Abn logo
May 8 2021 @ 04:06AM

కొవిషీల్డ్‌ డోసుల మధ్య గడువు పెంపు!

మొదట్లో 4 నుంచి 6 వారాల గడువు

ఆ తర్వాత 6 నుంచి 8 వారాలకు పెంపు

పరిశీలనలో ఇంకా పెంచే ప్రతిపాదన 

వచ్చేవారం నిర్ణయం తీసుకునే అవకాశం


న్యూఢిల్లీ, మే 7: కొవిషీల్డ్‌ టీకా డోసుల మధ్య సమయాన్ని మరింతగా పెంచే ప్రతిపాదనలను ప్రభుత్వ నిపుణుల బృందం పరిశీలిస్తోంది. వచ్చేవారంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తొలుత ఈ టీకా మొదటి డోసు తీసుకున్న నాలుగు నుంచి ఆరువారాల వ్యవధిలో రెండో డోసు తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఏప్రిల్‌లో.. ఆ సమయాన్ని ఆరువారాల నుంచి ఎనిమిది వారాలకు పెంచిన సంగతి తెలిసిందే. అయితే.. మొదటి డోసుకు, రెండో డోసుకు నడుమ 12 వారాల గడువు ఉంటే కొవిషీల్డ్‌ సామర్థ్యం 81.3 శాతంగా ఉంటుందని ఒక అధ్యయనంలో తేలింది. అదే ఆరువారాల తేడాతో రెండు డోసులూ వేస్తే దాని సామర్థ్యం 55.1 శాతంగా ఉన్నట్టు వెల్లడైంది.


ఆ అధ్యయననివేదిక లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమైంది. ఆస్ట్రాజెనెకా సైతం 12 వారాల వ్యవధితో రెండు డోసులు తీసుకుంటే 82ు ప్రభావశీలత ఉంటుందని ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలిపింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ వైద్యనిపుణుల బృందం ఈ అంశంపై దృష్టి సారించింది. యూకేలో కొవిషీల్డ్‌ టీకాను 12 వారాల తేడాతో వేస్తుండగా.. కెనడాలో మొదటి డోసు వేసిన 16 వారాలకు రెండో డోసు వేస్తున్నారు. ఈ క్రమంలోనే మన దేశంలో కూడా రెండు డోసుల మధ్య సమయాన్ని పెంచితే రెండు విధాలుగా ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు. ఒకటి.. వ్యాక్సిన్లకు ప్రస్తుతం ఉన్న భారీ గిరాకీని కొంత మేర తగ్గిస్తుంది. అంటే మొదటి డోసు వేసుకున్నవారు మళ్లీ రెండో డోసు కోసం రావడానికి 3 లేదా 4 నెలల సమయం పడుతుంది. దీనివల్ల సరఫరా సంక్షోభానికి కాస్త అడ్డుకట్ట పడుతుంది. మే 1 నుంచి 18 ఏళ్లు దాటినవారందరికీ టీకా వేయాలన్న ప్రభుత్వ నిర్ణయం కొంత సాఫీగా అమలు కావడానికి అది ఉపయోగపడుతుంది.


రెండో ప్రయోజనం.. వీలైనంత ఎక్కువ మందికి కనీసం మొదటి డోసు వేయడం ద్వారా వారి ప్రాణాలను కాపాడినట్టవుతుంది. ‘కొరియా డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ఏజెన్సీ (కేడీసీఏ)’ గణాంకాల ప్రకారం.. కొవిషీల్డ్‌ టీకా వేసుకున్న 60 ఏళ్లు పైబడినవారిలో టీకా తీసుకున్న 15 రోజులకే 86ు రక్షణ లభిస్తోందని తేలింది. కాబట్టి, వీలైనంత ఎక్కువ మంది కనీసం ఒక డోసు వేయడం ద్వారా వారికి రక్షణ కల్పించవచ్చు.

Advertisement