వేగంగా వ్యాక్సిన్‌.. సాధ్యమే!

ABN , First Publish Date - 2020-07-10T06:42:03+05:30 IST

ఆగస్టు 15కల్లా కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను రూపొందించడమే లక్ష్యమని ఐసీఎంఆర్‌ ప్రకటించింది! మరి.. అంత వేగంగా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడం సాధ్యమేనా? ఆలోగా ట్రయల్స్‌ పూర్తి చేయగలరా? అంటే.. సాధ్యమేనని కొందరు వైద్యనిపుణులు...

వేగంగా వ్యాక్సిన్‌.. సాధ్యమే!

  • ఫేజ్‌-1 ట్రయల్స్‌కు పట్టేది నెల రోజులే
  • అనుమతులు, ఫైలింగ్‌తోనే ఆలస్యం
  • భారత్‌ బయోటెక్‌ అధికారి వెల్లడి
  • పరీక్షలు పక్కాగానే నిర్వహిస్తాం
  • విధానపరమైన ప్రక్రియ వేగవంతం
  • ఆగస్టు 15 డెడ్‌లైన్‌పై ఐసీఎంఆర్‌


ఆగస్టు 15కల్లా కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను రూపొందించడమే లక్ష్యమని ఐసీఎంఆర్‌ ప్రకటించింది! మరి.. అంత వేగంగా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడం సాధ్యమేనా? ఆలోగా ట్రయల్స్‌ పూర్తి చేయగలరా? అంటే.. సాధ్యమేనని కొందరు వైద్యనిపుణులు అంటున్నారు.  సుదీర్ఘంగా జరిగే వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ ప్రక్రియలో అసలు పరీక్షలకు పట్టే సమయం తక్కువని, దానికి సంబంధించిన అనుమతులు, ఇతరత్రా ఫైలింగ్‌ ప్రక్రియలకే ఎక్కువ సమయం పడుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఐసీఎంఆర్‌ చేస్తున్నది ఆ విధానపరమైన ప్రక్రియలను వేగవంతం చేయడమేనని వివరిస్తున్నారు. కోవాగ్జిన్‌ను రూపొందిస్తున్న భారత్‌ బయోటెక్‌కు చెందిన ఒక అధికారి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ‘‘సాధారణంగా మానవ పరీక్షల్లో భాగంగా.. వ్యాక్సిన్‌ వేయించుకున్నవారి ఆరోగ్యాన్ని నెలరోజులపాటు పరిశీలించాల్సి ఉంటుంది. మిగతా సమయమంతా ఎథిక్స్‌ కమిటీ అనుమతులకు, ట్రయల్స్‌ నిర్వహిస్తున్న శాస్త్రజ్ఞులు తమ నివేదికలను డీసీజీఐకు సమర్పించడానికి, తదితరాలకు పడుతుంది. కాబట్టి, మేం పరీక్షల వరకూ నిర్ణీత ప్రొటోకాల్‌ ప్రకారమే చేస్తాం. నివేదికల సమర్పణ, అనుమతుల వంటి విధానపరమైన అంశాలకు పట్టే సమయాన్ని మాత్రమే తగ్గిస్తాం’’ అని ఆయన వివరించారు.


