ఫీల్డ్‌ అసిస్టెంట్ల ఎదురుచూపులు

ABN , First Publish Date - 2022-04-30T06:31:54+05:30 IST

మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసిన ఫీల్డ్‌ అసిస్టెంట్లు రెండేళ్లుగా విధులు లేక తిప్పలు పడుతున్నారు.

ఫీల్డ్‌ అసిస్టెంట్ల ఎదురుచూపులు

- రెండేళ్లుగా విధులు లేక తిప్పలు

- సీఎం కేసీఆర్‌ ప్రకటించి నెలగడిచినా జారీకాని ఉత్తర్వులు

జగిత్యాల, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసిన ఫీల్డ్‌ అసిస్టెంట్లు రెండేళ్లుగా విధులు లేక తిప్పలు పడుతున్నారు. గతంలో సమ్మెకు దిగిన ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల నుంచి ప్రభుత్వం తొలగించింది. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఫీల్డ్‌ అసిస్టెంట్లు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని రావడం జరిగింది. పలుప్రాంతాల్లో ఫీల్డ్‌అసిస్టెంట్లు నిరసన చేయడం, వినతిపత్రాలు అందించడం, ఆందోళనలు నిర్వహించారు. ఫీల్డ్‌ అసిస్టెంట్ల విన్నపాలను ఆలకించిన సీఎం కేసీఆర్‌ ఎట్టకేలకు గత నెలలో ఫీల్డ్‌ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని అసెంబ్లీలో ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించి నెల రోజులు గడుస్తున్నప్పటికీ ఇందుకు సంబంధించిన ఎటువంటి ఉత్తర్వులు వెలువడకపోవడంతో ఎఫ్‌ఏలు నిరాశకు గురవుతున్నారు. రెండేళ్లుగా విధులు లేక తిప్పలు పడ్డ తమను ఇప్పటికైనా తిరిగి విధుల్లోకి చేర్చుకుంటారని ఎదురుచూపులతో గడుపుతున్నారు. జిల్లాలో 2,82,748 మంది ఉపాధిహామీ కూలీలున్నారు. 2021-22 సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా రూ. 131.65 కోట్ల వ్యయంతో 1,28,461 కూలీలకు పనికల్పించారు. గతంలో 242 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లను ప్రభుత్వం నియామకం చేసింది. సంబంధిత మండలాలు, గ్రామాల్లో ఈజీఎస్‌ పనులను లక్ష్యం మేరకు ఫీల్డ్‌అసిస్టెంట్లు కీలకంగా వ్యవహరించే వారు. 

- 2020 మార్చిలో తొలగింపు..

కేంద్ర ప్రభుత్వం 2005లో ఉపాధిహామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. అదే ఏడాది రాష్ట్ర ప్రభుత్వం పనుల అమలుకు గ్రామపంచాయతీకి ఒక్కరు చొప్పున ఫీల్డ్‌ అసిస్టెంట్లను కాంట్రాక్ట్‌ పద్ధతిన నియామకం చేసుకుంది. జిల్లా వ్యాప్తంగా 242 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు నియామకం అయ్యారు. సుమారు 15 ఏళ్లుగా ఉపాధిహామీ పథకంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఎఫ్‌ఏలు తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతో వేతనాలు సైతం పెంచాలని డిమాండ్‌ చేశారు. సంబంధిత డిమాండ్లతో సమ్మెకు దిగారు. తమ ఉద్యోగాలకు హాని కలిగించేలా ఉన్న జీవో నంబరు 2779ను రద్దు చేయాలని ఉపాధిహామీ ఫీల్డ్‌అసిస్టెంట్లు 2020 మార్చి నెలలో సమ్మెకు దిగారు. సమ్మెకు వెళ్లినందుకు గానూ వారిని ప్రభుత్వం అదే నెలలో తొలగించింది. అప్పటివరకు ఫీల్డ్‌ అసిస్టెంట్లు నిర్వర్తిస్తున్న బాధ్యతలను గ్రామ కార్యదర్శులకు అప్పగించింది. అయితే కరోనా సమయంలో వారిని ఆదుకోవాల్సి పోయి ఫీల్డ్‌ అసిస్టెంట్ల వ్యవస్థను పూర్తిగా ప్రభుత్వం రద్దు చేసిందన్న విమర్శలు చేశారు. 

