Abn logo
Sep 25 2021 @ 00:40AM

అది స్వాతంత్ర్యం కాదు, అధికార బదిలీ

ఇండియన్ డొమీనియన్ స్టేటస్ బిల్ శీర్షికతో స్వాతంత్ర్యం ఇవ్వడానికి సంబంధించిన తొలి ముసాయిదా రూపొందింది. అయితే ఇది సామ్రాజ్యవాదుల ట్రిక్ అని, సంపూర్ణ స్వాతంత్ర్యం కాదని ప్రజలు భావిస్తారేమోననే -సందేహంతో క్రిప్స్ సూచన మేరకు- ఇండియన్ ఇండిపెండెన్స్ బిల్‌గా శీర్షికను మార్చారు. లోపలి సారం మాత్రం అదే. ఇండియాలో ఇండియా, పాకిస్థాన్‌ అన్న రెండు స్వతంత్ర డొమీనియన్లను ఆగస్టు 15నుంచి నెలకొల్పాలని అందులో పేర్కొన్నారు.


ఆంధ్రజ్యోతిలో సెప్టెంబరు 4న ‘స్వాతంత్ర్యం అర్ధరాత్రే ఎందుకు వచ్చింది’ అనే శీర్షికన రాసిన వ్యాసంలో విశ్రాంత ఐఏయస్ అధికారి బిపి ఆచార్య కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. ‘ఫ్రీడం ఎట్ మిడ్‌నైట్’ పుస్తకాన్ని, అందులో మౌంట్‌బాటెన్ ఇంటర్వ్యూను ఆయన ఉటంకించారు. ‘వైస్రాయి అహంకారపూరిత నిర్ణయానికీ, జ్యోతిష్యోపాయానికీ మధ్య రాజీ ఫలితంగా ఆగస్టు 15 అమావాస్యను తప్పించుకోవడానికి- 14అర్ధరాత్రే ‘అధికార బదిలీ’ చేశారు. ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా వైస్రాయే తేదీ నిర్ణయించారు. మన నాయకులు దానికి సమ్మతించడం చాలా నిరుత్సాహం కలిగించింద’ని ఆయన అన్నారు. పటేల్‌, కృపలానీ అమావాస్య నాడు వద్దని గట్టిగా చెప్పడం, ‘చతుర జ్యోతిష్కుల’ రాజీ పరిష్కారం గురించి ఆచార్య తెలిపారు.


‘స్వాతంత్ర్య అమృతోత్సవం’లో భాగంగా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనది: రాజీ ముహూర్తం గురించి కాదు, అసలు జరిగిన విషయంలోనే మతలబు ఉందని. ఆనాటి తంతులో జరిగింది అధికార బదిలీయే కానీ, స్వాతంత్ర్యం అన్నమాటే అందులో లేదు. ఫాసిస్టు జపాను లొంగిపోయిన రోజు అని ఆగస్టు 15ను నిర్ణయించినట్టు మౌంట్‌బాటెన్ చెప్పారు. మన పాలకులకు దానికన్నా ముహూర్తం ముఖ్యమైంది! తేదీని నిర్ణయించడంలో మౌంట్‌బాటెన్ కీలకపాత్ర ఉన్నా, నాటి బ్రిటిషు పార్లమెంటు ఆమోదించిన చట్టంలోనే ఆ తేదీ ఉంది.


