విస్తరణ పనులు ముమ్మరం

ABN , First Publish Date - 2021-10-27T05:30:00+05:30 IST

భువనగిరి పట్టణ ప్రధాన రహదారి 100ఫీట్ల విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి.

విస్తరణ పనులు ముమ్మరం
జిల్లాకేంద్రంలో కొనసాగుతున్న విస్తరణ పనులు

 జిల్లా కేంద్రం నుంచి నూతన  కలెక్టరేట్‌ వరకు 100ఫీట్ల రహదారి నిర్మాణం

 పనుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి నియామకం 

 నిర్వాసితుల ప్రయోజనాల కోసం టీడీఆర్‌ ఏర్పాటు

 విస్తరణ పనులను అడ్డుకున్న విపక్షాల నేతలు

 80 ఫీట్లకు కుదించి, పునరావాసం కల్పించాలని డిమాండ్‌

భువనగిరి పట్టణ ప్రధాన రహదారి 100ఫీట్ల విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే భవనాలపై చేసిన మార్కింగ్‌ ఆధారంగా మునిసిపల్‌ సిబ్బంది పోలీసుల బందోబస్తు నడుమ భవనాల తొలగింపు పనులను చేపట్టారు. మునిసిపాలిటీ ఆధ్వర్యంలో తొలగింపు పనులు పూర్తిచేసి పంచాయ తీరాజ్‌ శాఖకు 100 ఫీట్ల రహదారిని అప్పగించాక ప్రతిపాదిత విస్తరణ పనులను చేపట్టి తొమ్మిది నెలల్లో పూర్తి చేయనున్నారు. రహదారి విస్తరణ పనులను 80 ఫీట్లకే పరిమితం చేయాలంటూ భువనగిరి పట్టణ మెయిన్‌రోడ్డు ఇరువైపులగల యజమానుల సంఘం ఆధ్వర్యంలో నిరసనలకు దిగారు. పోలీసుల జోక్యంతో రహదారివెంట ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  

- భువనగిరి టౌన్‌

భువనగిరి పట్టణ రహదారి విస్తరణ పనులను కలెక్టర్‌ పమేలాసత్పథి నేరుగా పర్యవేక్షిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ జాయింట్‌ డైరెక్టర్‌ నర్సింహరాములును ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా నియమించింది. రోడ్డు విస్తరణతో ఉపాధి కోల్పోనున్న చిరువ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపాలంటూ ఆరు రోజులుగా సీపీఎం ఆధ్వర్యంలో రిలేదీక్షలు సాగుతున్నాయి. భవనాల తొలగింపు పనుల మొదటి రోజున బీజేపీ, కాంగ్రె్‌సతోపాటు పలువురు భవన యజమానులు వేర్వేరుగా అడ్డుకునే ప్రయత్నంచేస్తూ అధికారులు, సిబ్బందితో వాగ్వాదానికి దిగడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. అయితే మూడు రోజులపాటు ప్రహరీలు, ప్రభుత్వ కార్యాలయాల భవనాల తొలగింపు పనులు చేపడుతామని అధికారులు పేర్కొన్నారు. అప్పటికీ మార్కింగ్‌ ఆధారంగా భవన యజమానులు స్వచ్ఛందంగా కట్టడాలను తొలగించుకోవాలని, లేదంటే తామే కూల్చివేస్తామని అధికారులు స్పష్టంచేస్తున్నారు. అయితే విస్తరణకోసం పాక్షికంగా కూడా భవనాలను సొంతంగా తొలగించుకోలేని యజమానులకు ఆర్థిక ఇబ్బందులు తగ్గించే లక్ష్యంతో వారి విన్నపం మేరకు తొలగింపు పనులను మునిసిపాలిటినే చేపడుతుందని అధికారులు చెబుతున్నారు. విస్తరణ పనులు ప్రారంభం కావడంతో రహదారి వెంట ఉన్న చిరువ్యాపారులు, భవన యజమానులు ఆందోళనకు గురవుతున్నారు. 