మనదేశంలో వ్యాక్సిన్‌ ట్రయల్స్‌కు సంబంధించి అధికారిక రిజిస్ట్రీ అయిన.. ‘క్లినికల్‌ ట్రయల్‌ రిజిస్ట్రీ ఆఫ్‌ ఇండియా (సీటీఆర్‌ఐ)’కి ఇచ్చిన నివేదికలోనూ భారత్‌ బయోటెక్‌ ఇదే విషయాన్ని రాతపూర్వకంగా పేర్కొంది. దాని ప్రకారం.. కోవాగ్జిన్‌ తొలి దశ పరీక్షల్లో పాల్గొన్నవారిపై ఆ వ్యాక్సిన్‌ ప్రభావం ఎంతమేరకు ఉంది?, అది ఎంతవరకూ సురక్షితం?, రోగనిరోధక వ్యవస్థను ఏమేరకు ఉత్తేజితం చేసింది వంటి వివరాలను భారత్‌ బయోటెక్‌ 28 రోజుల తర్వాత సీటీఆర్‌ఐకి సమర్పించాలి.  ఇక, ఫేజ్‌-2 పరీక్షలను ‘ర్యాండమైజ్డ్‌ డబుల్‌ బ్లైండ్‌’ విధానంలో నిర్వహిస్తారు. అంటే.. పరీక్షల్లో పాల్గొనేవారిని రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఒక గ్రూపులోనివారికి కోవాగ్జిన్‌ను ఇస్తారు. మరో గ్రూపులోనివారికి ప్లాసిబో (సెలైన్‌ వాటర్‌ లేదా వేరే  వ్యాక్సిన్‌ (ఇప్పటికే సురక్షితమని నిరూపితమైన వ్యాక్సిన్‌)) ఇస్తారు. రెండో దశ పరీక్షల నిర్వహణకు 12 ఏళ్ల నుంచి 65 ఏళ్లలోపున్న ఆరోగ్యవంతులను ఎంచుకుంటారు. వారికి ఫేజ్‌ 1 ట్రయల్స్‌ ఫలితాల ఆధారంగా నిర్ణీత డోసులో మొదటిరోజు, 14వ రోజు.. అంటే రెండుసార్లు వాక్సిన్‌ ఇస్తారు. రెండో దశలో ఇచ్చిన వ్యాక్సిన్‌ రోగనిరోధక వ్యవస్థను ఎంతమేరకు ఉత్తేజితం చేసిందనే విషయాన్ని 14వ రోజున, 28, 104, 194 రోజుల్లో పరిశీలిస్తారు. ఈ దశలో కూడా దాదాపు నెలరోజుల్లోనే వ్యాక్సిన్‌ పనితీరుపై ఒక అంచనా వచ్చేస్తుంది. కాగా కొవిడ్‌-19కు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడంలో విజయం సాధించిన జైడస్‌ కాడిలా కూడా 1000 మందిపై మానవ పరీక్షలకు సిద్ధమైంది. ఆ సంస్థ తయారుచేసిన ‘జైకొవ్‌-డి’ వ్యాక్సిన్‌.. డీఎన్‌ఏ ఆధారిత వ్యాక్సిన్‌. దాంతో ఈ నెలలోనే మానవ పరీక్షలను ప్రారంభించనున్నట్టు జైడస్‌ కంపెనీ  తెలిపింది.  ఆగస్టు 15లోగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేవడమే లక్ష్యం అంటూ ఐసీఎంఆర్‌ పెట్టిన డెడ్‌లైన్‌పై విమర్శలు రావడంతో.. ఆ సంస్థ కూడా ఇదే విషయాన్ని ఒక బహిరంగ లేఖ ద్వారా స్పష్టం చేసింది. ‘‘క్లినికల్‌ట్రయల్స్‌ నిర్వహించే ఆస్పత్రులకు ఐసీఎంఆర్‌ డీజీ రాసిన లేఖ.. పరీక్షల విషయంలో అనవసరమైన రెడ్‌టేపిజానికి అడ్డుకట్ట వేయడానికి, పార్టిసిపెంట్లను త్వరగా ఎంపిక చేసుకోవాలని చెప్పడానికి ఉద్దేశించింది. అంతే తప్ప.. వ్యాక్సిన్‌ ట్రయల్స్‌లో తప్పనిసరి అయిన ఏ ప్రక్రియనూ వదిలిపెట్టే ప్రసక్తి లేదు.  వీలైనంత వేగంగా ఈ పరీక్షలను పూర్తిచేయడమే మా లక్ష్యం’’ అని ఐసీఎంఆర్‌ ఆ లేఖలో పేర్కొంది. 


వ్యాక్సిన్‌ వచ్చినప్పుడు తెలుస్తుంది!

‘‘వ్యాక్సిన్‌ వచ్చినప్పుడు తెలుస్తుంది కదా.. తొందర దేనికి’’.. భారత్‌ బయోటెక్‌ రూపొందిస్తున్న కోవాగ్జిన్‌ టీకా గురించి ప్రశ్నించినప్పుడు కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి వ్యక్తం చేసిన ధీమా ఇది! కరోనాకు అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్‌ను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తేవాలన్న ధ్యేయంతో ప్రధాని మోదీ ఉన్నారని, అందువల్లే ఆరేళ్లలో జరగాల్సిన ప్రక్రియను 6 నెలల్లో పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని డ్రగ్‌ కంట్రోలర్‌ అధికార వర్గాలు తెలిపాయి. అలాగని.. పరీక్షలకు అనుమతి పొందిన వైద్య సంస్థలపై ఎలాంటి ఒత్తిడి ఉండ దన్నారు. ఈ కంపెనీలు మానవ పరీక్షలు పూర్తి చేసేందుకు డిసెంబర్‌ వరకూ పట్టొచ్చని, అయితే మొదటి, రెండు దశల్లో పరీక్షలు విజయవంతమైతే మూడో దశకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. అక్టోబర్‌ నాటికి వాక్సిన్‌ అందుబాటులోకి రావచ్చని భరోసా వ్యక్తం చేశారు.


ఇనాక్టివేటెడ్‌ టీకా.. సురక్షితమే!

