Jun 18 2021 @ 01:45AM

ఔట్‌డోర్స్‌ షూటింగ్స్‌ కోసం ఎదురుచూపులు

సినిమా షూటింగ్‌ అన్నతర్వాత స్టూడియోలోని ఫ్లోర్లు, రియల్‌ బిల్డింగ్స్‌ లోనే కాదు ఔట్‌డోర్‌ లొకేషన్లలో కూడా చేయాల్సి ఉంటుంది. అయితే కరోనా కారణంగా ఇప్పుడు ముంబై ఔట్‌డోర్‌లో షూటింగ్‌ చేసే పరిస్థితి లేదు. పరిస్థితులు కుదుటపడిన తర్వాత కానీ మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చేట్లు లేదు. అందుకే ఆ అనుమతి కోసమే ముంబైలో కొన్ని సినిమాలు ఎదురుచూస్తున్నాయి. వాటిలో విజయ్‌ సేతుపతి నటించే హిందీ చిత్రం కూడా ఒకటి. శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకత్వంలో సంజయ్‌ రౌత్రాయ్‌ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ఎక్కువగా ఔట్‌డోర్‌ లొకేషన్స్‌లలోనే తీయాలి. అందుకే ఈ ఎదురుచూపులు. ఆ  విషయాన్ని నిర్మాత సంజయ్‌ వివరిస్తూ ‘మా దర్శకుడు శ్రీరామ్‌కు నేచురల్‌ లొకేషన్స్‌లో తీయడం మొదటినుంచీ అలవాటు. అందుకే ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాలనుకుంటున్నాం. మేం కోరుకున్న కొన్ని లొకేషన్స్‌లో అయినా అనుమతి వస్తుందేమో చూడాలి’ అన్నారు. అలాగే మరో దర్శకుడు హన్సాల్‌ మెహతా కూడా తన కొత్త సినిమా ప్రారంభించడానికి అన్ని ఏర్పాటు చేసుకుని సిద్ధంగా ఉన్నారు. రియల్‌ లొకేషన్స్‌లో సినిమాలు తీయడం ఆయనకు మొదటి నుంచీ అలవాటు. ఆయన కూడా ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. ఫెడరేషన్‌ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఇండియా సినీ ఎంప్లాయిస్‌ సెక్రటరీ అశోక్‌ దూబే ఈ విషయం గురించి మాట్లాడుతూ ‘ప్రస్తుతం ఔట్‌డోర్‌లో షూటింగ్‌ చేయడానికి ఎలాంటి అనుమతులు లేవు. ప్రభుత్వం నుంచి శుక్రవారం సరికొత్త మార్గదర్శక సూత్రాలు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఔట్‌డోర్‌ షూటింగ్స్‌కు అనుమతించే ఛాన్స్‌ ఉంది’ అని తెలిపారు.