Abn logo
Oct 25 2021 @ 02:09AM

హుజోర్‌బాద్‌

  • ఇటు ప్రచారం.. అటు ప్రలోభం
  • హుజూరాబాద్‌లో పెరిగిన రాజకీయ వేడి..
  • అగ్రనేతల పర్యటనలు.. ఓటర్లకు హామీలు
  • ఏరులై పారుతున్న మద్యం.. బిర్యానీ పొట్లాలు..
  • గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలకు వల
  • కవర్లలో డబ్బులు నింపి ఓటర్లకు అందజేత..
  • ఖరీదైన ఎన్నికంటున్న రాజకీయ నిపుణులు


హుజూరాబాద్‌, అక్టోబరు 24: రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఓవైపు ప్రచారం హోరెత్తుతుండగా.. మరోవైపు ప్రలోభాల జోరు కొనసాగుతోంది. ఏ పార్టీ అన్న తేడా లేకుండా అందరూ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారు. సభలు, సమావేశాలు, సదస్సుల్లో హామీలు గుప్పిస్తున్నారు. అగ్రనేతల పర్యటనలు, కిందిస్థాయి నేతల జంపింగ్‌లతో పోలింగ్‌ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయం మరింత వేడెక్కుతోంది. టీఆర్‌ఎస్‌ తరఫున హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌తోపాటు ఇతర మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన పలువురు టీఆర్‌ఎస్‌ నేతలను హుజూరాబాద్‌కు రప్పించి ఇంటింటి ప్రచారాన్ని టీఆర్‌ఎస్‌ జోరుగా నిర్వహిస్తోంది. బీజేపీ కూడా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితరులతో ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ తరఫున టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క సహా కీలక నేతలు ప్రచారం చేస్తున్నారు.


కాగా, ఎన్నికల్లో సాధారణంగా పోలింగ్‌కు ముందురోజు చోటుచేసుకునే ప్రలోభాలు హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక ప్రచారానికి తెరలేచిన నాటినుంచే కొనసాగుతున్నాయి. ప్రధానంగా టీఆర్‌ఎస్‌, బీజేపీలు ఓటర్లకు నజరానాలు అందిస్తున్నట్లు విమర్శలున్నాయి. మద్యం ఏరులై పారుతోంది. ఇంటింటికీ బిర్యానీ పొట్లాలు అందిస్తున్నారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండడంతో నియోజకవర్గానికి సమీప మండలాలు, గ్రామాలను అడ్డాగా మార్చుకొని ప్రచార, ప్రలోభాల వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం నియోజకవర్గంలోని వావిలాల గ్రామంలో పర్యటించిన సందర్భంగా మంత్రి హరీశ్‌రావు అక్కడి ప్రజలకు కొత్త మండలం ఏర్పాటుకు హామీనివ్వడం చర్చనీయాంశమైంది.


హుజూరాబాద్‌ ఉప ఎన్నిక దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రచారానికి వెళితే లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. సాయంత్రమైతే చాలు గ్రామాలన్నీ బార్లుగా మారుతున్నాయి. కుల సంఘాల వారీగా కూర్చొబెట్టి దావత్‌లు ఇస్తున్నారు. కాగా, బీజేపీ తరఫున పోటీ చేస్తున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు అత్యంత సన్నిహితులైనవారు టీఆర్‌ఎ్‌సలో చేరారు. దీంతో ఆయన కొత్త నాయకులను తయారు చేసుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఈ పోటాపోటీ ప్రచారంతో గోడమీది పిల్లులకు డిమాండ్‌ ఏర్పడింది. ఇలాంటివారికి తాయిలాల ఆశ చూపి తమ వైపు లాక్కోవడానికి ప్రధాన రాజకీయపక్షాల నాయకులు వలలు విసురుతున్నారు. మరోవైపు గ్రామస్థాయిలోని ద్వితీయశ్రేణి నాయకులు, కార్యర్తలను ఆకర్షించడానికి ప్రయత్నాలు జరుపుతున్నారు. విందులు, వినోదాలు కాకుండా.. ఏకంగా డబ్బులపైనే దృష్టి కేంద్రీకరించారు. అయితే ఈసారి వినూత్న రీతిలో డబ్బులను కవర్లలో పెట్టి మరీ ఓటర్లకు అందిస్తున్నారు. ఇందుకు వేల సంఖ్యలో కవర్లను కొనుగోలు చేసినట్లు తెలిసింది. వంద మంది ఓటర్లకు ఒకరి చొప్పున నాయకులకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు చెప్పుకొంటున్నారు. ఈ మౌనంతో ఏమౌనో..? 

ఇటీవల దాక నాయకులు ప్రచారానికి వెళ్లినప్పుడు ఎవరికి మద్దతు ఇస్తున్నది ఓటర్లు చెప్పేవారు. ప్రస్తుతం ఎవరూ మనోగతాన్ని వెల్లడించడం లేదు. ఏం చెబితే ఏమవుతుందోనని.. గతంలో ఈటలకు సానుభూతిగా మాట్లాడినవారు మౌనం వహిస్తున్నారు. ఇక కొందరు ఓటర్లు ఏ పార్టీ నాయకులు వెళ్తే వారికి జై కొడుతున్నారు. ఉదయం పూట ఒక పార్టీ, సాయంత్రానికి మరో పార్టీ ప్రచారంలో పాల్గొంటున్నారు. నేడు ఒక పార్టీ కండువా వేసుకుంటే, రేపు మరో పార్టీ కండువా కప్పుకొంటున్నారు. ఏ పార్టీ సమావేశం ఏర్పాటు చేసినా జన సమూహానికి ఢోకా ఉండడం లేదు. దీంతో ఓటరు నాడి అంతుచిక్కడం లేదని నేతలు కలవరపడుతున్నారు. చివరికి సర్వే చేస్తున్న సంస్థలకు కూడా ఓటరు మనోగతం ఏమిటో తెలియడం లేదు. ఇంటెలిజెన్స్‌ అధికారులు సైతం ఓటరు నాడిని పట్టడం కష్టంగా ఉందని వ్యాఖ్యానించడం గమనార్హం. 


ఓటర్ల ఫోన్‌ నంబర్ల సేకరణ

ఇల్లందకుంట: హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ఓటర్ల ఫోన్‌ నంబర్లను రాజకీయ పార్టీల నేతలు నోట్‌ చేసుకుంటున్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఇతర జిల్లాలకు చెందిన నేతలు ఎన్నికలకు 72 గంటల ముందు ఇక్కడినుంచి వెళ్లిపోవాల్సి ఉండడంతో ఆ తరువాత ఫోన్‌ ద్వారా ఓట్లు అభ్యర్థించడానికే ఇలా సేకరిస్తున్నారని కొందరు భావిస్తున్నారు. ఓటర్లకు నగదు పంపిణీ చేయడానికి ఇబ్బందులు తలెత్తితే యూపీఐ ద్వారా ఓటర్లుకు నగదు బదిలీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు ఉపాధి కోసం దూరప్రాంతాల్లో ఉన్నవారికి టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు ఫోన్‌ చేసి ఓటు వేయడానికి తప్పకుండా రావాలని కోరుతున్నారు. ఇక గ్రామాల్లో ఉండే ఓటర్లు ప్రతిరోజూ తమ సెల్‌ఫోన్లకు బ్యాంకుల నుంచి ఏమైనా సందేశం వచ్చిందా అని పరిశీలించుకుంటుండడం గమనార్హం.