నూతన కలెక్టరేట్‌ వరకు 100 ఫీట్ల విస్తరణ

రహదారి 100 ఫీట్ల విస్తరణకు మొదట మారుతీ షోరూం నుంచి ఎస్‌ఎల్‌ఎన్‌ఎ్‌స డిగ్రీ కళాశాలవరకు ప్రతిపాదించినప్పటికీ తాజాగా నూతన కలెక్టరేట్‌ వరకు పొడిగించాలని నిర్ణయించారు. దీంతో పట్టణంలో సుమారు ఏడు కిలోమీటర్లమేర 100ఫీట్ల రహదారిగా అభివృద్ధి కానుంది. ఇప్పటికే 2.15 కిలోమీటర్లమేర 100 ఫీట్ల రహదారి విస్తరణకు ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ నుంచి పాత బస్టాండ్‌వరకు టెండర్లు పూర్తయిన పనులను మెదటిదఫా పూర్తి చేయనున్నారు. హైదరాబాద్‌ చౌరస్తా నుంచి మారుతీ చౌరస్తా వరకు రెండో దఫాలో, పాత బస్టాండ్‌ నుంచి నూతన కలెక్టరేట్‌ వరకు మూడో దఫాలో 100 ఫీట్ల విస్తరణ పనులను చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు మొదటి దఫా విస్తరణ పనులను రూ.15 కోట్లతో మూడు ప్యాకేజీలుగా చేపట్టారు. 


మార్కింగ్‌లోపే మెట్లు

వంద ఫీట్ల రహదారి విస్తరణ పనులకు అవసరమైన స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు అధికారులు గతంలోనే రహదారి వెంటగల భవనాలకు మా ర్కింగ్‌ చేశారు. వాస్తవానికి నిబంధనల ప్రకారం 100ఫీట్ల రహదారికి ఇరువైపుల తొమ్మిది ఫీట్ల సెట్‌బాక్‌ పాటించాలని, కానీ ఆస్తి నష్టాన్ని తగ్గించే దిశగా 100ఫీట్ల విస్తరణకే పరిమితం చేసినట్లు, మార్కింగ్‌లోపే భవనాల మెట్లను నిర్మించుకోవాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. దీంతో మా ర్కింగ్‌తో పోలిస్తే మెట్ల నిర్మాణంకోసం కనీసం మరో మూడు ఫీట్లు భవన యజమానులు వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. రోడ్డు విస్తరణలో తొలగించనున్న 104 డబ్బా దుకాణాలకు ప్రత్యామ్నాయం చూపేందుకు పట్టణంలోని అనువైన స్థలాలను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.   


టీడీఆర్‌ బ్యాంకు ఏర్పాటుపై దృష్టి

రహదారి విస్తరణ నిర్వాసితులకు టీడీఆర్‌ (అభివృద్ధి హక్కుల బదిలీ) బ్యాంకు భరోసా కల్పించనుంది. నిర్మాణ అనుమతులు పొందిన భవనాలను రోడ్డు విస్తరణ పనుల్లో తొలగించాల్సి వస్తే అంతకు నాలుగింతలు యజమానులకు టీడీఆర్‌ను వర్తింపజేస్తారు. ఆ వెసులుబాటును సంబంధిత యజమాని వినియోగించుకోవచ్చు. లేదా హెచ్‌ఎండీఏ పరిధిలోని ఏ ప్రాంతంలోనైనా నిర్మించుకోనున్న భవనానికి ఈ హక్కులు వర్తిస్తాయి. దీంతో భవన నష్టం జరగనున్న యజమానులు హెచ్‌ఎండీఏ పరిధిలోని ఇతర ప్రాంతాల వారికి విక్రయించకోగలిగితే ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది. దీంతో యజమానులకు అవగాహన కల్పిస్తూ, టీడీఆర్‌ బదిలీలో మధ్యవర్తుల జోక్యం నివారించేందుకు టీడీఆర్‌ బ్యాంకును ఏర్పాటుచేసి ఆన్‌లైన్‌లో వివరాలను అందుబాటులో ఉండేలా ప్రత్యేక ప్రణాళికను రూపొందించే ఆలోచనలో అధికారులు ఉన్నారు.  