వ్యాక్సిన్‌ తయారీలో రకరకాల పద్ధతులను అనుసరిస్తారు. వాటిలో అత్యంత సురక్షితమైనది నిర్వీర్యం చేసిన వైర్‌సను వ్యాక్సిన్‌ రూపంలో శరీరంలోకి ప్రవేశ పెట్టడం. ఈ తరహా వ్యాక్సిన్లను ఇనాక్టివేటెడ్‌ వ్యాక్సిన్స్‌ అంటారు. ఐపీవీగా వ్యవహరించే పోలియో వ్యాక్సిన్‌ (ఇనాక్టివేటెడ్‌ పోలియో వ్యాక్సిన్‌) ఇలాంటిదే. ఈ వ్యాక్సిన్లను వేయించుకున్నవారికి ఎలాంటి ఇన్ఫెక్షన్లూ రావు. వ్యాక్సిన్‌లోని వైర్‌సలు పూర్తిగా నిర్వీర్యమై ఉండటంతో శరీరంలోకి ప్రవేశించాక తమ సంఖ్యను పెంచుకోలేవు. కానీ, వాటి రాకతో రోగ నిరోధక వ్యవస్థ మాత్రం ఉత్తేజితమవుతుంది. శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. భారత్‌ బయోటెక్‌ ఉత్ప త్తి చేస్తున్న వ్యాక్సిన్‌తో ఇన్ఫెక్షన్‌ రాదు. కాబట్టి.. కోవాగ్జిన్‌తో రోగనిరోధక వ్యవస్థ ఎంతవరకూ ఉత్తేజితమైందనే విషయాన్ని శాస్త్రజ్ఞులు పరిశీలిస్తే సరిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 


ఆక్స్‌ఫర్డ్‌ టీకా.. జనవరిలోనే మొదలు

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరిలోనూ ఆశలు రేకెత్తిస్తున్న వ్యాక్సిన్లు.. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ టీకా, మోడెర్నా కంపెనీ రూపొందిస్తున్న టీకా, చైనాకు చెందిన సినోవాక్‌ సంస్థ రూపొందిస్తున్న టీకా. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ఈ ఏడాది జనవరి 10న కరోనా టీకా తయారీకి నడుం బిగించింది. వ్యాక్సిన్‌ను చాలా వేగంగా అభివృద్ధి చేసి ఇప్పటికే 1, 2 దశల మానవ పరీక్షలను ముగించుకుని, మూడో దశ మానవ పరీక్షల దశకు చేరింది. అక్టోబరు లేదా ఈ ఏడాది చివరికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని అంచనా. ఇక, అమెరికాకు చెందిన మోడెర్నా ఫార్మా సంస్థ జనవరి 13న ప్రయోగాలు చేపట్టింది. 25 రోజుల్లో వ్యాక్సిన్‌ను తయారు చేసింది. ఫిబ్రవరి 24న తొలి దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు, మార్చి 27 నాటికి తొలి దశ మానవ పరీక్షలకు సిద్ధమైంది. బుధవారానికి రెండో దశ మానవ పరీక్షల నమోదు ముగిసింది. ఈ వ్యాక్సిన్‌ 2021లో అందుబాటులోకి వస్తుందని అంచనా. అటు, చైనాకు చెందిన సినోవాక్‌ బయోటెక్‌ లిమిటెడ్‌ సంస్థ కూడా జనవరి చివర్లో సినోవాక్‌ వ్యాక్సిన్‌ అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ఏప్రిల్‌ నాటికి మానవ పరీక్షల దశకు చేరుకుంది. బ్రెజిల్‌లో మూడో దశ పరీక్షలను ప్రారంభించింది.


వేగంగా.. ఆ రెండు వ్యాక్సిన్లు

ఇప్పటిదాకా అత్యంత వేగంగా అభివృద్ధి అయింది.. గవద బిళ్లల వ్యాక్సిన్‌. 1967లో ఆ వైరస్‌ ఐసోలేషన్‌ నుంచి వ్యాక్సిన్‌కు అనుమతి రావడం వరకు 4 ఏళ్లు పట్టింది. ఎబోలా వైరస్‌ను 2014లో ఐసోలేట్‌ చేసి 2019 కల్లా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు భారత్‌ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్‌ అందుబాటులోకి వస్తే ఇదే అత్యంత వేగంగా అభివృద్ధి అయిన వ్యాక్సిన్‌.


మా వ్యాక్సిన్‌ ఆర్నెల్ల తర్వాతే!

సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడి

ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ, ఆస్ట్రాజెనెకా కలిసి రూపొందించిన వ్యాక్సిన్‌ సామర్థ్యాన్ని, అది ఎంతవరకూ సురక్షితమనే విషయాన్ని ధ్రువీకరించుకున్నాకే ప్రజలకు అందుబాటులోకి తెస్తామని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదార్‌ పూనావాలా తెలిపారు. అందుకు 6 నెలలు పడుతుందన్నారు. భారత్‌లో ఆ వ్యాక్సిన్‌ ఉత్పత్తి, సరఫరాకు ఆస్ట్రాజెనెకాతో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కలిసింది.


-సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - 2020-07-10T06:42:03+05:30 IST