అంచనాలు మించాయ్..

ABN , First Publish Date - 2021-04-10T06:32:26+05:30 IST

గత ఆర్థిక సంవత్సరం (2020 -21)లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.9.45 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) చైర్మన్‌ పీసీ మోదీ ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా సంక్షోభ ప్రభావ నేపథ్యంలో సవరించిన

అంచనాలు మించాయ్..

2020-21 ప్రత్యక్ష పన్ను వసూళ్లు  రూ.9.45 లక్షల కోట్లు 

సవరించిన బడ్జెట్‌ అంచనా కంటే  5% అధికం: సీబీడీటీ చీఫ్‌ మోడీ 


గత ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష పన్నులతోపాటు పరోక్ష పన్ను వసూళ్లూ అంచనాలను మించాయి. ఈ నేపథ్యంలో 2020-21 ద్రవ్య లోటు రూ.17-17.2 లక్షల కోట్ల కోట్లకు పరిమితం కావచ్చు. 

- అదితి నాయర్‌, ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త 


న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం (2020 -21)లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.9.45 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) చైర్మన్‌ పీసీ మోదీ ఈ  విషయాన్ని వెల్లడించారు. కరోనా సంక్షోభ ప్రభావ నేపథ్యంలో సవరించిన బడ్జెట్‌ అంచనా రూ.9.05 లక్షల కోట్లతో పోలిస్తే 5 శాతం అధికమిది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2019 -20)లో వసూలైన రూ.10.49 లక్షల కోట్లతో పోలిస్తే మాత్రం 10 శాతం తక్కువే. గత ఏడాది ఫిబ్రవరి 1న ప్రకటించిన ‘బడ్జెట్‌ 2020 -21’లో కేంద్ర ప్రభుత్వం తొలుత రూ.13.19 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నుల ఆదాయాన్ని అంచనా వేసింది. గత ఏడాది మార్చిలో మొదలైన కరోనా సంక్షోభంతో ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. దాంతో ఆర్థిక శాఖ ఈ అంచనాను రూ.9.05 లక్షల కోట్లకు కుదించింది. అయితే, ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో ఆర్థిక కార్యకలాపాలు జోరందుకోవడంతో పన్ను వసూళ్లు అంచనాలు మించాయి. వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేట్‌ పన్ను, క్యాపిటల్‌ గెయిన్‌ ట్యాక్స్‌ ప్రత్యక్ష పన్నుల పరిధిలోకి వస్తాయి. 


ఈసారి రూ.11.08 లక్షల కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2021- 22) గాను ప్రత్యక్ష పన్నుల ద్వారా రూ. 11.08 లక్షల కోట్లు సమకూరవచ్చని ఆర్థిక శాఖ అంచనా వేసింది. సవరించిన గత బడ్జెట్‌ అంచనాలతో పోలిస్తే 17 శాతం అధిక ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. 


‘వివాద్‌ సే విశ్వాస్‌’ ద్వారా రూ.54వేల కోట్లు 

పన్ను వివాదాల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాద్‌ సే విశ్వాస్‌ పథకం ద్వారా ఇప్పటివరకు రూ.54,000 కోట్ల ఆదాయం సమకూరిందని సీబీడీటీ చైర్మన్‌ పీసీ మోదీ తెలిపారు. ఈ పథకంలో భాగంగా పన్ను చెల్లింపులు జరిపేందుకు గడువు ఈ నెల 30తో ముగియనుంది. ఈ స్కీమ్‌ ద్వారా మూడో వంతు పన్ను వివాదాలు పరిష్కృతమయ్యాయని మోడీ తెలిపారు. కాబట్టి, భవిష్యత్‌లో ఇదే తరహా మరో పథకాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. 


గత ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష పన్నులు 

స్థూల వసూళ్లు రూ.12.06 లక్షల కోట్లు 

రిఫండ్లు రూ.2.61 లక్షల కోట్లు 

నికర వసూళ్లు రూ.9.45 లక్షల కోట్లు


విభాగాల వారీగా నికర వసూళ్లు 

వ్యక్తిగత ఆదాయ పన్ను    రూ.4.71 లక్షల కోట్లు 

కార్పొరేట్‌ పన్ను            రూ.4.57 లక్షల కోట్లు 

ఎస్‌టీటీ                     రూ.16,927 కోట్లు 

Updated Date - 2021-04-10T06:32:26+05:30 IST