అబుదాబి నుంచి 6నెలల కింద వచ్చిన ప్రవాస కుటుంబం.. తిరిగి వెళ్లేందుకు ఏర్పాట్లు.. ఇంతలోనే జరిగిన ఘోరమిదీ!

ABN , First Publish Date - 2021-09-11T19:43:23+05:30 IST

కరోనా నేపథ్యంలో ఆరు నెలల కింద అబుధాబి నుంచి స్వదేశానికి తిరిగొచ్చిన ఓ ప్రవాస కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

అబుదాబి నుంచి 6నెలల కింద వచ్చిన ప్రవాస కుటుంబం.. తిరిగి వెళ్లేందుకు ఏర్పాట్లు.. ఇంతలోనే జరిగిన ఘోరమిదీ!

పరావుర్: కరోనా నేపథ్యంలో ఆరు నెలల కింద అబుదాబి నుంచి స్వదేశానికి తిరిగొచ్చిన ఓ ప్రవాస కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తల్లిదండ్రులతో పాటు ఓ బాబు వారి నివాసంలోనే శవాలై కనిపించారు. ఈ విషాద ఘటన శుక్రవారం కేరళ రాష్ట్రం కొల్లాం జిల్లా పరావుర్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సునీల్(38), క్రిష్నెడు(30) భార్యాభర్తలు. వీరికి అరవ్ క్రిష్ణ అనే కుమారుడు ఉన్నాడు. సునీల్ అబుదాబిలో లిఫ్ట్ టెక్నిషియన్‌గా పని చేసేవాడు. కరోనా విజృంభణ నేపథ్యంలో ఆరు నెలల కింద అబుధాబి నుంచి భార్య, కుమారుడిని తీసుకుని స్వస్థలమైన వట్టాపరంబాత్‌కు వచ్చేశాడు. ప్రస్తుతం కరోనా కాస్తా తగ్గుముఖం పట్టడంతో తిరిగి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల కింద అత్తాగారి ఊరైన పాచలం వెళ్లారు. అక్కడి నుంచి గురువారం తిరిగి వట్టాపరంబాత్‌కు వచ్చేశారు. 


అయితే, సునీల్ అమ్మ లత మాత్రం అక్కడే ఉండిపోయింది. ఆ తర్వాతి రోజు పాచలం నుంచి కుమారుడికి ఫోన్ చేసిన లత.. ఎంతకు సునీల్ కాల్ లిఫ్ట్ చేయలేదు. దాంతో అనుమానం వచ్చిన లత ఇంటి పక్కన ఉండే మరో వ్యక్తికి ఫోన్ చేసి తన కుమారుడికి ఇంటికి వెళ్లి చూడాల్సిందిగా కోరింది. దాంతో ఆయన వెళ్లి చూశాడు. ఇంటి తలుపులు మూసి ఉండడంతో కిటికీలోంచి చూసిన ఆయనకు గుండె ఆగినంత పనైంది. లోపల ముగ్గురు విగతజీవులుగా పడి ఉన్నారు. వెంటనే ఆయన పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. 


సునీల్, క్రిష్నెడు మృతదేహాలు ఒక గదిలో వేలాడుతుంటే.. కుమారుడు అరవ్ క్రిష్ణ మృతదేహం మరో గదిలో బెడ్‌పై పడి ఉంది. బాలుడి మెడ చుట్టు గాయాలు ఉండడం పోలీసులు గుర్తించారు. కాగా, పోలీసులకు ఇంట్లో ఎలాంటి సూసైడ్ నోట దొరకలేదు. దీంతో ఎవరో చంపి వేలాడదీసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సునీల్ ఫ్యామిలీది ఆత్మహత్య లేక హత్య అనేది తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు. కాగా, సునీల్ కుటుంబానికి ఆర్థిక, ఇతర సమస్యలు ఏమీ లేవని బంధువులు, సన్నిహితులు చెప్పారు. కచ్చితంగా ఎవరో వారిని హత్య చేసి ఉంటారని వారు చెబుతున్నారు. ఇంకొన్ని రోజుల్లో అబుధాబి వెళ్లాల్సిన కుటుంబం ఇలా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. 



Updated Date - 2021-09-11T19:43:23+05:30 IST