అప్పటి చర్చిల్, అట్లీ మంత్రివర్గాల్లో, మౌంట్‌బాటెన్ టీంలో సభ్యుడైన ‘ఎర్ల్‌ ఆఫ్ లిస్టోవెల్’ కొన్ని విషయాలు వెల్లడించారు. ఆయన మౌంట్‌బాటెన్ 80వ పుట్టినరోజు ఉపన్యాసంలో (1980జూన్ 24) ఇలా చెప్పారు: ఇండియన్ డొమీనియన్ స్టేటస్ బిల్ శీర్షికతో స్వాతంత్ర్యం ఇవ్వడానికి సంబంధించిన తొలి ముసాయిదా రూపొందింది. అయితే ఇది సామ్రాజ్యవాదుల ట్రిక్ అని, సంపూర్ణ స్వాతంత్ర్యం కాదని ప్రజలు భావిస్తారేమోననే -సందేహంతో క్రిప్స్ సూచన మేరకు- ఇండియన్ ఇండిపెండెన్స్ బిల్‌గా శీర్షికను మార్చారు. లోపలి సారం మాత్రం అదే. ఇండియాలో ఇండియా, పాకిస్థాన్‌ అన్న రెండు స్వతంత్ర డొమీనియన్లను ఆగస్టు 15నుంచి నెలకొల్పాలని అందులో పేర్కొన్నారు. ఇక్కడ, ఇండియాలో నెలకొల్పడమంటే నాటి బ్రిటిష్‌ ఇండియాలో అనే. రెంటికీ ఒకే గవర్నరు జనరల్ ఉంటారనీ వారే నిర్ణయించారు. కాంగ్రెసు, ముస్లింలీగు, సిక్కు ప్రతినిధులు అంగీకరించిన ‘మౌంట్‌బాటెన్ ప్లాను’ ప్రకారమే ఈ బిల్లును రూపొందించారు. అధికార బదిలీకి ఈ పక్షాల మధ్య రాజీ కుదిరింది. ఇద్దరూ కూడా కామన్‌వెల్త్‌లో కొనసాగాలని కోరుకున్నారని మౌంట్‌బాటెన్ చెప్పడంతో ఆశ్చర్యపోయామన్నారు నాటి బ్రిటిషు సెక్రటరీ ఆఫ్ స్టేట్(ఎర్ల్). అందరికీ ఆమోదయోగ్యంగా డొమీనియన్ స్టేటస్ బిల్లు ముసాయిదాకు అక్షర రూపమిచ్చింది మన విపి మీనన్. ఆయన ముగ్గురు వైస్రాయిలకు కార్యదర్శి, కుడిభుజమూను.


బ్రిటిషు జడ్జి రాడ్‌క్లిఫ్ (Radcliffe) కమిషన్‌ డొమీనియన్ల సరిహద్దుల గురించి నిర్ణయం తీసుకుంది. ఆయన పేరిటే ఉన్న ఆ రేఖను అమలుచేసింది- జనరల్ బౌచర్ నేతృత్వంలోని బ్రిటిష్‌ ఆర్మీ. ఆగస్టు 15తర్వాత ఇంకో రెండేళ్ళు కూడ ఆ ఆర్మీ కొనసాగింది. ‘అది భారత ప్రజలకు వ్యతిరేకంగా సామ్రాజ్యవాదుల ప్రయోజనాల కోసం నిర్మించిన కిరాయిసైన్యం (mercenary army); ప్రజలతో, జాతీయలక్ష్యాలతో సంబంధం లేకుండా, బ్రిటిషు వారసత్వంగా మనకు మిగిలిన ఆర్మీ’ అని బ్రిగేడియర్ జెఆర్ దల్వీ (‘హిమాలయన్ బ్లండర్’ పుస్తక రచయిత)అభివర్ణించారు. పై విషయాలన్నిటికీ అంగీకరించిన నాయకులు నెహ్రూ, పటేలు, జిన్నాలు. ఈ మౌలికాంశాలలో వారి మధ్య తేడాలేమీ లేవు. ఈ విషయాన్నే మౌంట్‌బాటెన్ గాంధీకి చెప్పడంతో, ఆయనా ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయారు!


ఆగస్టు 15-–16 విషయాల గురించి ఆ మర్నాడే వైస్రాయి ఇచ్చిన రిపోర్టు నం.17 (IOR:L/PO/ 6/123)లో ఇలా నమోదు చేశారు: పాకిస్థాన్ స్వాతంత్ర్య కార్యక్రమం అవగానే 14వ తేదీ మధ్యాహ్నం కరాచీ నుంచి ఢిల్లీకి వచ్చాం. 14 అర్థరాత్రి రాజ్యాంగసభ సెషన్లో అధికార బదిలీ పూర్తయిందని రాజేంద్రప్రసాదు, నెహ్రూ ఆ రాత్రే 12.20కి కలిసి చెప్పారు. మంత్రివర్గ జాబితా అని ఒక కవరిచ్చారు. మర్నాడు ఉదయం 8.30కి ప్రమాణస్వీకారం. వైస్రాయిభవన్ నుంచి కౌన్సిల్ చాంబర్‌కు వెళ్లాం. ఆ కాస్త దారిపొడుగునా గాంధీ నెహ్రూలకే కాక మౌంట్‌బాటెన్ కీ జై అంటూ నినాదాలు! నా సూచన తర్వాత నెహ్రూ బ్రిటిషు జెండాను దించే కార్యక్రమాన్ని మానేశారు. మాకు ఘనసత్కారం చేశారు! బ్రిటిషురాజుకు తమ విధేయపూర్వక కృతజ్ఞతలు తెలుపమని రాజేంద్రప్రసాదు, నెహ్రూ తమ ఉపన్యాసంలో పేర్కొన్నారు. ఆగస్టు 17వ తేదీన బొంబాయి నుంచి బ్రిటిషుసేనలు ఓడల్లో వెళ్లిపోయాయి. ఆ రోజు ఢిల్లీ కన్నా ఘనంగా దారిపొడుగునా లక్షలాది మంది ‘ఇంగ్లండు జిందాబాద్. జై ఇంగ్లండు’ నినాదాలిచ్చారు. మర్చిపోలేని ఘటనలు అవి.(మౌంట్‌బాటెన్ కథనం).  


