 పట్టణ పీహెచ్‌సీలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం 8 కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. మరో మూడు కేంద్రాల నిర్మాణాలను ప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన పట్టణాల్లో కొత్తగా 24 ఆరోగ్య కేంద్రాలను నిర్మించాల్సి ఉంది. ఒక్కో  కేంద్రం నిర్మాణానికి రూ. 80 లక్షలు వెచ్చించనున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా నిర్మాణాలకు రూ. 18.40 కోట్లు ఖర్చు చేయనున్నారు. 

నిర్మాణ దశలో పట్టణ పీహెచ్‌సీలు

జిల్లాకు పట్టణ పీహెచ్‌సీల కింద 37 ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం 13 పట్టణ ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. నెల్లూరులో 8, కావలిలో 3, గూడూరులో 1, వెంకటగిరిలో ఒకటి ఉన్నాయి. కొత్తగా మరో 24 పట్టణ  పీహెచ్‌సీలకు అనుమతులు వచ్చాయి.  నెల్లూరుకి అదనంగా 13 మంజూరు చేశారు. అలాగే కావలిలో 1, గూడూరులో 3, వెంకటగిరి 1, నాయుడుపేట 2, సూళ్లూరుపేట 2, ఆత్మకూరు 1, బుచ్చిలో ఒకటి  చొప్పున ఏర్పాటుకు అనుమతులు వచ్చాయి.  వీటిలో కొన్నిటి నిర్మాణాలు పూర్తి కావస్తున్నాయి. వాటిని తొందరగా అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.

Updated Date - 2021-12-04T05:03:42+05:30 IST