కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న బీజేపీ బహిష్కృత మంత్రి

ABN , First Publish Date - 2022-01-21T22:52:02+05:30 IST

ఉత్తరాఖండ్‌కు త్వరలోనే ఎన్నికలు జరగనున్న వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న బీజేపీ బహిష్కృత మంత్రి

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌కు త్వరలోనే ఎన్నికలు జరగనున్న వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బీజేపీ బహిష్కృత మాజీ మంత్రి హరక్ సింగ్ రావత్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రావత్‌ను ఇటీవల కేబినెట్ నుంచి తొలగించిన బీజేపీ.. ఆయన ప్రాథమిక సభ్యత్వాన్ని ఆరేళ్లపాటు బహిష్కరించింది.


బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేతలను రావత్ కలుసుకున్నారు. తనకున్న రాజకీయ పలుకుబడితో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు కనీసం పది సీట్లు సంపాదించి పెట్టగలనని హామీ ఇచ్చారు. అయితే, హరక్ సింగ్ రావత్ రాకను పార్టీలోని ఓ వర్గం నేతలు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.  


2016లో హరీశ్ సింగ్ రావత్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలోకి పడిపోవడానికి హరక్ సింగ్ రావతే కారణం. కాంగ్రెస్ రెబల్‌గా మారిన ఆయన ఆ తర్వాత బీజేపీలో చేరారు. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హరక్ సింగ్ రావత్ తన బంధువులకు టికెట్లు ఇవ్వాలంటూ బీజేపీపై ఒత్తిడి తెచ్చినట్టు ఆరోపణలున్నాయి.


అయితే, ఈ ఆరోపణలను ఆయన కొట్టివేశారు. హరక్ సింగ్‌ను కేబినెట్ నుంచి తొలగించిన విషయాన్ని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి లేఖ ద్వారా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఉత్తరాఖండ్‌లో వచ్చే నెల 14 ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి.

Updated Date - 2022-01-21T22:52:02+05:30 IST