రోడ్డు విస్తరణ పనులపై నిరసనల పర్వం 

భువనగిరి పట్టణ ప్రధాన రహదారి 100 ఫీట్ల విస్తరణ పనుల్లో భాగంగా భవనాల కూల్చివేత పనులు ప్రారంభంకావడంతో బుధవారం నిరసనలు వెల్లువెత్తాయి. రహదారి విస్తరణ పనులను 80 ఫీట్లకే పరిమితం చేయాలంటూ పట్టణ మెయిన్‌రోడ్డుకు ఇరువైపులగల యజమానుల సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. కానీ ప్రతిపాదనల మేరకే పనులు కొనసాగుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మునిసిపల్‌ కార్యాలయంలో చెర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన అఖిలపక్షం సమావేశంలో కూడా రోడ్డు విస్తరణ పనులు వాయిదా వేయాలంటూ విపక్ష సభ్యులు డిమాండ్‌చేశారు. డబ్బా వ్యాపారులకు పునరావాసం చూపాలని, ఆస్తినష్టం వాటిల్లే భవన యజమానులకు నష్టపరిహారం చెల్లించాలని, మొదట ప్రతిపాదించినట్లు మారుతీ షోరూం నుంచి విస్తరణ పనులు ప్రారంభించాలని సమావేశంలో పాల్గొన్న విపక్షాల నేతలు డిమాండ్‌ చేశారు. పట్టణ అభివృద్ధి కోసం చేపడుతున్న విస్తరణ పనులకు అన్ని వర్గాలు సహకరించాలని చైర్మన్‌ సహా వైస్‌చెర్మన్‌ చింతల కిష్టయ్య, కమిషనర్‌ ఎం.పూర్ణచందర్‌, పట్టణ ప్రణాళిక అధికారి జె.కృష్ణవేణి కోరారు. ఎమ్మెల్యే, కలెక్టర్‌ సమక్షంలో మరోమారు సమావేశం నిర్వహించాలంటూ అఖిలపక్షం నాయకులు సమావేశంనుంచి వెనుదిరిగారు. అయితే మంత్రి జగదీష్‌రెడ్డి పర్యటన ఏర్పాట్లకోసం అదే సమయానికి మునిసిపల్‌ కార్యాలయానికి వచ్చిన అదనపు కలెక్టర్‌ దీపక్‌తివారీని అఖిల పక్షనాయకులు, దుకాణదారులు, వ్యాపారులు కార్యాలయం వెలుపల అడ్డగించడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ దీపక్‌తివారీ మాట్లాడుతూ విస్తరణ పనులను ఆపేది లేదని పేర్కొంటునే డబ్బా దుకాణాలకు పునరావసం కల్పించేందుకు అణువైన స్థలాలను అన్వేషిస్తున్నామన్నారు. భవన యజమానులకు మాత్రం టీడీఆర్‌ను వర్తింపజేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అయితే ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేయడంతో వాగ్వాదం నెలకొంది. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు పి.ఉమాశంకర్‌రావు, ఆ పార్టీ కౌన్సిలర్లు మాయ దశరథ, రత్నపురం బలరాం, నల్లమాసు సుమ, జనగాం కవిత, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు బీసుకుంట్ల సత్యనారాయణ, కౌన్సిలర్లు పోతంశెట్టి వెంకటేశ్వర్లు, ఈరపాక నర్సింహ, నాయకులు కైరంకొండ వెంకటేష్‌, పడిగెల ప్రదీప్‌, దాసరి పాండు, మాయ కృష్ణ, ఎండీ ఇమ్రాన్‌, బట్టు రాంచంద్రయ్య, మాటూరి బాలేశ్వర్‌ పాల్గొన్నారు. 



రహదారి విస్తరణకు సహకరించాలి : ఎం.పూర్ణ చందర్‌, మునిసిపల్‌ కమిషనర్‌, భువనగిరి  

పట్టణ ప్రధాన రహదారి 100ఫీట్ల విస్తరణకు  ప్రజలందరూ సహకరించాలి. 100 ఫీట్ల రోడ్డుతో పట్టణం మరింత అభివృద్ధి సాధిస్తుంది. ట్రాఫిక్‌ సమస్యలు, రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి. ఆర్‌అండ్‌బీ రికార్డులు, మునిసిపల్‌ మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం పట్టణ ప్రధాన రహదారి మొదటి నుంచి వంద ఫీట్ల రహదారిగానే ఉంది. కానీ పలు కారణాలతో ఆక్రమణలకు గురై కుంచించుకపోయింది. రాజకీయ పార్టీలు కూడా అభివృద్ధిలో భాగస్వామ్యంకావాలి. 

Updated Date - 2021-10-27T05:30:00+05:30 IST