ఆగస్టు 15 నాటి ఒక ఉదంతం గురించి అంబేడ్కర్‌ కూడా నమోదు చేశారు. ఒక బ్రాహ్మణుడు స్వతంత్ర భారత తొలిప్రధాని అయ్యే సందర్భంగా పండితులు నిర్వహించిన ఒక యజ్ఞంలో నెహ్రూ పాల్గొని, వారిచ్చిన రాజదండం చేపట్టారు. వారిచ్చిన పవిత్ర గంగాజలం స్వీకరించారు. ఆ తర్వాత కొంతకాలానికి రాష్ట్రపతి రాజేంద్రప్రసాదు బహిరంగంగా 200 మంది బ్రాహ్మణుల కాళ్లు కడిగి, ఆ నీళ్లు తాగారు. (1955 డిసెంబరు నాటి భాషా రాష్ట్రాలపై చేసిన రచనలో దీని గురించి ఉటంకించారు. BAWS Vol 1, p.149). 


గాంధీ, నెహ్రూ, పటేల్‌ల గూర్చి ఆయా వర్గాలు గొప్పలు చెప్తుంటాయి. బ్రిటిషువారితో రాజీపడి, కామన్‌వెల్త్‌లో భాగంగా డొమినియన్ ప్రతిపత్తికి వీరంతా అంగీకరించి, ‘విధేయంగా’ తల ఒగ్గినవారేనని చారిత్రకపత్రాలు చాటుతున్నాయి. నేటికీ రాజద్రోహంతో సహా నాటి చట్టాలే, మై లార్డ్ వంటి కోర్టు పద్ధతులే, వేషాలే అమల్లో ఉన్నాయి. ఆనాటి భవంతులలో, అంతకన్నా విలాసంగా ఉన్నారు ఆ నేతలంతా. గాంధీ మాత్రం లాంచనాలకు దూరంగా ఉండిపోయారు. మరో 5నెలలకు -ఉక్కుమనిషి పటేల్‌ హోంమంత్రిగా ఉండగానే జరిగిన ఒకటి రెండు విఫలయత్నాల తర్వాత కొందరు ’హిందూ దేశభక్తులు’ కుట్రపన్ని గాంధీని గురితప్పకుండా కాల్చి చంపిన సంగతి తెలిసిందే.


అధికార బదిలీ గురించి 1946 డిసెంబర్ 31న బ్రిటిషు మంత్రివర్గం తన నిర్ణయం గురించి కొన్ని వ్యాఖ్యలు చేసింది. బ్రిటిషు నిష్క్రమణ తమ బలహీనత వల్ల అని, సామ్రాజ్యం రద్దుకు ఇది తొలిచర్య అని భావించాల్సిన అవసరం లేదని, భారత్‌కు స్వయం పరిపాలన (self-Govt) అనేది ముప్పై ఏళ్లుగా ప్రతిపాదించినదేనని, ఆ పని పూర్తి చేసిన ఘనత తమదేనని చెప్పుకోవాలని ఆ వ్యాఖ్యల సారాంశం. సామ్రాజ్యవాదుల అధికార బదిలీని స్వీకరించి, వారసులుగా కొత్తరాజ్యం నడపడంలో గాంధీ, నెహ్రూ, పటేలు, జిన్నాల మధ్య మౌలిక తేడాలేమీ లేవు. నాటి పాలకవర్గాల మౌలిక ఐక్యత 1947నుంచి నేటికీ కొనసాగుతోంది. అందుకే వారందరి అనుచరులు కూడా తేలిగ్గా పార్టీలు మారి తమ రాజ్యాన్ని నిలబెట్టుకోగలుగుతున్నారు. కులమత తదితరాల ద్వారా ప్రజల మధ్య ఐక్యత ఏర్పడ కుండా చూడటంలోనూ ఒక్కటిగానే ఉన్నారు. ఇక మారి ఐక్యం కావల్సింది ప్రజలే.


యం. జయలక్ష్మి