- జిల్లాలో 242 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు..

జగిత్యాల జిల్లాలో 242 మంది పీల్డ్‌అసిస్టెంట్లు ఉద్యోగాలు కోల్పోయారు. రెండేళ్ల కాలంలో తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని పలు ప్రాంతాల్లో ధర్నాలు, నిరసనలు నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, అధికారులను కలిసి వినతిపత్రాలు అందజేశారు. 19 నెలల పాటు పీల్డ్‌ అసిస్టెంట్ల సేవలను ప్రభుత్వం పక్కన పెట్టింది. ఎట్టకేలకు సీఎం కేసీఆర్‌ వీరికి సంబందించి గత నెల 15వ తేదిన అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించారు. మళీ సమ్మెలోకి వెళ్లవద్దని సూచించారు. సీఎం కేసీఆర్‌ ప్రకటనతో ఫీల్డ్‌ అసిస్టెంట్లు సంబురం చెందారు. సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి, మిఠాయిలు పంచారు. 

- కొత్త నియామకాలపై ఆశలు..

ప్రభుత్వం ఐదు సంవత్సరాల క్రితం నూతన గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసింది. దీంతో జిల్లాలో గ్రామపంచాయతీల సంఖ్య పెరిగింది. ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగించే సమయం వరకు పాత గ్రామపంచాయతీల ప్రకారమే ఎఫ్‌ఏలు ఉన్నారు. కొత్తగా నియామకాలు చేయలేదు. మేజర్‌ గ్రామపంచాయతీలో ఇద్దరు ఎఫ్‌ఏలు పనిచేస్తుండగా, కొంతమందికి రెండు, మూడు గ్రామాల బాధ్యతలను సైతం అప్పగించారు. కొత్త నియామకాలపై యువత ఆశలు పెట్టుకుంది. జిల్లాలో అదనంగా మరో వంద వరకు ఫీల్డ్‌ అసిస్టెంట్ల నియామకం జరిపే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. గ్రామాల్లో పల్లె ప్రగతి పనులు, హరితహారం, ప్రభుత్వ ప్రాధాన్యత పనులతో తీరిక లేకుండా ఉంటున్న కార్యదర్శులకు ఉపాధిహామీ పథకం పనులు మరింత బారంగా మారాయన్న అభిప్రాయాలున్నాయి. అదనపు పనుల బారం వేయవద్దని గ్రామకార్యదర్శులు సంబంధిత మండల అధికారులకు మొర పెట్టుకుంటు న్నారు. తాజాగా ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గ్రామ కార్యదర్శులకు పని భారం తగ్గనుందన్న అభిప్రాయాలున్నాయి. ఇదే సమయంలో కొత్త గ్రామపంచాయతీల్లో నూతన నియామకాలు జరపవచ్చన్న అంచనాలతో ఆశలు పెంచుకుంటున్నారు.

- జారీ కాని మార్గదర్శకాలు..

జాతీయ ఉపాధిహామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రటించి నెల గడుస్తున్నప్పటికీ ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ కాలేదు. 15 సంవత్సరాల పాటు సేవలందించిన ఫీల్డ్‌ అసిస్టెంట్లను ప్రభుత్వం ఒక్కసారిగా తొలగించడంతో పలు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 19 నెలల పాటు చేసిన ప్రయత్నం ఫలించి ఎట్టకేలకు ప్రభుత్వం సానుకూల ప్రకటన జారీ చేసింది. అయినప్పటికీ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు, మార్గదర్శకాలు వెలువడకపోవడంతో ఫీల్డ్‌అసిస్టెంట్లు తిరిగి విధుల్లోకి చేరలేకపోతున్నారు. ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఉత్తర్వులు జారీ చేస్తుందా... తిరిగి విధుల్లోకి ఎప్పుడు చేరుతామా అని సంబంధిత ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఎదురుచూపులతో గడుపుతున్నారు.


Updated Date - 2022-04-30T06:31:54+05:30 IST